Warasiguda Mother Incident: పెంచి పోషించిన తల్లి కళ్ల ముందే చనిపోయింది. ఏం చేయాలో తెలియదు. ఆ బాధలో మృతదేహంతో ఉండిపోయారు ఆమె ఇద్దరు కూతుళ్లు. కొన్ని రోజులపాటు అలానే శవంతోనే ఉండిపోయారు. సికింద్రాబాద్ వారాసిగూడలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న మహిళ కొన్ని రోజుల క్రితం మరణించింది. దీంతో ఆమె ఇద్దరు కూతుళ్లు అనాధలుగా మారారు. కొన్ని రోజుల పాటు తల్లి మృతదేహంతోనే ఉన్నారు. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కూతుళ్లు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. వారాసిగూడ లలిత మృతిలో వెలుగులోకి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. గత కొంతకాలంగా బ్రీతింగ్ సమస్యతో బాధపడుతున్న లలిత.. అనారోగ్య సమస్యతోనే మృతి చెందిందని అనుమానం వ్యక్తమవుతోంది. ఆర్థిక ఇబ్బందులతో లలిత ఇద్దరు కూతుళ్ల చదువులు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. దాంతో ఒకరు బట్టల షాప్‌లో, మరొకరు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. తల్లి చనిపోయిన విషయాన్ని కూతుళ్లు గోప్యంగా ఉంచారు.
సికింద్రాబాద్ వారాసిగూడలో విషాదం చోటుచేసుకుంది. తల్లి మృతదేహంతో ఇంట్లోనే కూతుళ్లు వారం రోజుల పాటు ఉన్నారు. ఒక రూమ్‌లో తల్లి శవాన్ని ఉంచుకుని మరో రూమ్‌లో కూతుళ్లు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో తల్లి మృతి చెందగా.. దహన సంస్కారాలకు డబ్బులు లేక ఇంట్లోనే డెడ్ బాడీని ఉంచుకున్నారు. దుర్వాసన రావడంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ కు తరలించారు.
నవంబర్ లో ఇంట్లో అద్దెకు దిగిన వారు గత రెండు నెలలుగా అద్దె చెల్లించడం లేదని ఇంటి ఓనర్ తెలిపారు. వీళ్ల మానసిక పరిస్థితి కూడా సరిగ్గా లేదని స్థానికులు చెబుతున్నారు. రెండు కుక్కలను పెంచుతున్నారని, వాటిని ఎప్పుడూ ఇంట్లోనే ఉంచుతారే తప్ప బయటకు తీసుకురారని కూడా స్థానికులు చెబుతున్నారు. నవంబర్ 1 నుంచి ఇక్కడే అద్దెకు ఉంటున్నారని, వీరి ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఇల్లు ఖాళీ చేయమని చెప్పామని ఇంటి ఓనర్ తెలిపారు. గత రెండు నెలలుగా అద్దె కూడా సరిగ్గా ఇవ్వడం లేదని ఇంటి ఓనర్ చెబుతున్నారు.
Also Read: దారుణం.. ఇంట్లో కుళ్లిపోయిన తండ్రికూతుళ్ల మృతదేహాలు.. అసలు ఏమైందంటే..?
ఐదేళ్ల క్రితం భర్త వదిలి వేయడంతో కలత చెందిన లలిత అనే మహిళ తన కూతుళ్లతో కలసి సికింద్రాబాద్ లో ఉంటోంది. కూతుళ్లు ఇద్దరూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తల్లి చనిపోవడంతో మానసికంగా కుంగిపోయిన వీరిద్దరు కూడా ఆత్మహత్యాయత్నం చేశారు. చేతులు కోసుకుని ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
వారాసిగూడ లలిత మరణంలో తాజాగా మరో విషయం బయటపడింది. లలిత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టు పక్కల వారు కూతుళ్లను ప్రశ్నించినట్లు తెలిసింది. తమ తల్లి చనిపోయిందని, తమ దగ్గర దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేవని కూతుళ్లు చెప్పారని స్థానికులు చెబుతున్నారు. స్థానిక BRS కార్యాలాయానికి వెళ్ళమని స్థానికులు కొందరు సలహా ఇవ్వడంతో కూతుళ్లు ఇద్దరూ అక్కడికి వెళ్లి తమ బాధను తెలియజేశారు. విషయం తెలుసుకున్న BRS నాయకులు ముందుగా పోలీసు స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయమని సూచించారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో లలిత మరణించిన విషయం బయట పడినట్టు స్థానికులు చెబుతున్నారు.