Agra Death Mystery: తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో అపురూపంగా చూసుకుంటారు. వారికి ఏ కష్టం రాకుండా కాపాడుకుంటారు. బిడ్డ గాయపడితే, వారు బాధపడుతారు. అదే అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు ఆత్మహత్య చేసుకుంటే? ఆ తల్లిదండ్రుల శోకం మాటల్లో చెప్పలేం. గుండెలవిసేలా విలపిస్తారు. ఆగ్రాలో అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది. తన కొడుకు ఆత్మహత్యను చూసి తట్టుకోలేకపోయారు. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో తెలియక అయోమయానికి గురయ్యారు. తండ్రి ఎలాగైనా తన కొడుకు సూసైడ్ వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో అసలు నిజాలు తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాడు.
ఉత్తర ప్రదేశ్ లో ఆగ్రాలో అక్టోబర్ 9, 2025న బి.కామ్ చదివే విద్యార్థి ఆకాష్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కంటికి రెప్పలా కాపాడుకున్న కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు గుండె పగిలేలా రోదించారు. తండ్రి సుఖ్ వీర్ సింగ్ తన కొడుకు ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో అని ఆలోచించాడు. ఆత్మహత్య వెనుక గల కారణాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత తన కొడుకు మొబైల్ ఫోన్‌ను చెక్ చేశాడు. అతడి ఫోన్ అంతా ఖాళీగా కనిపించింది. ఫోన్ ఫార్మాట్ చేసినట్లు కనిపించింది. అతడికి అనుమానాన్ని మరింత పెంచింది. ఏం జరిగిందో తెలుసుకోవాలనుకున్నాడు.
తన అనుమానాలు క్లారిఫై చేసుకోవాలనుకున్నాడు. సుఖ్ వీర్ కొడుకు ఫోన్ డేటాను రికవరీ చేయాలనుకున్నాడు. ఆయన స్వయంగా ఇంజినీర్ కావడంతో డేటాను తిరిగి పొందాడు. అసలు విషయం తెలిసి షాకయ్యాడు. కొడుకు కొంత మంది అజ్ఞాత వ్యక్తుల నుంచి గత కొంతకాలంగా బ్లాక్ మెయిల్ కు గురవుతున్నట్లు గుర్తించాడు. చాటింగులు, కాల్ లాగ్స్ సహా అన్ని వివరాలు పరిశీలించాడు. కొడుకు మార్ఫింగ్ ఫోటోలు బయటపడ్డాడు. ఈ డేటా చూసిన తండ్రి వెంటనే పోలీసులను సంప్రదించాడు. అక్టోబర్ 28న హత్రాస్ గేట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.
కేసు విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. నిందితులు ఒక వృద్ధుడి ఫోన్ నంబర్‌ను క్లోన్ చేసి, ఆకాష్ సింగ్ నుంచి డబ్బు వసూలు చేయడానికి దానిని ఉపయోగించినట్లు ఎస్పీ చిరంజీవనాథ్ సిన్హా వెల్లడించారు. ఆకాష్ ఫోటోలను ఏఐ సాయంతో మార్ఫ్ చేసి, అతడికి పంపించి బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. వారి బెదిరింపులకు దిగడంతో పాటు ఆకాష్‌ను నాలుగు విడతలుగా రూ. 40,000 బదిలీ చేయమని బలవంతం చేసినట్లు వెల్లడించారు. డబ్బు చెల్లించకపోతే అతని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించారు. ఎక్కడ అలా చేస్తారోనని భయపడి ఆకాష్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
పోలీసులు ఈ కేసును లోతుగా విచారించారు. సాంకేతిక నిఘా, బ్యాంక్ అకౌంట్ ట్రాకింగ్, డిజిటల్ ఆధారాల తర్వాత, తాజాగా మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్ జిల్లాకు చెందిన రోహన్ బిహారీలాల్ సోనావానే, కరణ్ రాజేంద్ర చిందాలియాలను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో.. మహిళలుగా నటిస్తూ బాధితుల నుంచి డబ్బు వసూలు చేయడానికి వాట్సాప్‌లో వర్చువల్ నంబర్‌లను ఉపయోగించారని నిందితులు వెల్లడించారు. ముఠాలోని ఇతర సభ్యులను కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: యూనిఫామ్ వేసినా తప్పని వేధింపులు.. ఇద్దరి వేధింపులు భరించలేక కానిస్టేబుల్ మృతి