Delhi: ఎండాకాలం వస్తే గ్యాస్ సిలిండర్లతో జాగ్రత్త అని పదే పదే గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులను హెచ్చరించేవి. గ్యాస్ కంటే డేంజర్‌గా మారుతున్నాయి ఏసీలు. ఈ సీజన్‌లో ఉత్తరాదిలో ఎండలు 45 డిగ్రీలు దాటేశాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మాజీ ఐఏఎస్ ఇంట్లో ఏసీ పేలిపోయింది. ఈ ఘటనలో ఆయన మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అసలేం జరిగింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
ఢిల్లీలో దారుణం.. ఏసీ పేలి మాజీ ఐఏఎస్ మృతి
దక్షిణ ఢిల్లీలోని హౌజ్‌ఖాస్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు మాజీ ఐఏఎస్ అధికారి ధనేంద్ర కుమార్ ఫ్యామిలీ. ఆయన వయస్సు 80 ఏళ్లు. బుధవారం రాత్రి పదకొండు గంటల సమయంలో ఆయన ఇంట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లోని ఏసీ ఇండోర్ యూనిట్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.
పేలుడు సమయంలో వచ్చిన పొగ పీల్చడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇరుగుపొరుగువారు ధనేంద్రకుమార్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. తండ్రిని రక్షించే క్రమంలో కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బుధవారం రాత్రి ఘటన.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి
ప్రమాద సమయంలో ఇంట్లో ఐదుగురు సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే అలర్టయిన స్థానికులు, పోలీసులు వారిని బయటకు తీసుకొచ్చారు. అస్వస్థతకు గురైన ధనేంద్ర కుమార్‌ను ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ఏసీ పేలుడు వల్లే మంటలు వ్యాపించాయని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇందులో అనుమానాస్పద కోణం లేదని నిర్ధారించారు. ఏపీ వేలిన వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. 1968 బ్యాచ్ హర్యానా క్యాడర్ ఐఏఎస్ అధికారి ధనేంద్ర కుమార్.
ALSO READ: ఈమె మామూలు మహిళ కాదు.. భర్తతోపాటు అత్తింటివారిని చంపి, కారులో మృతదేహాలను తగులబెట్టి
దేశంలోని వివిధ రంగాల్లో ఆయన సేవలు అందించారు. రక్షణ, రోడ్డు రవాణా, సాంస్కృతిక శాఖల్లో కార్యదర్శిగా, ప్రపంచ బ్యాంకులో భారత ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009-11 వరకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా- సీసీఐ వ్యవస్థాపక ఛైర్మన్ ఆయన. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు, మాజీ ఐఏఎస్ అధికారులు తీవ్ర సంతాపం తెలిపారు.