Harassment : విద్యాబుద్దులు నేర్పాల్సిన అధ్యాపకుడే.. లైగింక వేధింపులకు పాల్పడ్డ ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. తరగతి గదుల్లో విద్యార్థునుల పట్ల సంస్కారంతో మెలగాల్సిన వ్యక్తి.. అసహ్యకరంగా వ్యవహరించడం, తప్పుగా తాకడం వంటి చేష్టలతో అధ్యాపక వృత్తికే కలంకం తెచ్చాడు. అతని వేధింపులు భరించలేని ఓ విద్యార్థి.. తల్లిదండ్రుల సాయంతో పోలీస్ స్టేషన్ కు చేరుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కామాంధుడిని కటకటల వెనకకు నెట్టింది.
తిరుపతిలోని వెంకటేశ్వర వ్యవసాయ కాలేజీలో అధ్యపకుడిగా పనిచేస్తున్న ఉమా మహేష్ పై చాన్నాళ్లుగా ఆరోపణలున్నాయి. తరగతి గదుల్లో విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని, వారితో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే గత కొన్నాళ్లుగా కాలేజీలోని మొదటి ఏడాది చదువుతున్న ఓ విద్యార్థితో తప్పుగా ప్రవర్తిస్తున్నాడు. ఈ దృశ్యాలు మొబైల్ ఫోన్ లోను రికార్డ్ అయ్యాయి.
అతడి ప్రవర్తనపై చాన్నాళ్లుగా బాధపడుతున్న సదరు విద్యార్థి.. ఇన్నాళ్లకు అతనిపై తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. దాంతో.. ఆగ్రహించిన తల్లిదండ్రులు తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఏకంగా తరగతి గదిలోనే విద్యార్థినితో లైంగికంగా వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించడం. అందుకు సంబంధించిన వీడియో రికార్డుల్ని చూపించడంతో.. అతడిపై తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 466/2024 కింద కేసు నమోదు చేసి.. నిందితుడిని యూనివర్సిటీ ఫ్లై ఓవర్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు.
విద్యార్థి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించిన తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు.. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. అతనిపై చట్టప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామని, విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే సహించేది లేదని పోలీసులు హెచ్చరించారు.