Veg Pulav Recipe: వెజ్ పులావ్ అనేది అత్యంత ప్రాచుర్యం పొందిన, సులభంగా తయారుచేసుకోగలిగే వంటకం. ఇది రుచిగా ఉండడమే కాకుండా.. ఇందులో కూరగాయలు చేర్చడం వల్ల చాలా ఆరోగ్యకరం కూడా. పండగ రోజుల్లో లేదా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు తక్కువ సమయంలో తయారు చేయగలిగే ఈ పులావ్ వంటకాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తయారీకి కావలసిన పదార్థాలు:
బియ్యం (బాస్మతి లేదా సాధారణ బియ్యం)-1 కప్పు
ఉల్లిపాయ (సన్నగా తరిగినది)-1 మీడియం సైజు
అల్లం-వెల్లుల్లి పేస్ట్-1 టీస్పూన్
పచ్చిమిర్చి (నిలువుగా చీల్చినవి)-3-4
మిక్స్డ్ వెజిటబుల్స్ (క్యారెట్, బీన్స్, బఠాణీ, బంగాళాదుంపలు)-1 కప్పు
పుదీనా ఆకులు-¼ కప్పు
కొత్తిమీర (తరిగినది)-¼ కప్పు
నెయ్యి/నూనె-2 టేబుల్ స్పూన్లు
ఉప్పు-రుచికి సరిపడా
నీరు-1.5 కప్పులు
మసాలా దినుసులు:
దాల్చిన చెక్క – 1 అంగుళం ముక్క |-
లవంగాలు – 3-4
యాలకులు – 2
బిర్యానీ ఆకు- 2|
షాజీరా – ½ టీస్పూన్
వెజ్ పులావ్ తయారుచేసే విధానం:
1. బియ్యాన్ని నానబెట్టడం:
ముందుగా ఒక కప్పు బియ్యాన్ని కడిగి, కనీసం 15 నుంచి 20 నిమిషాలు నీటిలో నానబెట్టండి. దీనివల్ల అన్నం బాగా ఉడికి, పులావ్ పొడిపొడిగా వస్తుంది. నానిన తర్వాత నీటిని పూర్తిగా తీసివేయండి.
2. తాలింపు వేయడం:
ప్రెషర్ కుక్కర్‌లో లేదా ఒక మందపాటి గిన్నెలో నెయ్యి, నూనె వేసి వేడి చేయండి. నెయ్యి కరిగాక, మసాలా దినుసులు (దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, షాజీరా) వేసి, సువాసన వచ్చే వరకు వేయించండి.
3. కూరగాయలు వేయడం:
తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి, ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేవరకు బాగా వేయించండి. ఆ తరువాత.. అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయే వరకు నిమిషం పాటు వేయించాలి.
4. కూరగాయలు, మసాలా:
ఇప్పుడు తరిగి పెట్టుకున్న అన్ని మిక్స్డ్ వెజిటబుల్స్ (క్యారెట్, బీన్స్, బఠాణీ, బంగాళదుంపలు) వేసి, రుచికి సరిపడా ఉప్పు, ¼ టీస్పూన్ గరం మసాలా (అవసరమైతే) వేసి బాగా కలపండి. కూరగాయలను 2-3 నిమిషాలు వేయించాలి.
5. నీరు, బియ్యం:
తరువాత పుదీనా, కొత్తిమీర ఆకులు వేసి కలపండి. ఇప్పుడు నానబెట్టి, నీరు తీసేసిన బియ్యాన్ని వేసి, మెల్లగా కలపాలి. బియ్యం విరిగిపోకుండా జాగ్రత్తపడాలి. చివరిగా.. 1.5 కప్పుల నీరు పోసి, ఉప్పు సరిచూసుకోవాలి.
Also Read: బీపీని తగ్గించడానికి.. ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ?
6. వంట :
ప్రెషర్ కుక్కర్: కుక్కర్‌పై మూత పెట్టి.. మీడియం మంటపై ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. విజిల్ వచ్చాక.. వెంటనే మూత తెరవకుండా.. ఆవిరి పూర్తిగా పోయేవరకు 10 నిమిషాలు అలాగే ఉంచాలి.
సాధారణ గిన్నె: మూత పెట్టి, మంటను తగ్గించి.. నీరంతా ఇగిరిపోయి, అన్నం ఉడికే వరకు సుమారు 15-20 నిమిషాలు ఉడికించాలి.
7. సర్వింగ్:
కుక్కర్ ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత.. మెల్లగా మూత తీసి, అన్నాన్ని చెదరగొట్టకుండా నిదానంగా కలపాలి. అంతే.. ఘుమఘుమలాడే వెజ్ పులావ్ సిద్ధం. దీనిని రైతా (పెరుగు పచ్చడి) లేదా ఏదయినా గ్రేవీ కర్రీతో వేడిగా వడ్డిస్తే అద్భుతంగా ఉంటుంది.