Nizamabad: నిజామాబాదు జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలో ఈరోజు పట్టపగలే భారీ చోరీ జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇస్లాంపూర్ కాలనీలో నివాసముంటున్న ఓ వ్యక్తి తన ఇంటికి తాళం వేసి పని నిమిత్తం బ్యాంకుకు వెళ్లారు. అదే అదునుగా భావించిన దొంగలు, యజమాని లేని సమయాన్ని చూసి రెచ్చిపోయారు.
తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు బీరువాలో ఉన్న సొత్తును దోచుకెళ్లారు. బాధితుడు తిరిగి వచ్చి చూసేసరికి ఇల్లు అస్తవ్యస్తంగా పడి ఉండటంతో లబోదిబోమన్నారు. ఈ దొంగతనంలో సుమారు 12 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ. 12 లక్షల నగదు మాయమైనట్లు సమాచారం.
ప్రజలు రాకపోకలు సాగించే పట్టపగలే ఇంత పెద్ద ఎత్తున చోరీ జరగడంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
Also Read:నాగర్‌కర్నూల్‌లో వాన బీభత్సం.. తడిసిన ధాన్యం.. రోడ్డెక్కిన రైతన్నలు!