Karnataka Education Minister| కర్ణాటకలో ఇటీవల కన్నడ భాష రాజకాయాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా జరిగిన ఘటనలో ఒక విద్యార్థి అందరిముందు మంత్రిగారికే కన్నడ తెలియదని ఎద్దేవా చేశాడు. దీంతో ఆగ్రహం చెందిన మంత్రి ఆ విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదంతా కర్ణాటక విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప బుధవారం ఒక వీడియో కాన్ఫెరెన్స్ లో విద్యార్థుల కోసం ఉచిత శిక్షణ కోర్సు ప్రారంభిస్తున్న సమయంలో జరిగింది.
కర్ణాటక విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప బుధవారం విధాన సౌధ (అసెంబ్లీ బిల్డింగ్) నుంచి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా రాష్ట్రంలోని 25000 మంది విద్యార్థుల కోసం కర్ణాటక కామన్ ఎంట్రెన్స్ టెస్ట్, జెఈఈ, నీట్ పరీక్షల ఉచిత శిక్షణ కోర్సు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడయోలో మంత్రి మధు బంగారప్ప ఉచిత శిక్షణ కోర్సు గురించి మాట్లాడుతుండగా.. కనపడని ఒక విద్యార్థి గొంతు వినిపించింది. మంత్రిగారికి మాతృభాష రాదు. “కన్నడ తెలియదు. ఆయన సరిగా కన్నడ మాట్లాడలేకపోతున్నారు.” అని ఒక విద్యార్థి చెబుతున్నట్లు స్వరం వినిపించింది. అయితే అతను చేసిన వ్యాఖ్యలు అందరికీ వినిపించాయి. మంత్రి మధు బంగారప్ప ఇది విని.. కోపంగా మాట్లాడారు. “ఎవరీ వ్యాఖ్యలు చేసింది. నాకు కన్నడ తెలియదా? ఇంతసేపు నేను ఏమైనా ఉర్దూలో మాట్లాడుతున్నానా? టివిలో కనిపిస్తున్నామని రెచ్చిపోయి ఏది పడితే అది మాట్లాడకూడదు. నాకు కన్నడ తెలియదని ఎవరు చెప్పింది? టీచర్లు, విద్యాశాఖ అధికారులు అతనిపై చర్యలు తీసుకోండి. ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించండి. దీనిపై నేను మౌనంగా ఉండను.” అని మంత్రి బంగారప్ప చిరాకు పడుతూ అన్నారు.
Also Read: 10 మంది పిల్లల తండ్రితో ప్రేమవివాహం.. ప్రాణహాని ఉందని కోర్టుకెళితే జడ్జి ఫైర్
అయితే మంత్రి మధు బంగారప్ప వ్యవహరించిన తీరుని ప్రతిపక్ష పార్టీ అయిన బిజేపీ తీవ్రంగా విమర్శించింది. ట్విట్టర్ ఎక్స్ లో కర్ణాటక బిజేపీ.. ఈ ఘటనకు సంబంధించి ఒక పోస్ట్ చేసింది. ఆయనను ఎద్దేవా చేస్తూ.. ఒక కార్టూన్ ఇమేజ్ ని పోస్ట్ లో పెట్టింది. “మంత్రి గారు ఎవరైనా ప్రశ్నలు అడగండి అని అంటారు. ఆ తరువాత తనే ప్రశ్నించేవారిని మూర్ఖులు అని అంటారు” అని కింద క్యాప్షన్ పెట్టింది.
కేంద్ర మంత్రి, కర్ణాటక మంత్రి ప్రల్హాద్ జోషీ కూడా మధు బంగారప్పకు ప్రజలతో ఎలా వ్యవహరించాలో తెలియదని విమర్శించారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే విద్యార్ధి పట్ల కఠినంగా వ్యవహరించి ఏ సాధింస్తుందని ప్రశ్నించారు.