Sarla Aviation Amaravati: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల వర్షం కురిసే రోజులొచ్చాయి. ఎలక్ట్రిక్ విమానాల తయారీ నుంచి డిఫెన్స్ టెక్నాలజీ వరకు, భారీ డేటా సెంటర్ల స్థాపన వరకు.. అన్ని రంగాల్లో ప్రముఖ సంస్థలు ఏపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డిని ఇటీవల అమరావతిలో ప్రముఖ కంపెనీలు కలిసి పెట్టుబడుల ప్రణాళికలు వివరించాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న అనుకూల వాతావరణం, మౌలిక వసతుల అభివృద్ధి దృష్ట్యా ఈ సంస్థలు ఏపీలో తమ భవిష్యత్తును చూసే స్థాయికి వచ్చాయి.
సార్లా ఏవియేషన్ – ఎలక్ట్రిక్ విమానాల తయారీ కేంద్రం
విమాన రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తున్న సార్లా ఏవియేషన్, ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (EVTOL) విమానాల తయారీ యూనిట్‌ను ఏపీలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇది రన్‌వే అవసరం లేకుండా నేరుగా పైకి ఎగిరే చిన్న విమానాలు తయారు చేసే ప్రత్యేకమైన యూనిట్. రాబోయే రోజుల్లో నగరాల ట్రాఫిక్ నుంచి విముక్తి పొందాలంటే, ఇటువంటి విమానాలే పరిష్కారం. ఈ యూనిట్ రాష్ట్రానికి కొత్తగా టెక్నాలజీ, ఉద్యోగాలు, ఖ్యాతిని తీసుకురానుంది.
హరిబోన్ ఏరోనాటిక్స్ – డిఫెన్స్ రంగంలో ఏపీ చాప్టర్
రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తున్న హరిబోన్ ఏరోనాటిక్స్ సంస్థ, ఏపీలో రాడార్, జీపీఎస్, మిలటరీ కమ్యూనికేషన్ పరికరాల తయారీ యూనిట్‌కి ఆసక్తి చూపుతోంది. కేంద్ర ప్రభుత్వ ‘ఆత్మనిర్భర్ భారత్’ మిషన్‌కి అనుగుణంగా దేశీయంగా తయారయ్యే డిఫెన్స్ టెక్నాలజీలో ఏపీ భాగస్వామిగా మారనుంది. యువ ఇంజినీర్లకు ఇది గొప్ప అవకాశంగా నిలవనుంది.
Also Read: Wine shops closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఆ రెండు రోజులు వైన్ షాపులు బంద్!
డేటా సెంటర్స్ – రూ. 5,000 కోట్ల బంపర్ పెట్టుబడి
డిజిటల్ ఇండియా లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే దిశగా, CtrlS డేటా సెంటర్స్ సంస్థ రాష్ట్రంలో రూ. 5,000 కోట్ల పెట్టుబడితో భారీ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ఈ డేటా సెంటర్లు అమరావతి, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో ఏర్పాటు కానున్నాయి. క్లౌడ్ సర్వీసులు, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ స్టోరేజ్ రంగాల్లో CtrlS ముందుండే సంస్థ. ఈ యూనిట్లు ఏపీని డేటా హబ్‌గా మార్చే దిశగా ముందడుగు.
అమరావతిలో చర్చలు, ప్రభుత్వ హామీ
ఈ మూడు సంస్థల ప్రతినిధులు అమరావతిలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డిని కలసి తమ ప్రణాళికలను వివరించగా, ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి మద్దతు లభించనుంది. పెట్టుబడిదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అనుమతులు, భూములు అన్నింటికీ తగిన స్కీమ్‌లతో ముందుకు వస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఏపీ అభివృద్ధికి బెస్ట్ స్టెప్..
ఈ పెట్టుబడులతో రాష్ట్రానికి నేరుగా వేలాది ఉద్యోగాలు వస్తాయి. పరోక్షంగా మరిన్ని ఉపాధి అవకాశాలు, సహాయక పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. టెక్నాలజీ రంగంలో రాష్ట్రానికి గుర్తింపు వస్తుంది. ముఖ్యంగా యువతకు ప్రస్తుత విద్యకు అనుగుణంగా పరిశ్రమల్లో పనిచేసే అవకాశాలు లభిస్తాయి.
సామాన్యంగా పెట్టుబడులు అనగానే ఐటీ పార్కులు, ఫ్యాక్టరీలు మాత్రమే కళ్లకు కనిపిస్తాయి. కానీ ఈ పెట్టుబడులు మాత్రం మామూలు కాదు.. వాయుమార్గాల నుంచి అంతరిక్ష రక్షణల వరకూ, డిజిటల్ డేటా నుంచి భద్రత టెక్నాలజీ వరకూ విస్తరిస్తున్నాయి. ఇది ఏపీకి భవిష్యత్తు పునాది వేస్తున్న మార్గం!