Rajasthan News : చితిపై ఉంచిన శవం ఒక్కసారిగా శ్వాస తీసుకుంటే ఎలా ఉంటుంది. చనిపోయాడని వైద్యులు ధృవీకరించిన తర్వాత కూడా ప్రాణాలతోనే ఉన్నానంటూ కళ్లముందు కనిపిస్తే ఏం జరుగుతుంది. ఇలాంటివి కలలోనే జరుగుతాయి కానీ.. నిజంలో కాదు అంటారా. కానీ.. ఇలాంటి ఘటన రాజస్థాన్ లో నిజంగానే జరిగింది. దాంతో.. ఆ రాష్ట్రంతో పాటు విషయం తెలుసుకున్న వాళ్లంతా.. ఆశ్చర్యపోతున్నారు.
రాజస్థాన్ లోని ఝున్ ఝూన్ లో రోహితాశ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను బధిరుడు, పైగా కుటుంబం కూడా లేదు. దాంతో.. స్థానికంగా ఉండే ఓ షెల్టర్ హోమ్‌లో కొన్నాళ్లుగా ఉంటున్నాడు. ఏమైందో కానీ.. ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. గుర్తించిన అనాథాశ్రయం నిర్వహకులు.. రోహితాశ్ ను ఆసుపత్రికి తరలించారు. స్థానిక బీడీకే ఆస్పత్రికి తరలించగా… పరీశించిన వైద్యులు అత్యవసర వార్డులో చేర్చారు. అతన్ని తిరిగి స్పృహలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. కానీ.. ప్రయోజనం లేకపోయింది.
మొదట వైద్యానికి స్పందించడం లేదన్న వైద్యులు.. తర్వాత అతను మరణించినట్లు వెల్లడించారు. దాంతో.. అనాథ అయిన రోహితాశ్ ను.. ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. అనాథ వ్యక్తి కావడంతో.. పోలీసులు వచ్చి, ఆసుపత్రిలో నిర్వహిచాల్సిన నిబంధనల్ని పూర్తి చేశారు. వైద్యుల ధృవీకరణ తర్వాత, పంచనామా పూర్తి చేసిన పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతక్రియల కోసమని.. స్థానిక శ్మశానవాటికకు తరలించారు. అక్కడే.. చితిని పేర్చి..దానిపై రోహితాశ్ ను పడుకోబెట్టారు. అప్పుడే.. గుండెలు అదిరిపోయే సంఘటన చోటుచేసుకుంది.
మరికొద్ది నిముషాల్లో చితికి నిప్పంటించే ప్రయత్నాల్లో ఉండగా.. చితిపై శవం శ్వాస తీసుకుంటుండడం కనిపించింది. దాంతో.. హతాశయులైన అక్కడి వారు, నిర్ఘాంతపోయారు. వెంటనే.. చితిపై ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్లి పరిశీలించగా.. అతని గుండె కొట్టుకుంటూనే ఉంది. శ్వాస కూడా తీసుకుంటూ ఉన్నాడు. దాంతో.. ఎమర్జెన్సీగా అంబులెన్స్ ను తీసుకువచ్చి.. అతడిని తిరిగి బీడీకే ఆసుపత్రికే తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు.. రోహితాశ్ బతికే ఉన్నాడని వెల్లడించారు.
బాధిత యువకుడికి అక్కడ వైద్యం అందించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జైపూర్ తరలిస్తుండగా.. దారి మధ్యలోనే మృతి చెందాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అనాథ, బధిరుడు అయిన వ్యక్తిపై వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అతడికి ఎవరూ లేకపోవడం వల్లే.. బతికున్న వ్యక్తిని కూడా చనిపోయినట్లు నిర్లక్ష్యంగా చెప్పారని ఆరోపిస్తున్నారు.
Also Read : రోడ్డుపైకి లాక్కొచ్చి, ఇద్దరిని నరికి చంపిన మావోయిస్టులు.. వారి కోపానికి కారణమేంటి..
బాధిత యువకుడికి సరైన సమయంలో వైద్య సహాయం అందిస్తే.. కోలుకునేవాడని అంటున్న ఆశ్రమ నిర్వహకులు.. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి తీసుకువస్తే వైద్యులు సరిగా స్పందించలేదని అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం.. సీరియస్ అయ్యింది. ఈ ఘటనలో యువకుడు చనిపోయినట్లు నిర్ధరించిన ముగ్గురు వైద్యులను అధికారులు సస్పెండ్ చేశారు. బాధితుడికి సరైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించారారని తెలుపుతూ.. ఆసుపత్రి ముఖ్య వైద్య అధికారి సహా ముగ్గురు డాక్టర్లను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగడంతో.. పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.