Railway Department on Passengers : భారతీయ రైల్వే అంటేనే ఆలస్యానికి పెట్టింది పేరు. అలాంటిది రైలు ఆలస్యంగా స్టేషన్ కు చేరుకుందని రైలుపై ప్రయాణికులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. జబల్పూర్ లో జరిగినట్లుగా చెబుతున్న ఈ వీడియోలో కొందరు వ్యక్తులు రైలు లోకో పైలట్ పై దాడి చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి.
మన దేశంలో రైళ్లు చాలా సందర్భాల్లో ఆలస్యంగా నడుస్తుంటాయి. వాటికి అనేక కారణాలు సాకుగా చూపిస్తుంటారు. ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ ట్రైన్లో గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తుంటాయి. ఇక పాసింజర్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ.. జబల్పూర్ రైల్వే స్టేషన్ లో మాత్రం ఈ సారి ప్రయాణికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కట్టలు తెంచుకున్న కోపంతో ఏకంగా లోకో పైలెట్ క్యాబిన్ దగ్గరకు వెళ్లి గొడవ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.
జబల్పూర్ రైల్వే స్టేషన్ లోని ఐదో నంబర్ ప్లాట్ ఫామ్ పై బరౌనీ ఛత్ స్పెషల్ ట్రైన్ – 06563 వచ్చి ఆగగానే.. అందులో ప్రయాణించిన ప్రయాణికులు కొందరూ నేరుగా ట్రైన్ క్యాబిన్ దగ్గరకు వెళ్లారు. రైలు ఎందుకు 7 గంటలు ఆలస్యంగా నడుస్తోందని లోకో పైలెట్ ను ప్రశ్నించారు. అతను లోపల నుంచి ఏదో చెబుతుండగానే.. ఆవేశంగా క్యాబిన్ అద్దాలపై గట్టిగా కొట్టడం ప్రారంభించారు. లోకో పైలెట్ ను తీవ్రంగా తిడుతూ.. అద్దాలు పగలగొట్టారు. ఇంజిన్ గేటు తీసేందుకు ప్రయత్నించగా, అది తెరుచుకోలేదు. ప్రయాణికులు దాడి చేస్తున్న సమయంలో.. క్యాబిన్ లో ఇద్దర లోకో పైలెట్లు కనిపించారు. వారు.. ఆందోళనకారుల్ని శాంతపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ దాడి జరగే ముందు.. జబల్పూర్ స్టేషన్ కు ముందు గంట పాటు ఆగిపోయింది. ఇదే దాడికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. దాడి సమయంలో.. ఆలస్యానికి తాను బాధ్యుడిని కాదని, రైల్వే అధికారులు ఇచ్చే సూచనల ప్రకారమే తాను నడుచుకుంటానంటూ పైలెట్లు చెబుతున్నా ప్రయాణికులు వినిపించుకోలేదు. ఈ వీడియో వైరల్ కావడంతో.. జబల్పూర్ వెస్ట్ సెంట్రల్ రైల్వే అధికారులు స్పందించారు. ఈ వీడియో ఎక్కడిదో ఇప్పుడే చెప్పలేమన్న చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హర్షిత్ శ్రీవాస్తవ.. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామని ప్రకటించారు.
Also Read : లారీ ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జునుజ్జు.. ఫోటోలు, వీడియోలు తీస్తూ కూర్చున్న జనం..
విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని.. వైరల్ అవుతున్న వీడియోలో దాడి చేసిన నిందితుల మొహాలు స్పష్టంగా ఉన్నాయని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చర్యల్ని ప్రోత్సహించకూడదన్న రైల్వే అధికారి.. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.