Son Killed Step Mother : పల్నాడు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. శంకాపురంలో ఆస్తి కోసం పెంచిన తల్లిని అతికిరాతకంగా చంపాడు కసాయి కొడుకు. దాచేపల్లి మండలం శంకరాపురం గ్రామంలో బాణావత్ లక్ష్మీబాయి నివాసం ఉంటోంది. అయితే ఆమె పెంచిన కొడుకు దత్తు నాయక్.. ఇంటిని తన పేరున రాయాలని కొద్దిరోజులుగా వేధిస్తున్నాడు.
ఇంటిని దత్తు నాయక్(30) పేరుపై రాసేందుకు లక్ష్మీబాయి(45) ఒప్పుకోలేదు. ఆమెపై కక్ష పెంచుకున్న దత్తు.. అడ్డుతొలగిస్తే ఇల్లు తనదే అవుతుందనుకున్నాడు. గత అర్థరాత్రి సమయంలో లక్ష్మీబాయి ఇంటిలో నిద్రిస్తుండగా.. మెయిన్ కరెంట్ లైన్ నుంచి ఇంటిలోకి కరెంటును లాగాడు. ఆమె కాళ్లకు కరెంట్ వైర్లు చుట్టి.. చిత్రహింసలకు గురిచేసి రాక్షసానందం పొందాడు. ఆపై ఆమె తలపై గుణపంతో కొట్టి హత్య చేశాడు. అనంతరం తనకు తానుగానే దాచేపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు దత్తు చెప్పిన వివరాల మేరకు కేసు నమోదు చేసి.. లక్ష్మీబాయి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు.