Visakha Crime News: విశాఖలో దారుణం జరిగింది. ఓ రియల్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్టు లేఖలో తేలింది. దీనిపై ఆయన కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తంచేశారు. ఆత్మహత్య చేసుకునే పిరికివాడని కాదని, దీని వెనుక ఏదో జరిగిందిని అంటున్నారు. ఈ ఘటనపై కుటుంబసభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
అసలేం జరిగింది?
విశాఖ సిటీకి చెందిన రియల్టర్ పేరు నడింపల్లి సత్యనారాయణరాజు. ఆయన వయస్సు 70 ఏళ్లు కాగా, సీతమ్మధారలో ఉంటున్నారు. నాలుగు దశాబ్దాలుగా ఆయన రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే చెప్పాల్సిన అవసరం లేదు. అప్ అండ్ డౌన్స్ సహజం. అందులోనూ 40 ఏళ్లుగా అందులో నిమగ్నమయ్యారు. విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్థిల్లుతోంది.
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయనకు కొంతమంది నుంచి రావాల్సిన బకాయిలు కోట్లలో పేరుకుపోయాయి. పైగా వ్యాపారంలో నష్టాలు మొదలయ్యాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. ఆపై విఫలమయ్యాడు. ఈ అప్పుల నుంచి తప్పించుకోలేమని ఫైనల్‌గా ఓ నిర్ణయానికి వచ్చేశాడు. తాను చనిపోయే ఇలాంటి సమస్యలు ఉండవని భావించాడు. తన చావుకు తాను ముహూర్తం పెట్టేసుకున్నాడు.
ఉమ్మడి విశాఖ జిల్లాలోని దేవరాపల్లి మండలం మామిడిపల్లిలోని రిసార్ట్స్‌కు రియల్టర్ సత్యనారాయణరాజు అప్పుడప్పుడు వచ్చేవాడు.. మనసు బాగా లేనప్పుడు ఓ రోజు ఉండి వెళ్లేవాడు. ఆదివారం ఉదయం పదిన్నరకు ఆ రిసార్ట్స్ వచ్చాడు ఆయన. రాత్రి కూడా భోజనం చేశాడు. సోమవారం ఉదయానికి ఆయన ఊయలకు ఉరేసుకున్నాడు.
ALSO READ: యూట్యూబ్ చూశారు.. ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఇద్దరు మహిళలు
గదిలో వేలాడుతూ కనిపించిన రియల్టర్
రిసార్ట్స్ మేనేజర్ నిద్ర లేచి చూడగా గదిలో వేలాడుతూ కనిపించాడు. వెంటనే బయపడిన ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అటు సత్యనారాయణరాజు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రియల్టర్ ఉరేసుకున్న గదిని క్షుణ్నంగా పరిశీలించారు. ఆత్మహత్యకు ఆయన ఆరుగురికి వేర్వేరుగా రాసిన లేఖలు రాశారు.
వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో మనోవేదన, చెల్లించాల్సిన బకాయిలను ప్రస్తావించాడు. కేవలం పిరికి తనంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అందులో ప్రస్తావించాడు. ఈలోగా రియల్టర్ కుటుంబసభ్యులు రిసార్ట్స్ కు చేరుకున్నారు. భార్య విజయలక్ష్మి, కొడుకు సాయి చైతన్యవర్మ ఉన్నారు.
ఆత్మహత్య చేసుకునే పిరికివాడు తన తండ్రి కాదని, దీని వెనుక ఏదో జరిగి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశాడు. తన తండ్రి ఆత్మహత్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. వెంటనే దర్యాప్తు మొదలుపెట్టారు. తొలుత రిసార్ట్స్ వాచ్‌మేన్, అక్కడికి వచ్చే సిబ్బందిని విచారించారు. రిసార్ట్స్‌కు వచ్చిన ప్రతిసారీ ఆయన మదనపడుతూ కనిపించేవారని తెలిపారు. మరి ఆయన ఫోన్‌కాల్ డేటాపై దృష్టి పెడితే ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.