Nalgonda Crime: నేటి సమాజంలో వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. తన మాట వినడం లేదన్న కోపంతో, ఓ మహిళ తన ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ దారుణమైన ఘటన నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఎంతటి దారుణాలకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
కేతపల్లి గ్రామానికి చెందిన నగేష్ యాదవ్‌కు అప్పటికే వివాహమై.. మమత అనే భార్య, ఒక చిన్నారి ఉంది. అయితే.. అదే గ్రామానికి చెందిన సుజాత అనే మహిళతో నగేష్ గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. సుజాతకు కూడా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో.. తన ఇద్దరు కుమార్తెలలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని సుజాత నగేష్‌ను బలవంతపెట్టడం మొదలుపెట్టింది. దీనికి నగేష్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య గత కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతున్నాయి.
తన మాట వినలేదన్న కోపంతో రగిలిపోయిన సుజాత.. నగేష్ కుటుంబాన్ని అంతం చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో నగేష్ ఇంటికి వెళ్ళిన సుజాత, అక్కడ తన చంటి బిడ్డకు పాలిస్తున్న మమతపై ఒక్కసారిగా పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఆ సమయంలో మమత ఒడిలో ఉన్న చిన్నారిని సుజాత దూరంగా విసిరేసింది. మంటలు వేగంగా వ్యాపించడంతో మమత తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఈ దాడిలో దూరంగా విసిరేసిన చిన్నారి కూడా తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. అమానుషంగా ఒక మహిళను సజీవ దహనం చేసిన అనంతరం, నిందితురాలు సుజాత నేరుగా నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి, ఘటన స్థలాన్ని పరిశీలించారు. వివాహేతర సంబంధం వల్ల ఒక నిండు ప్రాణం బలికావడం, పసిపాప అనాథగా మారడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Also Read: పగడ్బందీగా స్కెచ్.. కోఠి ఏటీఎం కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు