Medipally Incidnet: హైదరాబాద్ శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం ప్రాణ సంకటంగా మారి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల నిండు ప్రాణాలను బలితీసుకుంది. బోడుప్పల్ వైపు నుంచి ఐటీ పోచారం వైపు వేగంగా వెళ్తున్న కారు, మేడిపల్లి వద్ద అదుపుతప్పి ఒక్కసారిగా ఫ్లైఓవర్ పిల్లర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జవ్వగా, లోపల ఉన్న విద్యార్థుల హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
ఈ ప్రమాద సమయంలో కారులో మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన మిగిలిన వారిని స్థానికులు, పోలీసులు కలిసి తక్షణమే చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతులను వనపర్తి జిల్లాకు చెందిన విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చిన బిడ్డలు ఇలా విగతజీవులుగా మారడంతో వారి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, పరిమితికి మించిన వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఫ్లైఓవర్ పిల్లర్‌ను ఢీకొట్టిన వేగానికి కారు ఇంజన్ భాగం పూర్తిగా ధ్వంసమై లోపలికి చొచ్చుకుపోయింది. సీట్ బెల్టులు ధరించకపోవడం, సామర్థ్యం కంటే ఎక్కువ మంది కారులో ప్రయాణించడం వల్ల ప్రాణనష్టం ఎక్కువగా జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, అతివేగమా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: భూపాలపల్లి సింగరేణిలో భారీ అగ్నిప్రమాదం.. కళ్లముందే కాలిపోయిన వెలుగులు
చిరు ప్రాయంలోనే ఎంతో భవిష్యత్తు ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులు ఇలా రోడ్డు ప్రమాదాలకు గురికావడం అందరినీ కలచివేస్తోంది. అతివేగం ఆనందాన్ని ఇస్తుందేమో కానీ, అది ఒక్కోసారి జీవితాంతం కోలుకోలేని శోకాన్ని మిగులుస్తుందని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. వాహనదారులు ముఖ్యంగా యువత వేగ నియంత్రణ పాటిస్తూ, భద్రతా ప్రమాణాలను అనుసరించాలని పోలీసులు కోరుతున్నారు.
హైదరాబాద్-మేడిపల్లి పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం
అతివేగంగా వచ్చి ఫ్లైఓవర్ పిల్లర్‌ను ఢీకొట్టిన కారు
ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
ప్రమాద సమయంలో కారులో మొత్తం 8 మంది
కారు బోడుప్పల్ నుంచి ఐటీ పోచారం వెళ్తుండగా ఘటన
విద్యార్థులు వనపర్తి… pic.twitter.com/Xz1DEW6E7L
— BIG TV Breaking News (@bigtvtelugu) January 28, 2026