Bus Accident: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 5 గురు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఉత్తరాఖండ్ తెహ్రీ జిల్లా నరేంద్ర నగర్ ప్రాంతంలోని కుంజాపురి-హిండోలఖల్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోతైన లోయలోకి దూసుకెళ్లేంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మరణించారని ఎస్డీఆర్ఎఫ్ తెలిపింది.తెహ్రీ బస్సు ప్రమాదం గురించి తెహ్రీ సీఎంవో శ్యామ్ విజయ్ మాట్లాడుతూ.. ‘బస్సులో మొత్తం 18 మంది ఉన్నారు. ఐదుగురు మరణించగా, మరో 13 మంది గాయపడ్డారు. గాయపడిన ప్రయాణికులలో ముగ్గురిని ఎయిమ్స్ రిషికేశ్‌కు, 10 మందిని చికిత్స కోసం నరేంద్ర నగర్ ఆసుపత్రికి తరలించాము’ అని తెలిపారు.
Also Read: Tirumala Accident: బ్రేక్ ఫెయిల్.. తిరుమల ఘాట్ రోడ్డులో కారు బోల్తా
బస్సు ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ప్రమాదం గురించి అధికారులతో సంప్రదిస్తున్నానని అన్నారు.
‘తెహ్రీలోని నరేంద్ర నగర్‌లోని కుంజాపురి ఆలయం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం చాలా హృదయ విదారకం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని జిల్లా యంత్రాంగం, ఎస్డీఆర్ఎఫ్ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని రిషికేశ్‌ఎయిమ్స్ కు తరలించారు. ఈ విషయంపై నేను స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదిస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ – సీఎం పుష్కర్ సింగ్ ధామి