Aragonda Anjaneyaswamy Temple: ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మనసులోని భయాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా భూత, ప్రేత, పిశాఛాల కారణంగా మనసులో ఏర్పడిన భయాలు తొలగిపోవాలంటే అరగొండలోని వీరాంజనేయ స్వామిని దర్శించి, ఆయనకు నమస్కరించాలని పెద్దలు చెబుతారు. అరగొండ అసలు పేరు అర్థగిరి. ఈ క్షేత్రం చిత్తూరు నుంచి 22 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడి అర్థగిరి క్షేత్రాన్నే సంజీవరాయ క్షేత్రం అనీ పిలుస్తారు.
అర్థగిరిలోని ఆంజనేయ స్వామి ఆలయం పచ్చని కొండల మధ్య కొలువై ఉంటుంది. ఇక్కడి ఆలయంలో స్వామి ఉత్తర ముఖంగా దర్శనమిస్తాడు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకునే భక్తులు ముందుగా ఇక్కడి స్వామిని దర్శించుకోవటం సంప్రదాయం. శనివారం ఈ ఆలయానికి వెళ్లి పూజలు చేస్తారు. పౌర్ణమి రోజుల్లో విశేషంగా జరిగే పూజలూ, అందుకోసమే ప్రత్యేకంగా దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులను చూసినప్పుడు ఓ జాతరలా అనిపించడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.
స్థలపురాణం ప్రకారం, శ్రీలంకలో రావణుని చెరలో ఉన్న సీతాదేవిని విడిపించేందుకు శ్రీరాముడు వానర సేనతో లంకకు చేరతాడు. ఈ క్రమంలో రావణుడి కుమారుడైన ఇంద్రిజిత్తుకు, లక్ష్మణుడికి భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ సమరంలో ఇంద్రజిత్తు బాణాల ధాటికి లక్ష్మణుడు మూర్చపోతాడు. అప్పుడు వానర సేనలోని సుసేనుడు అనే వానర వైద్యుడు లక్ష్మణుడు మూర్చ నుంచి తేరుకోవాలంటే హిమాలయాలకు ఆవల ఉన్న సంజీవనీ మూలికను తీసుకురావాలని చెప్పగా, ఆంజనేయుడు ఆ పని మీద బయలుదేరతాడు.
Also Read More : శుక్రవారం శివుని పుత్రికకు పూజ.. మానసాదేవి చరిత్ర తెలుసా..!
అక్కడికి వెళ్లాక, అక్కడున్న అనేక మూలికల్లో ఏది సంజీవనీ వృక్షమో తెలియని ఆంజనేయుడు మొత్తం సంజీవనీ పర్వతాన్నే అరచేతితో ఎత్తి వాయువేగంతో లంకకు బయలుదేరతాడు. అయితే, మార్గమధ్యంలో ఆ పర్వంతంలోని సగభాగం ఆంజనేయుడి వేగానికి విరిగి భూమ్మీద పడుతుంది. నాడు అలా పడిన భాగమే అర్థగిరి. అదే అరగొండ పేరుతో ప్రఖ్యాతి చెందింది.
సంజీవనీ పర్వతంలోని సగం ఇక్కడ పడటంతో సంజీవనీ, సంధాన వంటి ఎన్నో ఔషధ మూలికలు ఇక్కడి నేలలో కలిసి పోయాయనీ, కొండ నేల మీద పడినప్పుడు ఇక్కడి నేల నుంచి జలధాల పైకి వచ్చిందనీ, అదే ఆలయం పక్కన ఉండే సంజీవరాయ తీర్థమని స్థల పురాణం చెబుతోంది. అనేక ఔషధ గుణాలున్న ఈ నీటిలో స్నానం చేస్తే అనేక రోగాలు నశిస్తాయని భక్తుల నమ్మకం. సప్తరుషుల్లో ఒకడైన కశ్యప మహర్షి ఇప్పుడున్న ఆలయంలోని ఆంజనేయ స్వామి మూర్తిని ప్రతిష్ఠించాడని ప్రతీతి.
ఇప్పుడున్న ఆలయం చోళుల కాలంలో నిర్మితమైందని ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. పౌర్ణమి రోజున ఇక్కడ స్వామి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఆలయానికి పోటెత్తుతారు. ఆ రోజున చంద్రకిరణాలు ఇక్కడి సంజీవరాయ తీర్థంలో పడి, పుష్కరిణిలోని నీరు మరింత ప్రభావవంతంగా మారుతుందని, ఆ రోజు పుష్కరిణిలోని నీటిని సేవిస్తే మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. వరుసగా 9 పౌర్ణములు ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటే మనసులోని కోరిక నెరవేరుతుందనే నమ్మకమూ ఇక్కడ బాగా ఉంది. ప్రతి పౌర్ణమికీ ఇక్కడ సుదర్శన హోమం, ప్రాకారోత్సవం, ఆకుపూజ, వడమాల సేవ నిర్వహిస్తారు.
ఆలయ ప్రాంగణంలోని వరసిద్ధి వినాయకుడి కోవెల, శివాలయం, అయ్యప్ప స్వామి మందిరం కూడా ఉన్నాయి. ఈ ఆలయానికి వెళ్లాలంటే ముందుగా చిత్తూరు పట్టణానికి వెళ్లి, అక్కడికి 22 కి.మీ దూరంలోని అరగొండకు నేరుగా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లొచ్చు.