Chanakya niti: జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కో సారి ఊహించని కష్టాలు, సవాళ్లు మనల్ని చుట్టుముడతాయి. అలాంటి కష్టకాలంలో మనిషి తన వివేకాన్ని కోల్పోయి తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రపంచ ప్రసిద్ధ తత్వవేత్త ఆచార్య చాణక్యుడు తన ‘చాణక్య నీతి’ ద్వారా కష్టాలను ఎలా ఎదుర్కోవాలో, మానసిక ధైర్యాన్ని ఎలా ప్రోది చేసుకోవాలో అద్భుతమైన మార్గదర్శకత్వం చేశారు. సంక్షోభ సమయాల్లో.. మనం పాటించాల్సిన 3 అత్యంత శక్తివంతమైన చాణక్య బోధనల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1. భయాన్ని చూసి పారిపోవద్దు.. దానిని అంతం చేయండి:
చాణక్యుడి అత్యంత ప్రసిద్ధ సూత్రాలలో ఒకటి”భయం మన దగ్గరకు రాకముందే దానిని గమనించాలి. కానీ అది మన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం దానిపై దాడి చేసి నాశనం చేయాలి.”
కష్టకాలంలో భయం కలగడం సహజం. అయితే.. ఆ భయం మనల్ని లొంగదీసుకోకముందే మనం అప్రమత్తం కావాలి. సమస్యలు ఎదురైనప్పుడు చాలా మంది భయంతో వెనకడుగు వేస్తారు లేదా తప్పించుకోవాలని చూస్తారు. కానీ.. చాణక్యుడి ప్రకారం, మనం దేనికైతే భయపడుతున్నామో దానిని నేరుగా ఎదుర్కొన్నప్పుడే ఆ భయం అంతమవుతుంది. కష్టాలను ఒక సవాలుగా స్వీకరించి.. ధైర్యంతో పోరాడితే విజయం మన సొంతమవుతుంది.
2. వర్తమానంపై దృష్టి పెట్టండి:
కష్టాలు వచ్చినప్పుడు మనిషి గతంలో చేసిన తప్పుల గురించి బాధపడుతుంటాడు లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంటాడు. దీనిపై చాణక్యుడు ఇలా అంటారు.. “గతంలో జరిగిన దాని గురించి విచారించకూడదు. భవిష్యత్తు గురించి చింతించకూడదు. వివేకవంతులు ప్రస్తుత క్షణం గురించి మాత్రమే ఆలోచిస్తారు.”
కష్టకాలంలో మనం చేయగలిగిన ఏకైక పని ‘ప్రస్తుతం మన చేతుల్లో ఉన్న పనిని సమర్థవంతంగా చేయడం’. గతాన్ని మనం మార్చలేము, కానీ ప్రస్తుత నిర్ణయాల ద్వారా భవిష్యత్తును మార్చుకోగలము. సమస్యకు పరిష్కారం ప్రస్తుత క్షణంలోనే ఉంటుంది తప్ప, నిరాశలో ఉండదు. కాబట్టి, మీ శక్తిని వర్తమాన ప్రణాళికల కోసం ఉపయోగించండి.
3. ఆపద కాలం కోసం ఆస్తిని (జ్ఞానాన్ని) దాచుకోండి:
చాణక్యుడు ఆర్థిక క్రమశిక్షణకు , ముందుచూపుకు పెద్దపీట వేశారు. “కష్టకాలం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి సంపదను , జ్ఞానాన్ని నిరంతరం కూడబెట్టుకోవాలి.”
Also Read: ఇంట్లోని దుష్ట శక్తులు తొలగిపోవాలా ? పటికను ఇలా ఉపయోగించండి
ఇక్కడ సంపద అంటే.. కేవలం డబ్బు మాత్రమే కాదు, ‘జ్ఞానం’ కూడా. కష్టాల్లో ఉన్నప్పుడు మన స్నేహితులు లేదా బంధువులు మనకు తోడుగా ఉండకపోవచ్చు. కానీ మన దగ్గర ఉన్న జ్ఞానం, అనుభవం మనల్ని గట్టెక్కిస్తాయి. కష్టకాలంలో సహనం కోల్పోకుండా, మన దగ్గర ఉన్న వనరులను పొదుపుగా వాడుకుంటూ.. తెలివితేటలతో బయటపడాలని చాణక్యుడు బోధించారు. ఆత్మవిశ్వాసమే మన అతిపెద్ద ఆస్తి అని ఆయన నమ్మకం.
చాణక్యుడి బోధనలు కష్టాలను తట్టుకోవడమే కాదు. వాటిని అధిగమించి ఉన్నత స్థానానికి చేరుకోవడానికి సహాయ పడతాయి. ధైర్యం, వర్తమాన స్పృహ, సరైన ప్రణాళిక ఈ మూడు ఆయుధాలు మీ దగ్గర ఉంటే.. ఏ కష్టమైనా మీ ముందు తలవంచాల్సిందే. ఈ సూత్రాలను మీ జీవితంలో అన్వయించుకుని విజేతగా నిలవండి.