Vastu Tips: ఇల్లు అనేది కేవలం ఇటుకలు, సిమెంట్‌తో కట్టిన కట్టడం మాత్రమే కాదు. అది మన భావోద్వేగాల సమాహారం, మన భవిష్యత్తుకు నిలయం. అందుకే కొత్త ఇల్లు కొనేటప్పుడు కేవలం ధర, సౌకర్యాలు మాత్రమే కాకుండా ‘వాస్తు’ను కూడా పరిగణనలోకి తీసుకోవడం మన సంప్రదాయంలో ఒక భాగం. సరైన వాస్తు ఉన్న ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. అంతే కాకుండా ఇది ఇంట్లోని వారికి ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కొత్త ఇల్లు కొనేటప్పుడు మీరు ఖచ్చితంగా చెక్ చేయాల్సిన ముఖ్యమైన వాస్తు నియమాలను గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఇంటి ముఖద్వారం:
వాస్తు శాస్త్రంలో ఇంటి ముఖద్వారానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇది శక్తి లోపలికి వచ్చే ద్వారం. కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ తూర్పు , ఉత్తరం లేదా ఈశాన్యం దిశల్లో ఉండటం అత్యంత శ్రేయస్కరం. నైరుతి దిశలో ద్వారం ఉండటం అశుభంగా భావిస్తారు. అలాగే.. ప్రధాన ద్వారం ఎదురుగా చెట్లు, స్తంభాలు లేదా ఇతర అడ్డంకులు లేకుండా చూసుకోవాలి.
2. ఈశాన్యం ఖాళీగా ఉండాలి:
ఈశాన్యం దేవతల మూలగా పరిగణించబడుతుంది. ఈ మూల ఎప్పుడూ తేలికగా, శుభ్రంగా ఉండాలి.అందుకే ఈశాన్యం మూలలో ఎప్పుడూ మెట్లు, టాయిలెట్లు లేదా భారీ బరువులు ఉండకూడదు. ఇది ఇంటి యజమాని ఆర్థిక స్థితిపై, పిల్లల చదువుపై ప్రభావం చూపుతుంది. ఈ మూలలో పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం లేదా నీటి నిల్వ ఉంచడం చాలా మంచిది.
3. వంటగది స్థానం:
వంటగది మన ఆరోగ్యానికి ప్రతీక. ఇది సరైన దిశలో లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వంటగది ఎప్పుడూ ఆగ్నేయ మూలలోనే ఉండాలి. వంట చేసేటప్పుడు తూర్పు వైపు ముఖం చేసి వండటం ఉత్తమం. వంటగది ఈశాన్యంలో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ వాస్తు నియమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
4. బెడ్‌రూమ్, నైరుతి మూల:
ఇంటి యజమాని నివసించే గదిని మాస్టర్ బెడ్‌రూమ్ అంటారు. ఇది ఇంటి స్థిరత్వాన్ని సూచిస్తుంది. మాస్టర్ బెడ్‌రూమ్ ఎల్లప్పుడూ నైరుతి దిశలో ఉండాలి. ఇది యజమానికి అధికారాన్ని, నిర్ణయాత్మక శక్తిని ఇస్తుంది. పడుకునేటప్పుడు తల దక్షిణం వైపు ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల గాఢ నిద్ర, మానసిక ప్రశాంతత లభిస్తాయి.
Also Read: శివలింగం, జ్యోతిర్లింగం మధ్య తేడా ఏంటి ?
5. బాత్‌రూమ్,టాయిలెట్స్:
ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో ప్రస్తుతం అటాచ్డ్ బాత్ రూం ఉంటుంది. కానీ ఇవి వాస్తు ప్రకారం లేకపోతే ప్రతికూల శక్తి పెరుగుతుంది. వీటి ఈ టాయిలెట్లు దిశ ఎల్లప్పుడూ వాయవ్యం లేదా పశ్చిమ దిశలో ఉండాలి పూజ గదికి ఆనుకుని లేదా వంటగదికి సరిగ్గా ఎదురుగా బాత్‌రూమ్‌లు ఉండకూడదు. ఇది ఇంటి పవిత్రతను దెబ్బతీస్తుంది.
కొత్త ఇల్లు కొనేటప్పుడు 100% వాస్తు కుదరడం అసాధ్యం కావచ్చు. కానీ ప్రధానమైన ఈశాన్యం, నైరుతి ,ఆగ్నేయ దిశలలో దోషాలు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. చిన్న చిన్న వాస్తు దోషాలను వాస్తు నిపుణుల సలహాతో పిరమిడ్లు లేదా రంగుల ద్వారా కూడా సరిదిద్దుకోవచ్చు. ఇల్లు కొనేముందు ఒక్కసారి వాస్తు నిపుణులను సంప్రదించడం వల్ల భవిష్యత్తులో వచ్చే సమస్యలను నివారించవచ్చు.