Vikarabad Road Accident: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై ఆగివున్న లారీని ఓ టూరిస్టు బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. మరో 20 మందికిపైగానే గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంలో ఉన్నట్లు చెబుతున్నారు. గాయపడినవారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలోని బీజాపూర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మూడు రోజుల కిందట పరిగి ఓ వివాహం జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెళ్లి గ్రామానికి చెందిన కొందరు టూరిస్టు బస్సులో పరిగిలో సోమవారం ఫంక్షన్‌కు హాజరయ్యారు. పరిగి నుంచి తిరిగి వస్తుండగా మంగళవారం తెల్లవారుజామున ఆ బస్సు ప్రమాదానికి గురైంది.
రోడ్డుపై నిలిపిన లారీని టూరిస్టు బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో స్పాట్‌లో ఒకరు మృతి చెందారు. ఘటన జరిగిన ప్రాంతం నుంచి పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, పురుషులు ఉన్నారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. చాలామందికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి.
తీవ్రంగా గాయపడినవారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఈ ఘటనలో బీజాపూర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈలోగా బస్సులో ఉన్న ప్రయాణికులను బయటకు తీశారు. వారిని అంబులెన్సులో సమీపంలో ఆసుపత్రికి తరలించారు. వాహనాలను పక్కనబెట్టారు.
ALSO READ: మలేషియాలో తెలంగాణ వాసి మృతి, కడసారి చూపుకోసం కూతుళ్లు ఎదురుచూపు