Cottages on river: చుట్టూ పచ్చని కొండలు.. నట్ట నడుమ నాట్యమాడుతున్న కృష్ణమ్మ.. పరవళ్లు తొక్కుతున్న అలల తాకిడిని ముద్దాడుతున్నట్టు నిర్మించిన కాటేజీలు.. మాల్దీవులను మరిపించే ప్రకృతి సోయగాలు.. భక్తి పారవశ్యంలో ముంచేసే ముక్కంటి ఆలయాలు.. ప్రకృతి రమణీయత ఒడిలో సేద తీరాలనుకునే ఔత్సాహికుల కోసమే అన్నట్టు రూపుదిద్దుకున్న సుందర దృశ్యాలు.. మన రెండు తెలుగు రాష్ట్రాలకు వారధిలా మారిపోయిన నయా టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్ ఎక్కడ ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం..
దైనందిన నగర జీవితం రోటీన్ గా మారి బోరు కొడుతుందా..? కాంక్రీట్ జంగిల్ లో అలసిపోయారా..? ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకుంటున్నారా..? భక్తి పారవశ్యంలో మునిగితేలాలనుకుంటున్నారా..? నది ఒడ్డున అలల తాకిడి పైన అందమైన కృష్ణమ్మ పరవళ్లను నెమలి పించం లాంటి నీటి అందాలను ఆస్వాదించాలనుకుంటున్నారా.. అయితే తెలంగాణ మాల్దీవులుగా మారిపోయిన సోమశిలకు వెళ్లాల్సిందే. నల్లమల్ల ఫారెస్ట్ ఎన్నో అద్బుతమైన మరెన్నో అందమైన సుమనోహరమైన దృశ్యాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. అలాంటి వాటిలో సోమశిల నది పరివాహక ప్రాంతం కూడా ఒకటి. ప్రశాంతమైన వాతావరణానికి పెట్టింది పేరు సోమశిల. చూట్టూ ఎత్తైన కొండలు, లోతైన లోయలు.. భూమికి పచ్చని రంగేసినట్టు ఉన్న నల్లమల్ల ఆటవీ ప్రాంతం…. మధ్యలో అడవి తల్లి వడ్డానం ధరించిందేమో అన్నట్టుగా వెండి రంగులో పాము మెలికల్లా ప్రవహిస్తున్న కృష్ణమ్మ అందాలు.. ప్రకృతి అందాలన్నీ తన సిగలోనే దాచుకున్నట్టు కనిపిస్తుంది సోమశిల.
సోమశిల ప్రకృతి అందాలకే కాదు ముక్కంటి ఆలయాలకు కేరాఫ్ ఆడ్రస్‌గా నిలుస్తుంది. ఎక్కడ చూసిన శివలింగాలు దర్శనం ఇస్తాయి. ప్రసిద్ద సప్తనదుల సంగమేశ్వరం ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఆలయం సంవత్సరంలో ఆరు నెలలు నదిలో గంగమ్మ ఒడిలో పూజలందుకుంటే.. మరో ఆరు నెలలు మాత్రమే భక్తుల కోసం దర్శనభాగ్యం కల్పిస్తుంది. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించినట్టు ఆలయ శాసనాలు చెప్తున్నాయి. ఇక్కడే పాండవులు వేప లింగం ప్రతిష్టించారు. ఈ లింగం వేప చెట్టుతో తయారు చేసినప్పటికీ యుగాలు గడిచినా లింగం చెక్కుచెదరలేదు.
ఇక సోమశిలకు 20 కిలోమీటర్ల దూరంలో సింగోటం గ్రామంలో స్వయంభూ లక్ష్మీ నరసింహ్మ స్వామి ఆలయం ఉంది. ఇక్కడే రిజర్వాయర్.. వ్యూ పాయింట్ లక్ష్మీదేవి గుట్ట పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇక సోమశిలలో కొలువైన లలితా సోమేశ్వరాయలం కూడా భక్తుల పాలిట కొంగుబంగారంలా మారిపోయింది. కార్తీకమానం, శివరాత్రి సందర్బాలలో ఈ ఆలయానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలను భక్తులు దర్శనం చేసుకోవచ్చు.
సోమశిలకు ఎలా చేరుకోవాలి:
హైదరాబాద్ నుంచి కొల్లాపూర్‌కు 170 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం చేసి చేరుకోవాలి. కొల్లాపూర్ నుంచి సోమశిలకు 9 కిలోమీటర్లు ఉంటుంది. అయితే కొల్లాపూర్ నుంచి ఆర్టీసీ బస్సులు ఉదయం ఒకటి. సాయంత్రం ఒకటి మాత్రమే ఉంటుంది. కొల్లాపూర్ నుంచి ప్రయివేటు ఆటోలు తీసుకుని వెళ్లాలి. ఇక కర్నూల్ నుంచి సంగమేశ్వరం చేరుకుని అక్కడి నుంచి నదిలో 20 నిమిషాలు బోటు ప్రయాణం చేసి సోమశిల చేరుకోవచ్చు.
ALSO READ: షుగర్ ను తగ్గిస్తున్న ఆలయం – లక్షల్లో క్యూ కడుతున్న జనం – ఇంతకీ ఆలయం ఎక్కడుందో తెలుసా..?