Prakasam Crime: అదొక స్పానే కానీ సెలూన్ సెంటర్ . మసాజ్ చేయించుకొనేందుకు అక్కడికి స్థానిక యువత వస్తారు. అలా వచ్చిన వారిని మసాజ్ చేస్తారు. అంతలోనే పోలీసులు వస్తారు. అమ్మో పోలీసులు అంటూ, నిర్వాహకుడు కేకలు వేస్తారు. ఇక అంతే తప్పించుకొనే మార్గం లేక, వారు లబోదిబో అంటూ గగ్గోలు పెడతారు. పోలీస్ స్టేషన్ కు వెళితే ఇంటి మర్యాద మంటగలిసి పోతుందన్న ఆందోళనతో బేరాలు సాగిస్తారు. వచ్చిన పోలీసులు కూడా సరే.. సరే కానివ్వండి ఇక అంటూ చేతులు ముందుకు చాచేస్తారు. హమ్మయ్య ఎలాగోలా తిప్పలు తప్పాయని వారు ఇంటికి వెళతారు. ఆ తర్వాత పోలీసులు, స్పా సెంటర్ నిర్వాహకుడు కలిసి పోతారు. ఇంతకు వచ్చింది నిజం పోలీసులు అనుకుంటే పొరపాటే, జస్ట్ వేషధారణ మాత్రమే వారిది. ఎట్టకేలకు ఆ స్పా సెంటర్ అసలు గుట్టును రట్టు చేశారు ప్రకాశం పోలీసులు.
అసలేం జరిగిందంటే.. పోలీసుల వివరాల మేరకు..
ప్రకాశం జిల్లా ఒంగోలు లోని భాగ్య నగర్ 2nd లైన్లో స్పా సెంటర్ ను శ్యామ్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. స్పా షాప్ పెట్టుకొని జీవిస్తూ వుండి, డబ్బులు అవసరమై ఒకరి వద్ద సుమారు 10 నెలల క్రితం రూ. 10 లక్షల డబ్బులు అవసరం ఉందని, 6 నెలల్లో తిరిగి ఇస్తానని సంప్రదిస్తాడు. రూ. 10 లక్షల డబ్బులు ఇవ్వగా, సదరు వ్యక్తి పదే పదే డబ్బులు తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేస్తుండగా, ఎలాగైనా ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టాలని శ్యామ్ భావించారు.
అదేవిధంగా బెదిరించి డబ్బులు గుంజాలని పథకం పన్ని, శ్యామ్ కుమార్ తనకు పరిచయం ఉన్న హైదరాబాదులో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తూ అప్పుడప్పుడు చిన్న చిన్న వీడియోలు చేస్తున్న విజయలక్ష్మిని సంప్రదించాడు. తనకు సహాయం చేయాలని, అందుకుగాను ప్రతిఫలంగా డబ్బులు చెల్లిస్తానని శ్యామ్ హామీ ఇచ్చాడు.
ముందుగా అనుకున్నట్లే పక్కా ప్లాన్ వేసి, అప్పు ఇచ్చిన వ్యక్తిని సెలూన్ సెంటర్ కి పిలిపిస్తారు. అప్పుడు అసలు డ్రామా మొదలవుతుంది. నకిలీ పోలీసులు ప్రవేశించి అప్పు ఇచ్చిన వ్యక్తిపై బెదిరింపులకు పాల్పడతారు. శ్యామ్ మాత్రం వారికి డబ్బులు ఇవ్వాలని, లేకుంటే అరెస్ట్ చేస్తారంటూ మరింతగా భయాందోళనకు గురిచేస్తాడు. ఇక అంతే అప్పు ఇచ్చిన వ్యక్తి అసలు విషయాన్ని పోలీసులకు తెలిపినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. అంతేకాకుండా స్పా సెంటర్ కు వచ్చే వారిని బురిడీ కొడుతున్నట్లు ఫిర్యాదులు అందాయన్నారు.
దీనితో స్పా సెంటర్ పై పోలీసులు దృష్టి సారించారు. స్పా సెంటర్ కు మసాజ్ కు వచ్చే వారే లక్ష్యంగా మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మసాజ్ కోసం వచ్చే వారిని న్యూడ్ గా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు, ఎలాగైనా స్పా సెంటర్ గుట్టు రట్టుకు పథకం రచించారు.
Also Read: TTD News: తిరుమలలో 10 రోజుల పాటు ఆ దర్శనాలు రద్దు.. టీటీడీ కీలక ప్రకటన
హైదరాబాద్ నుండి జూనియర్ ఆర్టిస్టులు..
స్పా సెంటర్ కు వచ్చేవారిని ఎలాగైనా, బెదిరించాలన్న లక్ష్యంతో నిర్వాహకుడు పెద్ద ప్లాన్ వేసినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి 8 మంది జూనియర్ ఆర్టిస్టులను ఒంగోలుకు పిలిపించి నకిలీ పోలీసుల అవతారం వేయించినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఎస్పీ అన్నారు. స్పా సెంటర్ కి పోలీసులు వచ్చారని భారీ ఎత్తున డబ్బులు ఇవ్వాలని, మసాజ్ కోసం వచ్చిన వారికి బెదిరింపులు చేయడం కోసమే జూనియర్ ఆర్టిస్టులను పిలిపించారన్నారు.
అలా బెదిరింపులు ఎదుర్కొన్న వారు, తమకు ఫిర్యాదు చేసినట్లు కేసు నమోదు చేసి నకిలీ పోలీసులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మొత్తం 9 మందిని అరెస్ట్ చేశామని, ఇటువంటి ఘటనలు జరగకుండ, స్పా సెంటర్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఎస్పీ అన్నారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.