Sangareddy Crime News: కుటుంబ కలహాలు ఆ ఫ్యామిలీలో చిచ్చుపెట్టాయి. సమస్యలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని భార్యభర్తలు ప్రయత్నించలేదు. ఫలితంగా ముగ్గురు చిన్నారులకు విషం ఇచ్చింది కన్న తల్లి. చివరకు ఆమె కూడా విషం తీసుకుంది. సంచలనం రేపిన ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది.
రంగారెడ్డి జిల్లా మెడకపల్లికి చెందిన చెన్నయ్య- రజిత దంపతులు. బతుకు దెరువు కోసం భార్యాభర్తలు సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని రాఘవేంద్ర కాలనీకి వచ్చారు. చెన్నయ్య డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 12 ఏళ్ల సాయికృష్ణ, 10 ఏళ్ల మధుప్రియ, ఎనిమిదేళ్ల గౌతమ్ ఉన్నారు. నిత్యం పిల్లల సందడితో ఆ ఇల్లు కళకళలాడేది.
పిల్లలు పెరిగి పెద్ద కావడంతో ఖర్చులు పెరిగాయి. చాలని జీతంతో నెట్టుకుంటూ వచ్చే చెన్నయ్య భారం పడింది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు మొదలయ్యాయి. అక్కడి నుంచి ఎడముఖం పెడముఖంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తెలీదు.
విధులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి భార్య రజిత, ముగ్గురు పిల్లలు నోటి నుంచి నురగలు కక్కుతూ కనిపించారు. అచేతనంగా పడి ఉన్నవారిని స్థానికుల సాయంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ముగ్గురు పిల్లలు చనిపోయారు. భార్య రజిత ఆసుపత్రిలో ఉంది.
ALSO READ: హైదరాబాద్‌లో యంగ్ డాక్టర్ ఆత్మహత్య
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. భర్త చెన్నయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పిల్లలు తినే పెరుగు అన్నంలో విషం కలిపింది తల్లి రజిత. ఆ తర్వాత ఆమె కూడా తిని ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. భార్య రజిత కొన ఊపిరితో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ చికిత్స తీసుకుంటోంది. వెంటనే పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఆమె నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.