Dog killing news: విజయవాడ నగరం మరోసారి ఓ క్రూరమైన ఘటనకు వేదికైంది.కమనిషి మానవత్వాన్ని సిగ్గుపడేలా చేసే ఘోరం చోటుచేసుకుంది. కానూరు వరలక్ష్మి పురంలో గుర్తు తెలియని వ్యక్తి వీధి కుక్కలపై మానవత్వాన్ని మరిచిపోయి, వాటికి పురుగుల మందుతో చంపేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
స్థానికుల కథనం ప్రకారం, వరలక్ష్మిపురం 5వ లైన్ సమీపంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి, అన్నంలో పురుగుల మందు కలిపి వీధిలో వదిలేశాడు. అనాధలా జీవిస్తూ, దయాభిక్షలపై ఆధారపడే ఆ 7 వీధికుక్కలు ఆకలితో ఆహారంగా భావించి ఆ అన్నం తిన్నాయి. ఆహారం తిన్న కొద్ది నిమిషాల్లోనే ఆ కుక్కలు చూస్తుండగానే బలవతంగా మరణించాయంటే మాటలు రావు!
ఈ దృశ్యం చూసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. కొందరు జంతు ప్రేమికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి, వీడియోలు తీసి సోషల్ మీడియాల్లో పోస్టు చేశారు. ఈ వీడియోలు ఒక్కసారిగా వైరల్ కావడంతో, సమాజంలో మానవత్వం మిగిలిందా? అనే చర్చలు మళ్లీ మొదలయ్యాయి.
స్థానిక జంతుప్రేమికులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. జంతువుల పట్ల అలా క్రూరంగా ప్రవర్తించే వ్యక్తిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని, ఇలాంటి మానవత్వం లేని చర్యలకు కఠిన శిక్షలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.
వీధికుక్కలు మనుషుల మధ్య జీవించే జీవులు. వారు మనం ఆదరించినా, చేరదీయకనప్పటికీ నమ్మకంగా, భయపడుతూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. అలాంటి జంతువులను ఇలా చంపడం పాశవికత్వం కాక మరేం? వాటికి ఉన్నది ప్రాణం కదా.. ఇలా ద్రోహం చేయడం అంటే ప్రకృతికే ద్రోహం చేసినట్టే అంటున్నారు జంతు ప్రేమికులు.
Also Read: Sarla Aviation Amaravati: ఏపీకి సూపర్ క్రెడిట్.. ఇకపై విమానాల తయారీ ఇక్కడే!
ఇటీవలి కాలంలో అనేక నగరాల్లో వీధికుక్కలపై దాడులు, మానవత్వం లేని చర్యలు పెరుగుతున్నాయి. వాటి పట్ల మన దృష్టికోణం మారాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వం హత్యలకు పాల్పడిన వారిని కేవలం కింది స్థాయి కేసులతో వదిలేయకుండా, జంతు సంరక్షణ చట్టాల కింద కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
పురుగుల మందు అన్నంలో కలిపి వేసి చంపడం అంటే, అది కేవలం జంతుపై కాకుండా సమాజంపై జరిగిన దాడి అనేలా చూడాలి. ఇది పిల్లలకి, ఇతర జంతువులకి కూడా ప్రమాదకరం. అదే అన్నాన్ని చిన్నపిల్లలు తినేసి ఉంటే పరిస్థితి ఇంకెంత భయంకరంగా మారేదో ఊహించుకోవచ్చు.
ఈ నేపథ్యంలో స్థానికులు, జంతు ప్రేమికులు కోరుతున్నది ఒక్కటే.. సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించి, నిందితుడిని త్వరగా పట్టుకోవాలి. అలాగే, వీధికుక్కలకు రక్షణగా నివాస ప్రాంతాల్లో సురక్షిత ప్రదేశాలు చూసి వాటికి రక్షణ ఏర్పాటు చేయాలి. సృష్టిలోని ప్రతి జీవిని మానవత్వంతో చూస్తేనే మన సమాజం నిండుగా ఉంటుందని జంతు ప్రేమికుల వాదన.
ఈ సంఘటన మనల్ని ఆలోచింపచేసేలా ఉంది. మనం మాట్లాడలేని జీవుల్ని బాధించకుండా, మానవత్వంతో జంతువుల పట్ల మమకారం చూపే సమాజం కావాలి. ఒక్కసారి చనిపోయిన ఆ కుక్కలు తిరిగి రావు. కానీ మిగిలినవారికి కనీసం భయపడకుండా జీవించే హక్కు ఉండాలి కదా? అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.