Cyber Crackdown: స్వేచ్ఛ బ్యూరో: రకరకాలుగా జనాన్ని మోసం చేస్తూ ఏటా వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న సైబర్ క్రిమినల్స్ కు పూర్తి స్థాయిలో చెక్ పెట్టేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. గతంలో అరెస్టయి బెయిల్ పై విడుదలై బయటకు వచ్చిన వారి కదలికలపై నిరంతర నిఘా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఆపరేషన్ క్రాక్ డౌన్ 2.0 (Operation Crackdown 2.0)ను ప్రారంభించి ప్రస్తుతం వాళ్లు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉంటున్నారు? అన్న వివరాలను సిబ్బంది తెలుసుకుంటున్నారు. దీని కోసం 3వందల ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ చెప్పారు. ఇన్వెస్ట్ మెంట్(Investment), బిజినెస్, డిజిటల్(Digital) అరెస్ట్.. ఇలా రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్న సైబర్ కేటుగాళ్లు జనం కష్టార్జితాన్ని కొల్లగొడుతున్నవిషయం తెలిసిందే. ఏయేటికాయేడు పెరిగిపోతున్న ఈ నేరాలను అరికట్టేందుకు ఏర్పాటైన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పకడ్భంధీ చర్యలు తీసుకుంటోంది.
ఓవైపు ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూనే స్పెషల్ ఆపరేషన్లు నిర్వహిస్తూ సైబర్ క్రిమినల్స్ ను కటకటాల వెనక్కి పంపిస్తోంది. 2024–25వ సంవత్సరంలో లా అండ్ ఆర్డర్ పోలీసులతో కలిసి దాడులు జరిపిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఒక్క మన రాష్ట్రంలోనే 3,567మంది కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. వీరిలో 614మందిని కీలకమైన నిందితులుగా గుర్తించారు. అరెస్టయి జైలుకు వెళ్లిన వీళ్లలో చాలా మంది బెయిల్ తీసుకుని విడుదలై బయటకు వచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుతం నిందితులు ఎక్కడ ఉంటున్నారు? ఏం పని చేస్తున్నారు? వారి ఆర్థిక లావాదేవీలు ఏమిటి? అన్నదానిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దృష్టిని సారించారు. దీని కోసం 3వందల ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి వివరాలు సేకరిస్తున్నారు. ప్రతీ నిందితుని నివాసాన్ని జియో ట్యాగింగ్ చేయటం ద్వారా వారి కదలికలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నారు. బెయిల్ నిబంధనలను అతక్రమించకుండా చూస్తున్నారు.
Also Read: మేడిపల్లిలో వరుస చోరీలు కలకలం.. భయంతో జంకుతున్న స్ధానికులు
ఆపరేషన్ క్రాక్ డౌన్ 2.0లో ప్రధానంగా మ్యూల్ అకౌంట్ హోల్డర్లు, ఖాతాలను సప్లయ్ చేస్తున్న ఏజెంట్లు, చైల్డ్ పోర్నో కేసుల్లో పట్టుబడిన వారు, ఉద్యోగాల పేర యువకులను సైబర్ స్లేవరీలోకి దింపుతున్న వారిపై అధికారులు దృష్టి పెట్టారు. ఇలాంటి నేరాలకు పాల్పడి పట్టుబడి బెయిల్ పై బయటకు వచ్చిన వారిలో 335మందిని భౌతికంగా తనిఖీ చేసినట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ చెప్పారు. వీరికి తెలంగాణ(Telangana)లో 480, దేశవ్యాప్తంగా 1,233 కేసులతో సంబంధం ఉన్నట్టుగా గుర్తించామన్నారు. ఇక, తనిఖీల్లో 218మంది ఆచూకీ లభించగా 115మంది పరారీలో ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యిందన్నారు. మరో ముగ్గురు చనిపోయినట్టుగా తెలిసిందని చెప్పారు. చైల్డ్ పోర్నో గ్రఫీ కేసులో నిందితునిగా ఉన్న ప్రసాద్ కుమార్(Prasad Kumar) అనే వ్యక్తి ప్రస్తుతం నేపాల్ లో ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యిందన్నారు. అరెస్టయి బెయిల్ పై విడుదలైనా సరే నిందితులు పోలీసుల నిఘాలోనే ఉంటారని చెప్పారు. ఎవరైనా మళ్లీ నేరాలకు పాల్పడినట్టు తెలిసినా, అనుమానాస్పదంగా ప్రవర్తించినా వారిపై వెంటనే సస్పెక్ట్ షీట్లు తెరుస్తామని హెచ్చరించారు. సైబర్ నేరాల కట్టడిలో తమది జీరో టాలరెన్సీ విధానమని స్పష్టం చేశారు.
Also Read: తెలంగాణ పర్యాటక శాఖ సంచలన నిర్ణయం.. ఆ పది జిల్లాలపై స్ఫెషల్ ఫోకస్!