Student Death: హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్టల్ లో విషాదం చోటుచేసుకుంది. పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థి అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు విడిచాడు. అయితే సీనియర్ల ర్యాంగింగ్ వల్లే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సురేశ్ (26) ఎంబీబీఎస్ పూర్తి చేసి.. 3 నెలల క్రితం ఉస్మానియా మెడికల్ కాలేజీలో జనరల్ సర్జరీ విభాగంలో పీజీ విద్యార్థిగా చేరాడు. బుధవారం రాత్రి ఎప్పటిలానే హాస్టల్ లోని తన గదిలో పడుకున్నాడు. గురువారం ఉదయం 8 గంటల సమయం దాటినా అతను బయటకు రాకపోవటంతో తోటి విద్యార్థులు పలుమార్లు తలుపులు కొట్టారు. అయినా, సురేశ్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
దీంతో కంగారు పడ్డ విద్యార్థులు.. తలుపులు పగులగొట్టి చూడగా సురేశ్ మంచంపై అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే అతన్ని క్యాజువాలిటీకి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. మత్తు ఇంజక్షన్ ఓవర్ డోస్ తీసుకోవటంతోపాటు నిద్రమాత్రలు మింగి సురేశ్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా వైద్యులు తెలిపారు.
విషయం తెలియగానే సురేశ్ కుటుంబ సభ్యులు ఉస్మానియా మెడికల్ హాస్టల్ వద్దకు చేరుకున్నారు. సీనియర్లు చేసిన ర్యాగింగ్ పేరుతో సీనియర్లు చేసిన వికృత చేష్టల వల్లనే సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతదేహాన్ని మార్చురీకి తరలించకుండా చాలాసేపు అడ్డుకున్నారు. దాంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది.
Also Read: BSNL మరో సూపర్ ప్లాన్.. ఈసారి 84 రోజులు.. 252 GB డేటా, అపరిమిత కాల్స్!
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. విద్యార్థి బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సమగ్ర విచారణ జరుపుతామని హామీ ఇవ్వడంతో చివరికి వారు ఆందోళనను విరమించారు. అనంతరం సురేశ్ మృతదేహాన్ని పోలీసులు మార్చురీకి తరలించారు. అన్ని కోణాల్లో కేసును విచారిస్తున్నట్టు చెప్పారు. ర్యాగింగ్ ఆరోపణలు నిజమే అని తేలితే బాధ్యలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read: AC Mistakes: ఇంట్లో ఏసీ ఉందా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేదంటే ఏ క్షణమైనా..!