Arunachalam Giri Pradakshina: స్మరణ మాత్రం చేతనే ముక్తి ప్రదాయకంగా భావిస్తారు అరుణాచలాన్ని. పంచ భూత లింగాలలో తర్వాత క్షేత్రం అరుణాచలం. ఈ అరుణాచలానికి ఎలా వెళ్లాలి? అసలీ క్షేత్రం వెళ్తే తొలుత ఏం చేయాలి? ఈ మధ్య కాలంలో శివ భక్తులను ఇంతటి విశేషంగా అరుణాచలం ఎలా ఆకర్షిస్తోంది? ఇప్పుడు చూద్దాం.
స్మరణాత్ అరుణాచలే- ప్రవచన కర్తలు
కాశీలో మరణిస్తే ముక్తి. అదే స్మరణాత్ అరుణాచలే.. అని అంటారు చాగంటి వంటి ప్రవచన కర్తలు. అరుణాచలాన్ని తలుచుకున్నా చాలని అంటారీ పండితులు. ఒక మనిషి అరుణాచలం వెళ్తే ఆ వ్యక్తి జీవితంలో ఒక మలుపు తీసుకుంటుందని అంటారు. పరమేశ్వరా నాకేం తెలీదు.. నా పాప ప్రక్షాళన చేయమని ఆయన్ను కోరుకుంటూ వెళ్తే సులభతరంగా అరుణాచలేశ్వరుడి దర్శనం జరుగుతుందని అంటారు.
కొండమొత్తం అరుణాచలేశ్వరుడిగా విశ్వాసం
ఎర్రటి కాంతులు కలిగిన పరమ శివుడు సర్వ మంగళ స్వరూపుడై ఇక్కడ కొలువుదీరాడనీ.. సకల జీవులకూ తన కాంతులను ప్రసరింప చేస్తుంటాడనీ అంటారు. అరుణాచలంలో వివిధ రూపాలతో ఉండే శివుడు. ఒకటి ప్రధానాలయంలోని లింగం ప్రధానమైనది కాగా.. అరుణాచలం కొండ మొత్తం అరుణాచలేశ్వరుడిగా చెబుతారు. ఇది తరతరాలుగా విశ్వసిస్తూ వచ్చిన ఒకానొక నమ్మకం. హిమాలయాలకన్నా పురాతన కొండగా అరుణాచలాన్ని గుర్తించారు భూగర్భ శాస్త్రవేత్తలు. అగ్నితత్వంతో ఒక వెలుగు వెలిగి చల్లారిన పర్వతంగా భావిస్తారు. యుగాలుగా రూపాంతరం చెందుతూ వచ్చిన పర్వత లింగంగా అభివర్ణిస్తారు.
శివుడి ఆజ్ఞ చేత విశ్వ కర్మ ద్వారా నిర్మించినదిగా ప్రసిద్ధి
అరుణాచలం లేదా అన్నామలై.. అనే పేరుగల ఈ క్షేత్రంలోని శివుడు, తమిళనాట వెలసిన నాలుగు పంచ భూత లింగాల్లో అగ్ని తత్వ లింగముగాపేరు. అరుణ అంటే ఎర్రటి, చలం అంటే కొండ. అని అర్ధం. అ- రుణ అంటే పాపములను హరించునదని కూడా అర్ధం. తమిళంలో ఈ ప్రాంతాన్ని తిరువణ్ణామలై అని కూడా అంటారు. తిరు అంటే శ్రీ, అణ్నామలై అంటే పెద్ద కొండ అని భావన.
శివుడాజ్ఞతో గౌతమ మహర్షి పూజా విధానం ఏర్పాటు
అరుణాచలం ప్రస్తావన ఎన్నో హైందవ పురాణాలలో కనిపిస్తుంది. ఇది శివుడి ఆజ్ఞ చేత విశ్వ కర్మ ద్వారా నిర్మించినదిగా చెబుతారు. దీని చుట్టూ అరుణపురం నిర్మించారనీ అంటారు. ఇక్కడ జరగాల్సిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివుడాజ్ఞ చేత ఏర్పాటు చేసినట్టుగా చెబుతుంది స్కాందపురాణంలోని అరుణాచల మహత్యం. మన పండితులు చెప్పినట్టు.. ఇక్కడి లింగమంతా ఒక ఎత్తు అయితే ఈ అరుణాచల పర్వతం మరొక ఎత్తు. ఈ కొండ మొత్తాన్నీ ఒక శివరూపంగా భావిస్తుంటారు. హిమాలయాల్లో కైలాస పర్వతం ఎలాగో.. సరిగ్గా అలాగే దక్షిణాదిన శివరూపంగా భాసిల్లే పర్వతం అరుణాచలేశ్వరం. ఇది జ్యోతిర్లింగాల్లో ఒకటి. తేజో లింగం కావడంతో.. అగ్నిక్షేత్రమని అంటారు.
ఈ కొండ చుట్టూ ప్రదిక్షిణం ఆ పరమేశ్వర ప్రదిక్షిణంతో సమానం
ఈ పర్వతం చుట్టూ ప్రదిక్షణ చేస్తే సాక్షాత్ ఆ పరమేశ్వరుడి చుట్టూ ప్రదిక్షిణం చేయడంతో సమానం. రమణ మహర్షి ఈ ఆలయ ప్రస్తావన పదే పదే చేయడం వల్ల కూడా ఈ ఆలయ విశిష్టిత మరింతగా ప్రాచుర్యంలోకి వచ్చిందని చెబుతారు. అందుకే ఇక్కడ ప్రతి రోజు వేలాది మంది భక్తులు గిరి ప్రదిక్షిణం చేస్తూ కనిపిస్తారు. దానికి తోడు ఈ పర్వతంలోని ఔషధ గుణాలు సైతం.. ఆరోగ్యపరంగానూ దివ్య ఔషధంగా పని చేస్తుందని విశ్వసిస్తారు.
పగటి వేళ కన్నా రాత్రి పూట ప్రదిక్షిణ చేయడం ఉత్తమం
అరుణాచలం వెళ్లిన వారు ప్రధానంగా నిర్వహించాల్సిన క్రతువు.. గిరి ప్రదిక్షిణం. ఈ మధ్య కాలంలో గిరి ప్రదిక్షిణ చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట నిర్మించారు. ఎక్కువ మంది పగటి పూటకంటే రాత్రి పూటే ఈ గిరి ప్రదిక్షిణ చేయడానికి ఇష్టపడతారు. రమణాశ్రమానికి రెండు కిలోమీటర్లు వెళ్లాక.. కుడి వైపునకు తిరిగి రోడ్డు మధ్యలో ఒక వినాయకుడి ఆలయం వస్తుంది. అక్కడి నుంచీ చూస్తే ఈ కొండ మొత్తం ఒక నందీశ్వర ఆకారంలో దర్శనమిస్తుంది. గిరి ప్రదిక్షిణ మొత్తం 14 కిలోమీటర్లుండగా.. మార్గ మధ్యంలో వచ్చే అష్ట లింగాలను దర్శించుకుంటూ వెళ్లాలి. అపుడే అరుణాచల గిరి ప్రదిక్షిణ చక్కటి ఫలితాన్నిస్తుందని విశ్వసిస్తారు. ఇక్కడే మోక్ష ద్వారాన్ని సైతం సందర్శించి.. ఆయా భక్తులు తమకిక జన్మలున్నాయా లేవా అన్నది కూడా ఒక పరీక్ష జరుపుతుంటారు.
పౌర్ణమి రోజున గిరి ప్రదక్షణంతో ఉత్తమ ఫలితం
ఈ గిరి ప్రదిక్షిణ చెప్పులు లేకుండా చేయాలి. అంతే కాదు ఎక్కువ లగేజీ ఉండరాదు. ఇక పౌర్ణమి రోజున చేయడం ఉత్తమ ఫలితాన్నిస్తుందని విశ్వసిస్తారు. ఈ ప్రదిక్షిణ ఎలాంటి కోరికలు లేకుండా చేయాలని అంటారు. అలాగే చిల్లర తీసుకెళ్లడం మరచిపోవద్దని కూడా చెబుతారు. గిరి ప్రదిక్షిణలో నేర్ శివాలయం ఉంటుంది. దీని అర్ధం శిఖరానికి ఎదురుగా ఉన్న శివాలయం అని అర్ధం. ఇక్కడి శివాలయ దర్శనం మరువరాదని అంటారు. అంతే కాదు.. ఇక్కడ నిత్యానంద ఆశ్రమం పక్కనే భక్త కన్నప్ప ఆలయం కూడా ఉంటుంది.
నిండు గర్భిణిలా ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణ చేయాలి
తెలుగు వారు మరచిపోకుండా ఈ ఆలయ సందర్శనంచేయాలని చెబుతారు. అరుణగిరి ప్రదిక్షిణంలో తలపై టోపీ ధరించరాదని అంటారు. గిరి ప్రదిక్షిణలో తోచినంత దాన ధర్మాలు చేస్తూ పోవడం మంచిదని అంటారు. అన్నదానాలు చేయడం మరింత ఉత్తమంగా చెబుతారు. త్వర త్వరగా గిరి ప్రదిక్షిణ చేయడంకన్నా నిండు గర్భిణిలా ఎంత నెమ్మదిగా ప్రదిక్షణం చేస్తే అంత మంచిదని అంటారు. గిరి ప్రదిక్షిణం చేసేటపుడు ఆగే ప్రతి ఆలయంలోని విభూతి ధారణ శ్రేష్టమైనదని అంటారు. పెళ్లికాని వారు, సంతాన భాగ్యం లేని వారు ఇక్కడి దుర్వాస ఆలయం పక్కన ఒక చెట్టుకు తాడు కట్టడం ఆచారం. అలా చేశాక.. చక్కటి ఫలితం వస్తుందని భక్తులు అధికంగా విశ్వసిస్తుంటారు.
89 నామాలను ఉచ్చరించాలని చెప్పే సాధువులు
ఇక అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టాలని అంటారు. స్వామి నాకు నీవు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటానో అదే ప్రసాదించమని కోరుకోవాలని చెబుతారు. ప్రదిక్షిణ చేస్తున్నంత సేపూ శివనామస్మరణ చేస్తూ వెళ్తుండగా కనిపించే సాధు సంతులకు తోచిన సాయం చేయమని చెబుతారు. అంతే కాదు ఈ ప్రదిక్షిణ ఉదయం పదిలోపు సాయంత్రం నాలుగు తర్వాత మొదలు పెట్టడం మంచిదని అంటారు. గిరి ప్రదిక్షణ చేసేటపుడు ఎడమ వైపుగానే చేయాలని అంటారు. కారణం దేవతలు, సిద్ధులు అదృశ్య రూపంలో ఈ గిరి ప్రదిక్షిణ చేస్తుంటారు కాబట్టి ఈ నియమం పాటించాలని అంటారు. అంతే కాదు అరుణాచల క్షేత్రానికి వెళ్లినపుడు ఏ నామాలను స్మరించాలో.. సాక్షాత్ ఆ పరమేశ్వరుడే నిర్ణయించినట్టు నమ్ముతారు. ఆ నామాలను శివుడు గౌతముడికి చెప్పాడనీ.. ఆ 89 నామాలను ఉచ్చరించాలని అంటారు.
ఆలయానికి 2 కి. మీ దూరంలో రమణాశ్రమం
రమణాశ్రమం అరుణాచలేశ్వరాలాయనికి 2 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు రమణాశ్రమాన్ని తప్పక సందర్శిస్తూంటారు. ఇక్కడ స్థానికులకంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తారు. సాయంత్రం సమయంలో రమణాశ్రమంలో చేసే ప్రార్థన చాల బాగుంటుంది . రమణాశ్రమంలో రమణుల సమాధిని సైతం సందర్శించవచ్చు. రమణాశ్రమంలో కోతులు ఎక్కువగా కనిపిస్తాయి. నెమళ్ళు కూడా ఎంతో స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. రమణాశ్రమంలో లక్ష్మి అనే గో సమాధితో పాటు, కాకి సమాధి, శునక సమాధిని కూడా చూడవచ్చు . ఇవన్నీ వరుసగా ఉంటాయి. అక్కడ గ్రంథాలాయంలో రమణ మహర్షికి చెందిన ఎన్నో పుస్తకాలు లభిస్తాయి. ఆశ్రమంలో ఉండాలంటే ముందుగానే వసతి కోసం పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
చెన్నై నుంచి 185 కి. మీ. దూరంలో అరుణాచలం
రమణాశ్రమం కంటే ముందే మనకు శేషాద్రి స్వామి ఆశ్రమం కనిపిస్తుంది. శేషాద్రి స్వామి సమాధి కూడా అక్కడే ఉంది. ఇక్కడా ఉండటానికి వసతి గదులు ఉన్నాయి. వీటిని ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
సాధారణ రోజులలో అరగంటలో దర్శనం
చెన్నై నుంచి 185 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది అరుణాచలం. చెన్నై నుంచి బస్సు, రైలు సౌకర్యం ఉంది. చెన్నై నుంచి అరుణాచలం చేరడానికి 4-5 గంటల సమయం పడుతుంది. ఇక హైదరాబాద్ ఉంచి అరుణాచలం చేరుకోడానికి ట్రైను లేదా బస్సులో వెళ్లొచ్చు. ట్రైన్లో అయితే సికిందరాబాద్ నుంచి తిరువణ్ణామలై స్టేషన్ కి నేరుగానే ట్రైన్లుంటాయి. అక్కడి నుంచి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంటుంది. బస్సులో అయితే విజయవాడ మీదుగా అరుణాచలం బస్సులు నడుస్తుంటాయి. ఆలయంలో దర్శనానికి సాధారణ రోజుల్లో 30 నిమిషాల నుంచి గంట సమయం పడుతుంది, వారాంతాల్లో ఇతర పండుగ రోజులలో 2-3 గంటల టైం పట్టవచ్చు.