Cyber Crime: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యుడి నుంచి ఉన్నత వర్గాలకు చెందిన వారిని దోచేస్తున్నారు. చాలామంది పడి మోసపోతున్నారు. తాజాగా మాజీ ప్రధాని కుమారుడి బ్యాంక్ ఖాతా నుంచి కోట్లాది రూపాయలు కొట్టేశారు. రికవరీ పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అసలేం జరిగింది? మాజీ పీఎం కొడుకు ఎవరు?
ఢిల్లీలో భారీ సైబర్ మోసం.. మాజీ పీఎం కుమారుడి ఖాతా నుంచి కోట్లు కొట్టేశారు
దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. మాజీ ప్రధాని ఐకె గుజ్రాల్ కొడుకు నరేష్ గుజ్రాల్.. సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. టెక్స్‌టైల్స్-లెదర్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను ఆయన నడుపుతున్నారు. నరేష్ గుజ్రాల్ వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోను దొంగిలించిన కేటుగాళ్లు, నకిలీ వాట్సాప్ ఖాతా క్రియేట్ చేశారు.
ఈనెల అంటే జూన్ 12-16 తేదీల మధ్య నకిలీ ఖాతా ద్వారా గుజ్రాల్ కంపెనీకి చెందిన ఆర్థిక విభాగం ఉద్యోగిని సంప్రదించారు. కొన్ని పనుల నిమిత్తం బ్యాంకు ఖాతాలకు కోట్ల రూపాయల నగదు బదిలీ చేయాలని ఆదేశించారు. ఫోన్ చేసిన వ్యక్తి తన యజమాని అని నమ్మిన ఆ ఉద్యోగి, ఎలాంటి అనుమానం రాకుండా వేర్వేరు లావాదేవీల ద్వారా కోట్ల రూపాయలను నేరగాళ్లు సూచించిన ఖాతాల్లోకి బదిలీ చేశాడు.
70 శాతం సొమ్ము లావాదేవీలను ఆపిన అధికారులు
మూడురోజుల కిందట నగదు బదిలీల విషయాన్ని సదరు ఉద్యోగి నరేష్ గుజ్రాల్ కూతురు దీక్‌కు తెలిపారు. దీంతో అసలు మోసం వెలుగులోకి వచ్చింది. ఆమె వెంటనే తన తండ్రిని సంప్రదించారు. తాను ఉద్యోగులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ విభాగం వేగంగా స్పందించింది. మోసపోయిన మొత్తంలో దాదాపు 70 శాతం డబ్బును స్తంభింప చేశారు. ఈ విషయాన్ని నరేష్ గుజ్రాల్ వెల్లడించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచన చేశారు.
ALSO READ: పెళ్లైన నెలన్నరకే.. బెడ్ రూమ్‌లో ఆ పని, తట్టుకోలేక నవవధువు ఆత్మహత్య
నరేష్ గుజ్రాల్ వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. శిరోమణి అకాలీ దళ్ సీనియర్ నాయకుడు. 2007-22 వరకు పంజాబ్ తరపున రాజ్యసభలో ఎంపీగా ఆయన పని చేశారు. ప్రస్తుతం ఆయన వస్త్ర, తోలు, దుస్తుల ఉత్పత్తుల తయారీ సంస్థకు అధిపతిగా ఉన్నారు. దివంగత మాజీ ప్రధాని ఇందర్ కుమార్ గుజ్రాల్ కొడుకు.