Cyber Gang Arrested: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అంతర్జాతీయ సైబర్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 547 కోట్ల రూపాయల మేర ఈ ముఠా సైబర్ స్కాంలకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. నిరుద్యోగ యువకులకు ఉద్యోగం ఆశ చూపి, వారిచేత బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించడమే కాకుండా.. వారి అకౌంట్ల ద్వారానే సైబర్ లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించారు. ఈ ముఠాకు సంబంధించిన కీలక సూత్రదారులలో ఒకరిని అరెస్ట్ చేయగా.. సైబర్ స్కాంకు సహకరించిన మరో 17 మందిని పెనుబల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సత్తుపల్లికి చెందిన ఉడతనేని వికాస్ చౌదరి, పోట్రు మనోజ్ కళ్యాణ్, పోట్రు ప్రవీణ్, మేడా భానుప్రియ, మేడా సతీష్, మోరంపూడి చెన్నకేశవ అనే వ్యక్తులు ముఠాగా ఏర్పడి భారీగా సైబర్ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆస్ట్రేలియా పౌరులకు సైబర్ వల విసిరి దోపిడీ చేసిన మొత్తం సొమ్ము సుమారు 547 కోట్లు ఉంటుందని పోలీసులు తేల్చారు. ఉడతనేని వికాస్ చౌదరి ముఠా ఇంటర్నేషనల్ సైబర్ నేరగాళ్లతో కలిసి విదేశాల్లో కాల్ సెంటర్లు నిర్వహిస్తూ నేరాలు చేస్తున్నట్లు గుర్తించారు.
అయితే మ్యాట్రిమోనీ, రివార్డ్స్, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్‌మెంట్స్‌తో పాటు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరుతో నిందితులకు సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. టెలీగ్రామ్ గ్రూపులో మోసపూరిత లింకులు పంపి వాటి ద్వారా అమాయకుల బ్యాంక్ అకౌంట్లను హ్యాక్ చేసి వికాస్ చౌదరి ముఠా ఈ మోసాలు చేస్తుంటారని పోలీసులు తెలిపారు.
అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామంటూ పిలిపించుకొని వారితో అకౌంట్లు ఓపెన్ చేయించి ఈ మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు. అయితే వికాస్ చౌదరి ముఠాకు అకౌంట్లు ఇచ్చి మోసాలకు సహకరించినందుకు గాను హైదరాబాద్‌కు చెందిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే విధంగా నిందితుల తరపున ఏజెంట్లుగా వ్యవహరించిన మరో 11 మందిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: ముత్తంగి రింగ్ రోడ్ వద్ద భారీ డ్రగ్స్ ఆపరేషన్.. ముగ్గురు అరెస్ట్
మొత్తంగా ఈ భారీ సైబర్ స్కాంలో ఇప్పటి వరకు మొత్తం 18 మందిని అరెస్ట్ చేశారు. అందులో అసలు ముఠాకు చెందిన వ్యక్తి పోట్రు ప్రవీణ్ కూడా ఉన్నారు. వీరికి బ్యాంక్ అకౌంట్లు ఇచ్చి ఏజెంట్లుగా వ్యవహరించినందుకు గాను మరో 17 మందిని అరెస్ట్ చేశారు. అయితే ముఠాలోని ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఉడత నేని వికాస్ చౌదరికి రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో నిందితుడైన పోట్రు మనోజ్ కళ్యాణ్ సత్తుపల్లికి చెందిన బీజేపీ నేత.. అలాగే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న పోట్రు ప్రవీణ్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. ఇటు సైబర్ ముఠాలో ఉన్న భానుప్రియ అనే మహిళ పోట్రు మనోజ్ కళ్యాణ్ భార్యగా పోలీసులు గుర్తించారు. మేడా సతీష్ అనే ఇంకో నిందితుడు మనోజ్ కళ్యాణ్ బామ్మర్ది అని పోలీసులు వెల్లడించారు.