 
					Road Accident: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొత్త జీవితాన్ని ఆరంభించారు. బంగారు జీవితం గడపాలని కలలు కన్నారు. కానీ వారి ఆశలు అడియాశలు అయ్యాయి. కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు రోడ్డు ప్రమాదంలో మృత్యువు బారిన పడగా, యువకుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చాంలేడు గ్రామానికి చెందిన చిలువేరు నవీన్, దామెర గ్రామానికి చెందిన అనూష. ఇద్దరూ ప్రేమించి పెద్దల సమ్మతితో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 14 రోజుల క్రితమే వివాహమైన నవ దంపతులు రోడ్డు ప్రమాదం ఎడబాపింది.
నవీన్ తన భార్య అనూష తో కలిసి బుధవారం సాయంత్రం.. ద్విచక్ర వాహనంపై గుర్రంపోడు వైపు వస్తున్నారు. ఈ క్రమంలో గుర్రంపోడు సమీపంలోని వంతెన మీదకు రాగానే వీరి ద్విచక్ర వాహనం మరో ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో నవీన్ తలకు తీవ్ర గాయమై రోడ్డు పక్కనే అపస్మారక స్థితిలో పడిపోయాడు.
ఘటన సమయంలో భార్య అనూష వంతెన గోడపై నుంచి ఎగిరిపడింది. అక్కడ కిందుగా ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో ఆమె నీటిలో మునిగిపోయింది. ఇది గమనించిన స్థానికులు దాదాపు 20 నిమిషాల తర్వాత ఆమెను ఒడ్డుకు తీసుకువచ్చారు.
అనూషతో పాటు నవీన్‌ను స్థానికులు తక్షణమే నల్గొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అనూష మృతి చెందినట్లు ధృవీకరించగా, నవీన్ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం అతను అత్యవసర చికిత్సలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: ఫ్రెండ్స్‌తో పార్టీ.. మరుసటి రోజు ఎయిర్‌హోస్టెస్ సూసైడ్, ఆ వార్తలపై ఫ్యామిలీ క్లారిటీ
అనూష ఇటీవలే నర్సింగ్ కోర్సు పూర్తి చేసింది. ఉద్యోగంలో చేరాలనుకునే సమయంలో ద్విచక్ర వాహనం రూపంలో అమూషకు మృత్యువు కబళించింది.