Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మదనపల్లె బైపాస్ రోడ్డులోని జే టౌన్ (J-Town) సమీపంలో వేగంగా వచ్చిన క్వాలిస్ వాహనం, ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ఆటో నుజ్జునుజ్జవ్వగా, అందులో ప్రయాణిస్తున్న చెంబకూరు హరిజనవాడకు చెందిన నారాయణ, రెడ్డప్పలు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రమాద సమయంలో ఆటోలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండటంతో నష్టం తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మరో 9 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితిని సమీక్షించిన వైద్యులు, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరు, తిరుపతి ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం డ్రైవర్ అతివేగము, నిర్లక్ష్యపు డ్రైవింగ్ అని స్థానికులు చెబుతున్నారు.
Also Read: కొండగట్టు అంజన్న చెంతకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
విషయం తెలిసిన వెంటనే మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌బాష ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్య సహాయం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్న ఆయన, బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.