పాముకు పాలిపోసి పెంచితే అది తిరిగి మనల్నే కాటేస్తుంది. మనిషికి అంతకంటే క్రూరమైన మనస్తత్వం ఉంటుందా..? ఈ సంఘటన చూస్తే అది నిజమేననిపిస్తుంది. రోడ్డుపక్కన పడి ఉన్న మూడు రోజుల పసిగుడ్డుని పాపం అనుకుని ఇంటికి తెచ్చి పెంచి పెద్ద చేస్తే.. 13 ఏళ్ల వయసొచ్చాక తనని పెంచి పోషించిన తల్లినే హతమార్చింది ఆ దుర్మార్గురాలు. ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉంటుందా..? ఈ దారుణం ఒడిశాలో జరిగింది.
పాపం అని జాలి తలచి..
ఒడిసా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో రాజ్యలక్ష్మి దంపతులు నివశిస్తుండేవారు. వారికి పిల్లలు లేరు. ఓరోజు రోడ్డుపక్కన ఓ పసికందు ఏడుపు విని వారు ఆగారు. ఏ తల్లి చేసిన పాపమో ఆ పసిబిడ్డకు శాపంగా మారి రోడ్డుపక్కకు వచ్చిపడింది. ఆ పసిబిడ్డను చేతుల్లోకి తీసుకుంది రాజ్యలక్ష్మి. ఆమె భర్త కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ బిడ్డను తమకు దేవుడిచ్చిన బిడ్డగా భావించి ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవాలనుకున్నారు. తమకు ఉన్నంతలో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. కూతురు పెరిగి పెద్దదవుతుంటే వారు మరింత సంతోషించారు. ఆమె అడిగినవన్నీ కొనిచ్చేవారు, గారాబం కాస్త ఎక్కువేనని చెప్పాలి. కూతురు చదవుకోసం వారు పర్లాకెముండికి మకాం మార్చారు. అక్కడ అద్దె ఇంట్లో ఉంటూ కూతురుని సెంట్రల్ స్కూల్ లో చేర్పించి చదివిస్తున్నారు. ఏడాది క్రితం రాజ్యలక్ష్మి భర్త చనిపోయాడు. అప్పట్నుంచి రాజ్యలక్ష్మి కూతురు బాధ్యతల్ని లోటు లేకుండా నిర్వర్తించేది. కానీ కూతురికి ఆ కృతజ్ఞత లేదని తేలిపోయింది.
విచ్చలవిడి ప్రవర్తన నచ్చక..
టీనేజ్ వచ్చాక ఆ అమ్మాయి విచ్చలవిడి ప్రవర్తన పెంపుడు తల్లి రాజ్యలక్షికి నచ్చలేదు. పలుమార్లు ప్రవర్తన మార్చుకోవాలని చెప్పింది. కానీ ఆ అమ్మాయి వినలేదు. ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో కలసి సినిమాలు, షికార్లు చేసేది కూతురు. ఈ విషయంలో తల్లి కూతురు మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి. చివరకు ఎలాగోలా తల్లి బాధ లేకుండా చేయాలనుకుంది కూతురు. తన ఇద్దరి బాయ్ ఫ్రెండ్స్ తో ఓ ప్లాన్ వేసింది. తల్లిని చంపితే తనకి అడ్డుచెప్పేవారు ఉండరు అనుకుంది. అంతే కాదు, ఆమె ఆస్తి మొత్తం ఇప్పుడే తన చేతుల్లోకి వస్తుందని పన్నాగం పన్నింది.
గొంతు నులిమి
ఒకరోజు రాత్రి తల్లి తినే అన్నంలో నిద్రమాత్రల్ని పొడిచేసి కలిపింది కూతురు. ఆమె మత్తులోకి జారుకోగానే తన ఇద్దరు స్నేహితుల్ని ఇంటికి పిలిచింది. ముగ్గురూ కలసి రాజ్యలక్ష్మి గొంతు నులిమారు. మొహంపై దిండు అదిమి పెట్టి చంపారు. తెల్లారాక ఆమె గుండెపోటుతో చనిపోయిందని అందర్నీ నమ్మించారు. అంత్యక్రియలు కూడా ఘనంగా నిర్వహించారు.
అలా బయటపడింది..
ఆ తర్వాత ఒకరోజు మృతురాలి సోదరుడు ప్రసాద్ మిశ్రా ఇంటికి వచ్చిన కూతురు అక్కడ తన సెల్ ఫోన్ వదిలి వెళ్లింది. ఆ సెల్ ఫోన్ లో ఇన్ స్టా గ్రామ్ చాటింగ్ చూసిన ప్రసాద్ మిశ్రాకు ఆమెపై అనుమానం మొదలైంది. పెంపుడు కూతురే రాజ్యలక్ష్మిని చంపిందని ఆయన నిర్థారించుకున్నాడు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఆ హత్య తామే చేసినట్టు నిందితులు ఒప్పుకున్నారు. పెంపుడు కూతురితోపాటు.. ఆమె బాయ్ ఫ్రెండ్స్ గణేష్ రథ్, దినేష్ సాహు ని కూడా అరెస్ట్ చేశారు. రాజ్యలక్ష్మిని హత్య చేసిన రోజే ఆమె బంగారాన్ని మాయం చేసినట్టు గుర్తించారు.
అనాథను ఆదరించినందుకు రాజ్యలక్ష్మి అనే మంచిమనిషికి దక్కిన ప్రతిఫలం ఇది. చెత్తకుప్పలో పడి కుక్కలకో, పందులకో ఆహారం కావాల్సిన పసిబిడ్డను ఆదరించి పెంచి పెద్దచేసినందుకు ఆ తల్లినే హత్య చేసిన దుర్మార్గురాలి కథ ఇది.