Tirupati Crime: తిరుపతి జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కన్నబిడ్డలను చూసేందుకు వెళ్లిన ఓ అల్లుడిపై.. సొంత మామనే పెట్రోల్ పోసి నిప్పంటించిన ఉదంతం వెంకటగిరిలో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణానికి చెందిన హరిప్రసాద్‌కు, అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహమైంది. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తీవ్రమైన మనస్పర్థలు తలెత్తాయి. ఇద్దరి మధ్య గొడవలు ముదరడంతో.. దంపతులిద్దరూ విడివిడిగా నివసిస్తున్నారు. భార్య తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది.
విడిగా ఉంటున్నప్పటికీ.. తన పిల్లలపై ఉన్న ప్రేమతో హరిప్రసాద్ వారిని చూసేందుకు తరచూ ప్రయత్నించేవాడు. ఈ క్రమంలోనే తాజాగా పిల్లలను చూడాలనే ఉద్దేశంతో వెంకటగిరిలోని తన అత్తగారి ఇంటికి వెళ్లాడు. అయితే.. అల్లుడి రాకను అత్తగారి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. అక్కడ మరోసారి మామతో హరిప్రసాద్‌కు వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ గొడవ తీవ్రరూపం దాల్చడంతో.. ఆగ్రహంతో ఊగిపోయిన మామ అమానుషానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఉన్న పెట్రోల్‌ను అల్లుడు హరిప్రసాద్‌పై పోసి నిప్పుంటించాడు. క్షణాల్లో మంటలు అంటుకోవడంతో హరిప్రసాద్ ఆర్తనాదాలు చేస్తూ బయటకు పరుగులు తీశాడు. స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు.
ఈ దారుణ ఘటనలో హరిప్రసాద్ శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. సుమారు 70 శాతం పైగా శరీరం కాలిపోవడంతో అతని పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే అతడిని స్థానిక వెంకటగిరి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో.. మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంకటగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడైన మామపై కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కుటుంబ కలహాల వల్ల తలెత్తిన కోపం ఒక నిండు ప్రాణాన్ని బలిగొనే స్థాయికి చేరడం స్థానికంగా విషాదం నింపింది.
ALSO READ: KTR: సిరిసిల్లలో కేటీఆర్ బ్యాటింగ్.. తొలి బంతికే సిక్సర్..!