బెంగళూరులోని చిక్కబనవర రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. బెంగళూరు-బెళగావి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని కేరళకు చెందిన ఇద్దరు బిఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతులను కేరళలోని పతనంతిట్ట జిల్లాకు చెందిన స్టెర్లిన్ ఎలిజా షాజీ (19), జస్టిన్ జోసెఫ్ (20) గా గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగిందని కర్ణాటక ప్రభుత్వ రైల్వే పోలీసులు తెలిపారు.
చనిపోయిన విద్యార్థులు ఇద్దరూ సప్తగిరి కళాశాలలో చదువుతున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ వసతిగృహంలో పేయింగ్ గెస్టులుగా ఉంటున్నారు. అయితే, ఈ ఘటనపై రైల్వే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా? ఆత్మహత్యాయత్నమా? అని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే వారి మృతిపై క్లారిటీ వస్తుందని పోలీసులు తెలిపారు. బెంగళూరు-బెళగావి వందే భారత్ ఎక్స్ ప్రెస్ బెళగావికి వెళుతుండగా ఈ సంఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2.35 గంటల ప్రాంతంలో జరిగిందని రైల్వే పోలీసులు వివరించారు. బాధితులు అక్కడికక్కడే మరణించారని, వారి మృతదేహాలు పట్టాలపై ఛిద్రమై నడిపోయిన స్థితిలో కనిపించాయని చెప్పారు.
పోలీసుల ప్రాథమిక నివేదికల ప్రకారం.. విద్యార్థులు ఇద్దరు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తమ పేయింగ్ గెస్ట్ వసతి గృహం నుంచి తిరిగి వెళుతుండగా రైల్వే పట్టాలు దాటే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సంఘటన సమయంలో రైలు హైస్పీడ్ తో ప్రయాణిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అప్పటికే స్టేషన్ నుంచి బయలుదేరి, విద్యార్థులను ఢీకొట్టే సమయానికి వేగం పుంజుకుంది. రైలు వేగం ధాటికి ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మృతదేహాలు కొంత దూరంలో ఎగిరిపడ్డాయి.
బెంగళూరు రూరల్ రైల్వే పోలీసులు, యశ్వంత్ పూర్ రైల్వే పోలీసులు కలిసి ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందా? ఆత్మహత్య చేసుకున్నారా? వీరి మధ్య ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా? అనే కోణంలో అన్వేషిస్తున్నారు. అయితే, ప్రాథమిక నివేదిక మాత్రం పట్టాలు దాటుతున్నప్పుడు ప్రమాదం జరిగిందని వెల్లడించింది. ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించారు. అటు ఈ ఘటనపై వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం వారి పేరెంట్స్ కు డెడ్ బాడీలను అప్పగించనున్నట్లు తెలిపారు.
Read Also: మూడు నెలలుగా కనిపించని యజమాని.. కుక్కల మలంలో దొరికినవి చూసి పోలీసులు షాక్!