Cyber Crime: సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ.. సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మంత్రి నారా లోకేష్ ఫేక్ వాట్సాప్ ప్రొఫైల్ సృష్టించి.. వ్యాపారవేత్తలను మోసగించారు. దుండగులు ఏకంగా రూ.54 లక్షలు దోచుకున్నారు.
సైబర్ నేరగాళ్లు మంత్రి లోకేష్ ఫోటో, పేరు, వాట్సాప్ డీపీతో నకిలీ ప్రొఫైల్ సృష్టించారు. ఆ ప్రొఫైల్ ద్వారా పలువురు వ్యాపారవేత్తలకు మెసేజ్‌లు పంపించి.. ప్రత్యేక ప్రాజెక్టుల కోసం డబ్బు అవసరం ఉంది, తక్షణమే పంపించండి అంటూ మంత్రి తరహాలో మెసేజ్‌లు పంపారు. మొదట కేవలం రూ.2–3 లక్షలు మాత్రమే అడిగి, తిరిగి ఇవ్వబోతున్నట్లు నమ్మకం కలిగించారు. ఆ తర్వాత పెద్ద మొత్తాలను ట్రాన్స్‌ఫర్ చేయమని ఒత్తిడి తెచ్చి, చివరికి మొత్తం రూ.54 లక్షలు వసూలు చేశారు.
మోసానికి గురైన ఒక వ్యాపారవేత్త దీనిపై CID సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించారు. ట్రాన్సాక్షన్‌ల వివరాలు, ఫోన్ నంబర్లు, IP అడ్రస్‌లను సేకరించి ట్రాక్ చేశారు. విచారణలో నిందితులు హైదరాబాద్ నగర పరిధిలోనే ఉన్నట్లు తేలింది.
ఈ నేపథ్యంలో CID అధికారులు మలక్‌పేట్ ప్రాంతంలో దాడి చేసి.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారు సాయిశ్రీనాథ్, సుమంత్ విచారణలో వీరు మోసాన్ని అంగీకరించారు. ఫేక్ సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డబ్బు ట్రాన్స్ఫర్‌కు ఉపయోగించిన పేమెంట్ వివరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను కోర్టులో హాజరుపరచగా.. 14 రోజులు రిమాండ్ విధించారు. వీరి వెనుక మరో కీలక నిందితుడు రాజేష్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాజేష్ ఫేక్ అకౌంట్లు డబ్బు లావాదేవీలు వంటి కీలక పాత్రలు పోషించాడు. గతంలోనే CID పోలీసులు ఏ1 రాజేష్‌ను అరెస్ట్ చేశారు. అతని ఆధారంగా మిగతా నిందితుల గుర్తింపు సులభమైందని అధికారులు తెలిపారు.
Also Read: తిరుమల కల్తీ నెయ్యి కేసు.. తొలి రాజకీయ అరెస్ట్, వైపీసీలో కొత్త టెన్షన్
ఈ ఘటనపై CID అధికారులు హెచ్చరించారు. ప్రముఖులు, మంత్రులు, ఉన్నతాధికారుల పేర్లతో ఎవరైనా మెసేజ్‌లు పంపితే వెంటనే ఫోన్ చేసి ధృవీకరించాలి. ఏ సందర్భంలోనూ ఫేక్ అకౌంట్లకు డబ్బులు పంపకూడదు అని సూచించారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు కొత్త సాంకేతిక పద్ధతులను ఉపయోగిస్తున్నామని, ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.