⦿ ధరణి సమస్యలకు పరిష్కారమే నూతన చట్టం
⦿ కోర్టులకు వెళ్లకుండా పలు సమస్యలకు పరిష్కారం
⦿ సమస్యల అప్పీలుపై విచారణకు రెవెన్యూ వ్యవస్థకు అధికారం
⦿ జిల్లా స్థాయిలో భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు
⦿ సాదాబైనామా పరిష్కారానికి ఆర్డీవోకు అధికారులు
⦿ జిల్లా స్థాయి దాటకుండానే సమస్యలకు పరిష్కారం
⦿ న్యాయవాదిని పెట్టుకోలేని పేదలకు ప్రభుత్వం ద్వారా ఉచిత న్యాయసేవ
⦿ వ్యవసాయ, వ్యవసాయేతర భూములు రెండింటికీ రికార్డులు
⦿ ‘భూభారతి చట్టం’పై అనేక అనుమానాలను నివృత్తి చేసిన భూచట్ట న్యాయ నిపుణులు భూమి సునీల్
⦿ ‘స్వేచ్ఛ-బిగ్ టీవీ’ ఇంటర్వ్యూలో పలు సందేహాలపై వివరణలు
స్వేచ్ఛ, సెంట్రల్ డెస్క్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒడిశాలో విఫలమైన ఒక వ్యవస్థను ధరణిలో రూపంలో రాష్ట్ర ప్రజానీకంపై బలవంతంగా రుద్దారు. ఈ విధానం కారణంగా లాభాల కంటే నష్టాలే ఎక్కువ జరిగాయి. కానీ, దేశంలో ఇదే అద్భుత వ్యవస్థ అన్నట్టుగా గత ప్రభుత్వం కలరింగ్ ఇచ్చింది. నిజానికి చాలా సమస్యలకు పరిష్కారం ధరణిలో లేదు. డేటా సేఫ్టీ, ఈ-సైట్‌ను నిర్వహించే బాధ్యతలను కూడా ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఎన్ఐసీ, సీజీజీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నా రికార్డులను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారు. ధరణి పోర్టల్‌ను ఎందుకు అంత సీక్రెట్‌గా నిర్వహించారనే దానిపై తీవ్ర విమర్శలు వ్యక్తమైనా ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే, ధరణికి ప్రత్యామ్నాయంగా సమస్యల పరిష్కారం చూపేలా… ఇంకా చెప్పాలంటే రైతుల కోసం నూతనంగా ‘భూభారతి ’ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ అమల్లోకి తీసుకురాబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే చట్టానికి సంబంధించి తెలంగాణ ప్రజానీకంలో నెలకొన్న పలు సందేహాలు, అనుమానాలకు ప్రముఖ భూచట్ట న్యాయ నిపుణులు ‘భూమి సునీల్’ ‘స్వేచ్ఛ-బిగ్ టీవీ’ ద్వారా నివృత్తి చేశారు.
భూభారతి చట్టానికి, ధరణికి తేడా ఏమిటి?
ధరణి కారణంగా ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారమే భూభారతి చట్టం. ధరణి సమస్యలను అర్థం చేసుకుంటే భూభారతి చట్టం ఏం చెబుతుందో స్పష్టంగా అర్థమవుతుంది. ధరణిలో ప్రధానంగా నాలుగైదు సమస్యలు ఉన్నాయి. నేటికి కూడా 18 లక్షల ఎకరాల భూమి ధరణిలో నమోదు కాలేదు. దానిని పార్ట్-బీ అని చెబుదాం. భూమి ఉండి సాగు చేస్తున్నా, పాత పుస్తకాలు ఉన్నా ధరణి వచ్చాక చాలా మందికి కొత్త పుస్తకాలు లేదు. 1971 చట్టం కింద పాస్ పుస్తకాలు ఉన్నా ధరణిలో రాలేదు. రైతులకు ఇది ప్రధానమైన సమస్యగా మారింది. పార్ట్-ఏలో కూడా ఏదో ఒక సమస్య ఉంది. విస్తీర్ణం తగ్గడం, సర్వే నంబర్ తప్పుగా పడడం, పేరు తప్పుగా ముద్రించడం, పట్టాభూమి కాస్త ప్రభుత్వభూమిగా పడడం, కొనుగోలు చేసిన భూమి వారసత్వభూమి అని పడడం ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. ధరణిలో మొత్తం 45 సమస్యలు ఉన్నాయి. వీటి కారణంగా దాదాపు 25 లక్షల మంది తెలంగాణ రైతాంగం సమస్యలు ఎదుర్కొంటున్నారు. ధరణి చట్టం ప్రకారమైతే కోర్టుకు వెళ్లడం తప్ప ఇంకెక్కడా పరిష్కారం లేదు. మరోవైపు, 9.24 లక్షల మంది సాదాబైనామాల ద్వారా భూమిని కొనుక్కున్నామంటూ క్రమబద్ధీకరణకు ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు. కనీసం అలాంటి సమస్యలకు కూడా ఇంకా పరిష్కారం లభించలేదు. ఎందుకంటే ఏవిధంగా క్రమబద్ధీకరణ చేయాలనేది చట్టంలో లేదు. ఇక, రికార్డుల్లో తప్పుల మీద అప్పీలు చేయడానికి ధరణిలో అవకాశమే లేదు. ఉదాహరణకు వారసత్వ భూమిని ఒకే వ్యక్తి తన పేరు మీదకు మార్పించుకుంటే దాన్ని సవరించడానికి అవకాశం లేదు. కోర్టుకు వెళ్లడం మినహా మరో పరిష్కారం లేదు. అయితే, భూభారతి చట్టం అమల్లోకి వస్తే అప్పీలు చేసుకునేందుకు ఒక యంత్రాంగం అందుబాటులోకి వస్తుంది. జిల్లా స్థాయిలో భూమి ట్రిబ్యునల్ వస్తుంది. సాదాబైనామా పరిష్కారానికి ఆర్డీవోకు అధికారులు వస్తాయి. కోర్టుకు వెళ్లే అవసరం లేకుండా, జిల్లా స్థాయి దాటకుండానే భూసమస్యలను పరిష్కరించుకోవచ్చు. కొత్త చట్టం ప్రకారం న్యాయవాదిని పెట్టుకోలేని పేదలకు ప్రభుత్వమే ఉచితంగా న్యాయసేవ అందజేస్తుంది. ఈ విధమైన సర్వీసు అందించడం దేశంలో ఇదే తొలిసారి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. తెలంగాణలో భూభారతి చట్టం అమల్లోకి వస్తే వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు రెండింటికీ రికార్డులు నమోదవుతాయి.
వెంకట్ రెడ్డి, రైతు: వారసత్వంగా నాకు రావాల్సిన భూమి వేరే వాళ్ల పేరు మీదుగా ఎక్కువ నమోదైంది. నాకు అన్యాయం జరిగింది. కొత్త చట్టంలో పరిష్కారం లభిస్తుందా?
ధరణి చట్టం ప్రకారం తహసిల్దార్ పట్టా మార్చవచ్చు. కానీ అప్పీలుపై విచారణ జరిపే అధికారం ఉండదు. 1971 చట్టం ప్రకారం వారసత్వాన్ని విచారించే అధికారం ఉండేది. కానీ ధరణి చట్టంలో అది లేదు. రెవెన్యూ విభాగానికి ఆ అధికారాన్ని కల్పించలేదు. అయితే, నూతనంగా భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత సదరు రైతు వెళ్లి జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ధరణిలో జరిగిన తప్పుపై విచారణ జరిపి సవరించే అధికారం కలెక్టర్‌కు ఉంటుంది. భూభారతి చట్టంలో ఎవరికి ఉండాల్సిన అధికారాలు వారికి ప్రత్యేకంగా ఉంటాయి. తహసిల్దార్, ఆర్డీవో, జిల్లా కలెక్టర్ స్థాయిలో అధికారులు ఉంటాయి. వాళ్లు కూడా తప్పు చేస్తే పైఅధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. మొత్తంగా దరఖాస్తు పెట్టుకుంటే విచారణ జరిపి సవరించే అధికారం రెవెన్యూ వ్యవస్థకు ఉంటుంది.
ధరణి చట్టం అమల్లోకి రావడానికి ఎంత సమయం పడుతుంది?
ఎలాంటి తప్పులు లేకుండా సమగ్ర చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం దాదాపు ఏడాది కాలం అధ్యయనం చేసింది. ఇక ధరణి సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన డేటా మొత్తం ఓ ప్రైవేటు కంపెనీ వద్ద ఉండేది. నెల క్రితమే ఆ డేటాను ప్రభుత్వం తీసుకొని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థకు అప్పగించింది. ఇక ప్రజలకు కూడా స్పష్టమైన అవగాహన కల్పించేందుకు ముసాయిదా చట్టాన్ని ఆగస్టు నెలలో జనాల్లో ఉంచారు. జిలా కలెక్టరేట్‌లలో సమావేశాలు కూడా జరిగాయి. ఇక చట్టం అమల్లోకి రావాలంటూ మూడు ముఖ్యమైన పనులు జరగాలి. తొలుత చట్టానికి గవర్నర్ ఆమోదం లభించాలి. రూల్స్ రావాలి, ఆ తర్వాత ధరణి సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసుకొని భూభారతి వెబ్‌సైట్‌ను రూపొందించాలి. అన్నీ సకాలంలో జరిగితే ఆరు నెలల్లో భూభారతి చట్టం అమల్లోకి వచ్చే ఆస్కారం ఉంది. రెవెన్యూ యంత్రాంగ గ్రామాల్లోకి వెళ్లి రైతులకు చట్టంపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది.
తరుణి, ఆదిలాబాద్: కొత్త చట్టం కింద షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనేతరులు భూమి కొనుగోలు చేయవచ్చా?
ఎల్‌టీఆర్ చట్టం ప్రకారం గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు మినహా ఇతరులు భూములు కొనడానికి, అమ్మడానికి వీళ్లేదు. మ్యూటేషన్లు, రిజిస్ట్రేషన్లు ఏవైనా ఎల్‌టీఆర్ చట్టానికి లోబడే ఉంటాయి. ఇక, కొత్తగా భూభారతి చట్టంలో ఎలాంటి మార్పులు ఉండవు. షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూములకు కొనే హక్కు ఉండదు. అనుభవదారుకాలమ్‌లో ఎవరి పేరైనా రాయాలనుకుంటే ఆ భూమి ఆయన అనుభవంలోనే ఉండాలి. ప్రభుత్వ విధించిన షరతులకు లోబడి ఉండాలి.
కొత్త చట్టంలో కౌలుదారుల పేర్లు చేర్చే అవకాశం ఉంటుందా?
భూభారతి చట్టంలో కాస్తు కాలమ్ ఉంటుంది. కానీ కౌలుదార్ల పేర్లు దీంట్లో ఎక్కించరు. భూమి యజమాని అయ్యుండి, పట్టాదారు కాకుండా ఉన్నవారి పేర్లు మాత్రమే కాస్తుకాలమ్‌లోకి వస్తాయి. కౌలు రైతుల కోసం వేరే చట్టాలు ఉన్నాయి. భూభారతి చట్టంలో కౌలుదార్ల పేర్లు ఎక్కించడం ఉండదు. యజమాని పేరు రికార్డులో రాయనంత మాత్రాన యజమాని కాకుండా పోరు. నిజమైన భూయజమానులకు హక్కులు కల్పించేందుకు మాత్రమే కాస్తుకాలమ్‌ను తీసుకొచ్చారు. గతంలో వీఆర్‌వోలు కాస్తుకాలమ్ రాసేవారు. కాస్తుకాలమ్ రాసే అధికారం పైస్థాయిలో ఉంటుంది. తహసిల్దార్ లేదా ఆర్డీవోకు కట్టబెడతారు. పేర్లు ఎక్కించుకొని భూములు కొట్టేసే అవకాశం భూభారతి చట్టంలో ఉండదు.
ప్రమోద్ కుమార్, నల్గొండ జిల్లా: రికార్డుల్లో ఉంది కానీ భూమి లేదు. ఓ వ్యక్తి రైతు బంధు రూపంలో లబ్ది పొందుతున్నాడు. సదరు వ్యక్తిని తొలగించుకోమంటే తొలగించుకోవడం లేదు, కొత్త చట్టంలో పరిష్కారం ఉందా?.
రికార్డుల్లో భూమి ఎక్కువగా ఉంటోంది. కానీ నిజంగా భూమి ఉండడం లేదు. ధరణి కారణంగా దాదాపు 10 లక్షల ఎకరాలు ఎక్కువగా చూపిస్తోంది. కొత్త చట్టం వచ్చాక అవసరమైన చోట సర్వే చేస్తారు. హక్కులు ఉన్నవాళ్ల భూమి మాత్రమే ఉంటుంది. మిగతావాళ్లని తొలగిస్తారు. అదనంగా కనిపిస్తున్న భూమిని అధికారులు సరిచేస్తారు. ఆర్ఎస్ఆర్ ఫుల్ అని చూపించి పేరు ఎక్కకుండా చిక్కులు పడుతున్నవాళ్లకు కూడా పరిష్కారం లభిస్తుంది. భూమిలేని వాళ్ల పేరు తొలగించి వీళ్ల పేరు ఎక్కించడానికి భూభారతి చట్టం అవకాశం కల్పిస్తుంది. భూసేకరణలో భాగంగా చాలా చోట్ల రోడ్లు, కాలువల భూములను కూడా కలిపి పాస్ పుస్తకాలు వచ్చాయి. అవన్నీ తొలగిస్తారు. ప్రభుత్వం తీసుకున్న భూములకు కూడా పాస్‌పుస్తకాలు ఉండడంతో ప్రభుత్వానికి పెద్ద భారం. భవిష్యత్‌లో పెద్ద చిక్కులు కూడా వస్తాయి. భూభారతి చట్టానికి భూమిని సరిచేసే అధికారం ఉంది. ఇలాంటి సమస్యలు అన్నింటికీ ఈ చట్టంలో ఒక ప్రత్యేక సెక్షన్ ఉంది. రాష్ట్ర స్థాయిలో ఉన్న భూరిపాలనా అధికారికి సవరణ చేసే అధికారాలు ఉన్నాయి. ప్రభుత్వ భూములు, ఎండోమెంట్, వక్ఫ్, ఫారెస్టు భూములకు తప్పుగా పట్టాలు పొందితే వాటిని స్వాధీనం చేసుకోవడానికి, క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి చట్టంలో హక్కులు ఉన్నాయి.
క్రిష్ణ, యాద్రాద్రి జిల్లా: సాగు చేసుకునేది ఒక చోట, సర్వే నంబర్ ఉంది వేరే చోట. దీనికి పరిష్కారం ఎలా?
రాష్ట్రంలో ఇలాంటి సమస్యలు చాలానే ఉన్నాయి. భూభారతి చట్టంలో వస్తే అనుభవదారు సర్వే చేస్తారు. రీసర్వే చేస్తారు. పరిష్కారం లభిస్తుంది. సమస్యలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సవరణ చేసే అధికారం తహసిల్దార్ లేదా ఆర్‌డీవోకు ఇచ్చే అవకాశం ఉంది. ఇక చట్టంలో ప్రతి వ్యక్తికి భూధార్ కార్డు రాబోతోంది. శాశ్వతమైనది, తాత్కాలికమైనది రెండు రకాల భూధార్ కార్డులు ఉంటాయి. అక్షాంశాలు, రేఖాంశాలతో సహా మొత్తం సర్వేలు పూర్తి చేసిన శాశ్వత భూధార్ కార్డు వస్తుంది. తాత్కాలిక భూధార్ కార్డులు ఇస్తే చాలా సమస్యలు పూర్తవుతాయి. అన్ని విషయాలను పరిశీలించి ఇది జారీ చేస్తారు.
ప్రభాకర్, యాదాద్రి జిల్లా: ల్యాండ్ కమిషన్ ఏర్పాటు ఉంటుందా?
ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఏర్పాటు చేస్తారేమో చూడాలి. ఈ ప్రస్తావన చట్టంలో ఉంది. కాబట్టి కావాలంటే ఏర్పాటు చేసుకోవచ్చు.
మన్మోహన్, నల్గొండ: లావణి పట్టా భూమి ఉంది. రెగ్యులర్ చేసుకొని అమ్ముకోవచ్చా?
పేదలకు ప్రభుత్వం పంచిన ఈ భూములను అనుభవించాలి లేదా వారసత్వంగా పంచుకోవాలి. కానీ అమ్ముకోవడానికి వీల్లేదు. ఈ తరహా భూములపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ నిర్ణయం తీసుకున్న ఇది భూభారతి చట్ట పరిధిలోకి రాదు. అది జరగాలంటే పీవోటీ చట్టం-1977ను మార్చుకోవాలి. ఆ చట్టాన్ని సవరిస్తేనే అమ్ముకోవడం సాధ్యపడుతుంది. ఇలాంటి భూమి రాష్ట్రంలో 25 లక్షలకు పైగా ఉంది.
Also Read: భూమి ఒకరిది.. యజమాని మరొకరు.. ఈ తప్పులకు బాధ్యులెవరు.?
మాజీ నక్సలైట్లు భూములు అమ్ముకోవచ్చా?
మాజీ సైనికులు, స్వాతంత్ర సమరయోధులు, రాజకీయంగా అణగారిన వర్గంగా పేర్కొనే నక్సలైట్లు వంటి వారికి ప్రభుత్వం భూములు ఇవ్వొచ్చని చట్టం చెబుతోంది. నక్సలైట్లకు ఇచ్చిన భూమిని మరుసటి రోజు నుంచే అమ్ముకోవచ్చని చట్టాలు చెబుతున్నాయి. కానీ, మాజీ సైనికులు, స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చిన భూమిని పది సంవత్సరాల వరకు అమ్మడానికి వీల్లేదు. అయితే ప్రస్తుతం ఈ మూడు కేటగిరీలవారికి ఇచ్చిన భూములను అమ్ముకోవాలంటే తెలంగాణలో ఎన్‌వోసీ తీసుకుంటున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అవసరమైన విధానాలు తీసుకొస్తే మరింత స్పష్టత వస్తుంది.
Also Read : ధరణి పేరుతో దోచిపెట్టింది ఎవరికి.. ఈ భూములే ఆ నాయకుల అసలు టార్గెట్టా.. అమ్మో పెద్ద ప్లానింగే..
ధరణిలో ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం?
ధరణిలో ఎలాంటి తప్పులున్నా ఆర్డీవోకు లేదా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో భూమి ఎవరిదనేది తేలిపోతుంది. అంతేకాదు కోర్టులకు కూడా వెళ్లాల్సిన అవసరం ఉండదు. కోర్టుల పరిధి ఏంటనేది కూడా భూభారతి చట్టంలో ప్రభుత్వం స్పష్టత ఇస్తుంది. ధరణిలో ఉన్న రికార్డులు ప్రస్తుతానికి భూభారతిలో తాత్కాలికంగా కొనసాగుతాయి. తప్పుల సవరణకు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. సర్వేలు, రీసర్వేలు ఉంటాయి. తదనుగుణంగా కొత్త రికార్డు తయారవుతుంది. మొత్తంగా కొత్త చట్టంలో రికార్డుల సవరణకు కోర్టులకు వెళ్లకుండా రెవెన్యూ యంత్రాంగమే సరిచేస్తుంది. ఏ సమస్య పరిష్కారానికైనా జిల్లా స్థాయి దాటి వెళ్లాల్సిన అవసరం లేదు. అన్ని జిల్లా స్థాయిలోనే అవుతాయి. వీలైనంత వరకు గ్రామాల్లోనే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. భూభారతి చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేలా యంత్రాంగాన్ని ప్రభుత్వం సిద్ధం చేసుకుంటుంది. ఒక యాప్‌ను తీసుకొచ్చి సమస్య స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చూసుకొనేలా వీలుకల్పిస్తుంది.