ఒక్కో దొంగల ముఠా దొంగతనం చేసే విధానం ఒక్కోలా ఉంటుంది. తాజాగా బెంగళూరులోని దొడ్డబళ్లాపూర్ లో తాళం వేసిన ఇంట్లో రూ.8 లక్షల విలువైన వస్తువులను దోచుకున్న ముఠాను కొద్ది గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో మహిళా జిమ్ ట్రైనర్ సహా నలుగురు దొంగలు ఉన్నారు. వీరిని పురుషోత్తమ(22), అతడి స్నేహితురాలు సౌభాగ్య అలియాస్ లత(24), దర్శన్ అలియాస్ సత్య(20), చంద్రు(24)గా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురు యువకులు ఇటీవలే తుమకూరులో జరిగిన ఒక దొంగతనం కేసుకు సంబంధించి జైలు నుంచి విడుదలయ్యారు. తాజాగా దొడ్డబళ్లాపూర్ దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యారు.
ముగ్గురు దొంగలు రాత్రి పూట రైల్వే పట్టాల వెంబడి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటారని పోలీసులు తెలిపారు. ఏదో ఒక రైలు ఎక్కి.. ఏదో ఒక స్టేషన్ లో దిగుతారు. రైల్వే స్టేషన్ కు చేరగానే ఫోన్లను స్విచ్ ఆఫ్ చేస్తారు. కిలోమీటరుకు పైగా పట్టాల వెంట నడిచి, అక్కడి నుంచి చెప్పులు లేకుండా వెళ్లేవారు. ఆ తర్వాత ఆ ముగ్గురూ తాళం వేసిన ఇళ్ల కోసం వెతికేవారు. ఒక్కొక్కరు ఒక ఇంటిని లక్ష్యంగా చేసుకుని తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లేవారు. 10 నిమిషాల్లోనే ఇంట్లోని విలువైన వస్తువులను దోచుకెళ్లేవారు. మళ్లీ చెప్పులు వదిలిపెట్టిన పట్టాల దగ్గరికి వెళ్లి, అక్కడి నుంచి స్టేషన్‌కు తిరిగి నడిచి వెళ్లేవారు. అక్కడ మరో రైలు ఎక్కి వెళ్లిపోయేవారు. వీరికి సౌభాగ్య అనే లేడీ జిమ్ ట్రైనర్ సాయపడేది. వారు దొంగతనం చేసిన వస్తువులను అమ్మడంతో పాటు ఇళ్లను అద్దెకు తీసుకోవడంలో హెల్ప్ చేసేది. ఒకవేళ వీళ్లు జైలుకు వెళ్తే లాయర్లతో మాట్లాడి బెయిల్ కోసం ప్రయత్నించేది.
సెప్టెంబర్ 17న కొత్తగా పెళ్లైన జంట నుండి రూ. 8 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను దొంగిలించిన తర్వాత వారు పట్టుబడ్డారు. ఇన్‌స్పెక్టర్ సాదిక్ పాషా నేతృత్వంలోని దొడ్డబళ్లాపుర పోలీసు బృందం లేటెస్ట్ టెక్నాలజీతో, నిందితులు వదిన క్లూస్ ఆధారంగా ముగ్గురు దొంగలతో పాటు వారికి సాయం చేసే యువతిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
క్యాటరర్ దగ్గర పని చేస్తున్నానని చెప్పుకునే పురుషోత్తమ వరుస నేరాలకు పాల్పడేవాడు. మైనర్ గా ఉన్నప్పుడే హత్యలు చేశాడు. బిబిఎ డ్రాపౌట్ అయిన దర్శన్ ఒక గిగ్ వర్కర్. 10 కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. పాఠశాల డ్రాపౌట్ అయిన చంద్రు ఒక గ్యారేజీలో పనిచేస్తున్నాడు. ఈ ముఠా హుబ్బళ్లి, ధార్వార్డ్, తుమకూరు, బెంగళూరు, తెలంగాణలో నేరాలకు పాల్పడింది. వీరి మీద చాలా కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి మరిన్ని వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Also: కిడ్నీ అమ్మేసి మరీ ఐఫోన్ కొన్నాడు.. ఇప్పుడు ఆస్పత్రిలో దయనీయ స్థితిలో..