PhonePe Scam: డిజిటల్ విప్లవం పుణ్యమా అని ఇప్పుడు చిల్లర కొట్టు నుంచి షాపింగ్ మాల్స్ వరకు అన్నీ ఆన్‌లైన్ చెల్లింపుల మీదనే నడుస్తున్నాయి. అయితే, ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు పండుగలు, పబ్బాలను టార్గెట్ చేసుకుని సామాన్యుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా సంక్రాంతి వంటి పెద్ద పండుగల సమయంలో ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌ల పేరుతో ఆకర్షణీయమైన మెసేజ్‌లను పంపి మన బ్యాంక్ ఖాతాలను కొల్లగొడుతున్నారు. తాజాగా PhonePe పేరుతో జరుగుతున్న ఒక స్కామ్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను వణికిస్తోంది.
వైరల్ అవుతున్న ‘పొంగల్ గిఫ్ట్’ స్కామ్: సంక్రాంతి పండుగ వేళ వాట్సాప్ గ్రూపుల్లో ‘PhonePe పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్ – అందరికీ రూ.5000 నగదు’ పేరుతో ఒక లింక్ విపరీతంగా షేర్ అవుతోంది. పండుగ కానుకగా కంపెనీ ఉచితంగా డబ్బులు ఇస్తోందని నమ్మించేలా ఈ మెసేజ్ ఉంటుంది. కానీ, ఇది పూర్తిగా నకిలీ మెసేజ్ అని, దీని వెనుక మీ ఫోన్‌ను హ్యాక్ చేసే కుట్ర ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాట్సాప్‌లో వచ్చే ఈ లింక్‌ను క్లిక్ చేయగానే అది ఒక వెబ్‌సైట్‌కు తీసుకెళ్తుంది. చాలా సందర్భాల్లో ఆ పేజీ ఓపెన్ కాకుండా ‘404 Error’ అని చూపిస్తుంది. పేజీ ఓపెన్ కాకపోయినా, మీరు ఆ లింక్ క్లిక్ చేసిన క్షణమే మీ ఫోన్‌లోకి అదృశ్యంగా మాల్‌వేర్ (Malware) ప్రవేశించే ప్రమాదం ఉంది. ఇది మీ గ్యాలరీలోని ఫోటోలు, కాంటాక్ట్‌లు మరియు బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను సైబర్ నేరగాళ్లకు చేరవేస్తుంది. ఈ గిఫ్ట్ పొందాలంటే మరో 10 మందికి లేదా 5 గ్రూపులకు షేర్ చేయాలనే నిబంధన విధిస్తారు. దీంతో వినియోగదారులే తెలియకుండా తమ మిత్రులను, బంధువులను కూడా ఈ ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.
ఏదైనా కంపెనీ ఆఫర్లు ఇస్తే అది వారి అధికారిక యాప్‌లో లేదా వెబ్‌సైట్‌లో ఉంటుంది తప్ప వాట్సాప్ లింక్‌ల ద్వారా రాదు. హెచ్.టి.టి.పి.ఎస్ (https) లేని లేదా అనుమానాస్పదంగా ఉన్న ఏ లింక్‌ను క్లిక్ చేయవద్దు. మీ ఫోన్‌లో నమ్మకమైన సెక్యూరిటీ యాప్ ఉండేలా చూసుకోండి. ఒకవేళ పొరపాటున ఇటువంటి లింక్‌లు క్లిక్ చేస్తే, వెంటనే మీ యూపీఐ (UPI) పిన్ మరియు బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను మార్చుకోవడం ఉత్తమం.
ఆ మెసేజ్‌ను పంపిన నంబర్‌ను లేదా ఆ చాట్‌ను రిపోర్ట్ చేసి బ్లాక్ చేయండి. తద్వారా వాట్సాప్ అల్గారిథమ్ ఆ నంబర్‌ను నిషేధించే అవకాశం ఉంటుంది. మీరు నేరుగా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు. అక్కడ మీరు పొందిన లింక్ లేదా స్క్రీన్‌షాట్‌ను ఆధారంగా అప్‌లోడ్ చేయాలి.
ఒకవేళ మీరు పొరపాటున లింక్ క్లిక్ చేసి, మీ ఖాతా నుండి డబ్బు కట్ అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ క్రింది పని చేయండి. తక్షణమే 1930 కి కాల్ చేయండి. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్. డబ్బు పోయిన మొదటి 1-2 గంటల్లోపు (గోల్డెన్ అవర్) మీరు ఫిర్యాదు చేస్తే, ఆ నిధులు నిందితుడి ఖాతా నుండి వేరొక చోటికి వెళ్లకుండా పోలీసులు నిలిపివేసే (Freeze) అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Read Also: సంక్రాంతి ముసుగులో ‘కేసినో’ దందా.. కోడిపందేల బరిలో ఘర్షణలపై వైసీపీ ఫైర్!