పల్నాడు జిల్లా పెదకూరపాడులో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించారు మంత్రి నారాయణ. పెదకూరపాడులోని కర్లపూడి, లేమల్లెలో ల్యాండ్ పూలింగ్ చేపట్టారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌తో కలిసి రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించారు మంత్రి. మొత్తం 2654 ఎకరాల ల్యాండ్ పూలింగ్‌కు కాంపిటెంట్ అథారిటీ నోటిఫికేషన్ జారీ చేయగా.. ఇప్పటివరకు మూడు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ పూర్తైందన్నారు.
హైదరాబాద్‌లో చైనీస్ మాంజాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత నాలుగు రోజుల్లో 43 లక్షల రూపాయల విలువైన మాంజాను సీజ్ చేసి.. 57 మందిని అరెస్ట్ చేశారు. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఈ నిషేధిత దారం విక్రయిస్తే జైలు శిక్ష తప్పదని.. సురక్షితమైన దారాలతోనే సంక్రాంతి జరుపుకోవాలని పోలీసులు హెచ్చరించారు.
మేడారం జాతర నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ క్షేత్రం భక్తులతో పోటెత్తింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామివారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుండగా.. భక్తులు తమ ప్రధాన మొక్కుబడైన కోడె మొక్కులను సమర్పించుకుంటున్నారు.
తెలంగాణ సరిహద్దు చర్ల మండలం ఎర్రబోరుకు చెందిన ఇర్పా చిట్టెమ్మ అనే ఆదివాసీ రైతు పోడు భూమిని సాగు చేస్తూ ఆదర్శంగా నిలిచారు. 10 ఎకరాల్లో చేపల పెంపకం, మిర్చి, కూరగాయలు పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీ పరికరాలు అందించి తమను మరింత ప్రోత్సహించాలని ఈ ఆదివాసీ కుటుంబం కోరుతోంది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అంతర్జాతీయ సైబర్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 547 కోట్ల రూపాయల మేర ఈ ముఠా సైబర్ నేరాలకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. నిరుద్యోగ యువకులకు ఉద్యోగం ఆశ చూపి, వారిచేత బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించడమే కాకుండా..వారి అకౌంట్ల ద్వారానే సైబర్ లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించారు. ఈ ముఠాకు సంబంధించిన కీలక సూత్రదారులలో ఒకరిని అరెస్ట్ చేయగా.. సైబర్ స్కాంకు సహకరించిన మరో 17 మందిని పెనుబల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాల గ్రామంలో.. శ్రీ మల్లికార్జునా స్వామి జాతర కమిటీ విషయంలో వివాదం తలెత్తింది. జాతర నిర్వహణ విషయంలో ఇరువర్గాల మద్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలోనే జాతర జరగాలని ఒక వర్గం డిమాండ్ చేయగా.. పాత కమిటీ ఆధ్వర్యంలోనే జాతర నిర్వహించాలని మరొక వర్గం డిమాండ్ చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. శాంతియుత వాతావరణంలో జాతర జరుపుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో షార్ట్ సర్క్యూట్‌తో సమత ఫ్లెక్సీ ప్రింటర్స్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కంప్యూటర్లు, జిరాక్స్ మిషన్లు, ఫర్నిచర్ పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించిందని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
హన్మకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల సందడి నెలకొంది. మేడారం జాతర నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బోనాలు, పట్నాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు, కల్యాణం నిర్వహించగా, భక్తులు రథసేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని దేవరంపల్లిలో భూతగాదాల నేపథ్యంలో రాఘవేందర్ రెడ్డి అనే వ్యక్తి తన కన్నతల్లి సుమతమ్మను గొంతు నులిమి హత్య చేశాడు. తన అక్కకు తల్లి మద్దతుగా ఉంటూ, ఆస్తిని తనకి తెలియకుండా రాసిచ్చిందనే కక్షతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా సంక్రాంతి ముగ్గులు పోటీలు నిర్వహించారు. మొదటి విజేతకు లక్ష రూపాయలు, రెండో విజేతకు 50 వేల రూపాయల చొప్పున బహుమతులు అందజేశారు.అనంతరం కోడిపందేలు నిర్వహించగా.. రోజా, అంబటి కోడి పుంజులను బరిలోకి వదిలారు. తాను ఏటా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నానని, గతంలో సత్తెనపల్లిలోనూ ఈ పోటీలు నిర్వహించినట్టు అంబటి తెలిపారు. రాష్ట్రంలో రాంబాబు అంటే సంక్రాంతి.. సంక్రాంతి అంటే రాంబాబు అంటూ కితాబిచ్చాడు రోజా.
శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ఈనెల 18 వరకు వైభవంగా జరగనున్నాయి. ఇవాళ యాగశాల ప్రవేశంతో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాల్లో ప్రతిరోజూ విశేష పూజలు, వాహన సేవలు నిర్వహిస్తారు. 15న చెంచు గిరిజనుల ఆచారంతో కూడిన బ్రహ్మోత్సవ కల్యాణం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈఓ శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
నెల్లూరు జిల్లా గూడూరులోని అడవి కాలనీలో ఐదేళ్ల బాలికపై సదాశివం అనే వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో గమనించిన స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పల్నాడు జిల్లా వినుకొండలోని మసీదు మాన్యం ప్రాంతంలో పోలీసులు సోమవారం భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 100 మంది సిబ్బందితో ఇళ్లు, వాహనాలను తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని 80 బైకులు, ఆటోలు, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ హనుమంతరావు స్పష్టం చేశారు.
శ్రీకాకుళంలోని బగ్గు సరోజినీ దేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పరామర్శించారు. ఇంట్లో తూలి పడటంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండాలని ధర్మాన ఆకాంక్షించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, మంచు విష్ణు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…ఆలయ అధికారులు పట్టువస్త్రాలుతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
అమెరికా హెచ్చరికలతో ఇరాన్ చర్చలకు మొగ్గుచూపిందని, ఆ దేశ నాయకులు తనకు ఫోన్ చేశారని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా చేతిలో దెబ్బలు తినడం వారికి విసుగు తెప్పించి ఉంటుందంటూ టెహ్రాన్‌పై ఎద్దేవా చేశారు. హింసతో పాలిస్తున్న ఇరాన్ పరిస్థితిని అమెరికా సైన్యం గమనిస్తోందని, సమస్య పరిష్కారానికి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
ఆరెస్సెస్ వందేళ్ల ప్రయాణంపై రూపొందుతున్న ‘శతక్’ చిత్ర గీతాలను మోహన్ భాగవత్ ఆవిష్కరించారు. సంఘ్ కాలక్రమేణా మారుతూ కాకుండా, అభివృద్ధి చెందుతూ విస్తరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో గాయకుడు సుఖ్విందర్ సింగ్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని ఆరెస్సెస్ ప్రయాణాన్ని కొనియాడారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం వీధి కుక్కల బెడద నివారణకు శ్రీకారం చుట్టింది. పశుసంవర్ధక శాఖ నోడల్ ఏజెన్సీగా విద్యా సంస్థలు, ఆసుపత్రులు, బస్టాండ్ల వద్ద పకడ్బందీ గోడలు, ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేయనున్నారు. కుక్కల దాడులు, రేబిస్ మరణాలను అరికట్టేందుకు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రతి మూడు నెలలకోసారి తనిఖీలు నిర్వహించి వ్యాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తారు.
గతేడాది విజయం తర్వాత ‘అనగనగా ఒక రాజు’తో మీనాక్షి చౌదరి సంక్రాంతి బరిలో దిగుతున్నారు. నటనను ముగింపు లేని పరుగుగా భావించే ఆమె.. నిరంతరం శ్రమిస్తేనే అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. కెరీర్ ఆరంభంలో నటన వదిలేయాలనుకున్నా, క్రమశిక్షణతో నేడు ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ చిత్రం ఈనెల 14న విడుదల కానుంది.
టాటా స్టీల్ చెస్ బ్లిట్జ్ విభాగంలో తెలుగు గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేశి కాంస్యం గెలవగా.. నిహాల్ సరీన్ రజతం సాధించాడు. అమెరికాకు చెందిన వెస్లీ సో టైటిల్ దక్కించుకోగా, విశ్వనాథన్ ఆనంద్ ఎనిమిదో స్థానానికే పరిమితమయ్యారు. మహిళల విభాగంలో వంతిక ఆగర్వాల్ రజతం గెలుచుకోగా, కరిస్సా యిప్ విజేతగా నిలిచింది.