Lord Hanuman: హనుమంతుని శక్తి అంటే అందరికి తెలిసిందే. అలాంటి హనుమంతుడి ముందు ఎంతటి మహా వీరులైనా, దేవతలైనా, అసురులైనా తలదించక తప్పదు. ఆయన కోపం అంటే ప్రకృతి కంపిస్తుంది, ఆయన గర్జన అంటే లోకాలే వణుకుతాయి. అలాంటి మహాశక్తి గల దేవుడికి ఈ ఆలయంలో మాత్రం బేడీలు వేసి కట్టారు. ఆ బేడీల వెనుక దాగి ఉన్న అద్భుతమైన కథ తెలుసుకోవాలంటే మనం పూరిలోని ఆ పవిత్ర ఆలయ చరిత్రలోకి వెళ్లాలి. ఈ ఆలయం ఒడిశా రాష్ట్రంలోని పూరి నగరంలో, జగన్నాథ ఆలయం సమీపంలో ఉంది.
ఈ ఆలయం ఎక్కడ ఉంది
ఒడిశా రాష్ట్రంలోని పురి పట్టణం ప్రపంచ ప్రసిద్ధి గాంచిన జగన్నాథ స్వామి ఆలయం వల్ల ఎంతో పవిత్రమైన స్థలంగా నిలిచింది. కానీ ఈ పవిత్రక్షేత్రంలో ఉన్న “బేడి హనుమాన్” ఆలయం వెనుక ఉన్న గాధ వినగానే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఆ ఆలయంలో ఉన్న హనుమంతుడిని చేతులకు, కాళ్లకు బేడీలు వేసి కట్టేశారు. దేవుడికే బేడీలు వేయడం అంటే వింతగానే అనిపిస్తుంది కదా! కానీ దానికి వెనుక ఒక గొప్ప కథ ఉంది.
శతాబ్దాల కథ ఇదే
చాలా శతాబ్దాల క్రితం పూరి సముద్రతీరంలో ఉన్న జగన్నాథ ఆలయానికి ప్రతీ సంవత్సరం సముద్రం విరుచుకుపడుతూ ఉండేది. భారీ అలలు కొట్టుకుని వస్తూ ఆలయ పరిసరాలను ముంచివేసేవి. ఎన్నో యజ్ఞాలు, పూజలు చేసినా సముద్రం ఆగేది కాదు. చివరికి జగన్నాథ స్వామి తన భక్తుడు హనుమంతుడిని పిలిచాడు. ఆయనకు అన్నాడు ఓ వీరాంజనేయా, ఈ సముద్రం నిరంతరం నా ఆలయాన్ని ముంచేస్తోంది. నీవు దాన్ని అడ్డుకుని నా ఆలయాన్ని కాపాడు. అంటాడు. దీనికి హనుమంతుడు వెంటనే ఆజ్ఞను స్వీకరించాడు. తన శక్తితో సముద్రం ముందు ఒక సరిహద్దు గీతను వేసి, ఇక్కడి దాటి నీరు రాకూడదు” అని చెప్పాడు. సముద్రం హనుమంతుని మాట విని వెనక్కి తగ్గింది. అలా ఆలయం సురక్షితమైంది.
కానీ ఓ ఘటన – సముద్రం మళ్లీ ఉప్పొంగడం
కానీ కొంత కాలానికే ఒక సంఘటన జరిగింది. హనుమంతుడు జగన్నాథుని ఆజ్ఞతో కాపాడే పనిలో ఉండగా, లంకలో జరుగుతున్న ఒక ముఖ్యమైన సీతా పూజ గుర్తొచ్చింది. ఆయనకు సీతాదేవి పట్ల ఉన్న భక్తి అపారమైనది. ఆ పూజను చూడాలనే కోరికతో హనుమంతుడు పూరి నుంచి లంకకు వెళ్లిపోయాడు. హనుమంతుడు అక్కడికి వెళ్లిపోయిన తర్వాత సముద్రం మళ్లీ ఉప్పొంగడం మొదలైంది. పెద్ద పెద్ద అలలు వచ్చి ఆలయానికి ప్రమాదం కలిగించాయి.
Also Read: Realme 15T 5G: రియల్‌మీ 15T 5G లాంచ్.. 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జర్‌తో అదిరిపోయే ఫోన్!
జగన్నాథుడు ఆగ్రహం- హనుమంతుడికి బేడీలు
జగన్నాథుడు దీనికి కారణం ఎవరో తెలుసుకుని కోపగించుకున్నాడు. వెంటనే హనుమంతుడిని పిలిచి అన్నాడు. నిన్ను ఈ ఆలయాన్ని కాపాడమని పంపాను. కానీ నీవు నీ స్వంత ఇష్టప్రకారం లంక వెళ్లిపోయావు. ఇకనుంచి నీకు ఎక్కడికీ వెళ్లే స్వేచ్ఛ ఉండదు. అంతట జగన్నాథుడు ఆయన చేతులకు, కాళ్లకు ఇనుప బేడీలు వేసి కట్టేశాడు. అప్పటినుంచి ఆ దేవుడిని బేడి హనుమాన్ అని పిలవడం ప్రారంభమైంది. బెడి అంటే బంధం, గొలుసు అని అర్థం. అలా ఆయనకు శాశ్వతంగా బేడీలు వేయబడ్డాయి.
ఈ ఆలయం ఎక్కడ ఉంది
ఈ ఆలయం పురి జగన్నాథ ఆలయానికి దగ్గరగా ఉంటుంది. అక్కడి హనుమంతుడి విగ్రహం కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఆయన చేతులు, కాళ్లకు నిజంగానే ఇనుప గొలుసులు కట్టబడ్డాయి. ప్రతీ రోజు పూజారులు హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. సముద్రం మళ్లీ ఎప్పుడూ ఆలయానికి హాని చేయకుండా ఉండటానికి ఆయనను భక్తులు ప్రార్థిస్తారు. స్థానికులు నమ్మకం ఉంచారు. బేడి హనుమాన్ ఉన్నంత కాలం పురి ఆలయానికి ఏ నష్టం జరగదని.
మరో విశ్వాసం
ఇంకో విశ్వాసం కూడా ఉంది. ఎవరికైనా జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నా, బంధనాల నుండి విముక్తి కావాలనుకున్నా, బెడి హనుమాన్‌ను దర్శిస్తే అన్ని కష్టాలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఆయన ముందు ప్రార్థన చేసినవారికి ధైర్యం, శాంతి కలుగుతుందని చెబుతారు. ఇదంతా ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని కూడా అందిస్తుంది. హనుమంతుడు లాంటి దేవతా పురుషుడు కూడా తన కర్తవ్యంలో నిర్లక్ష్యం చూపితే శిక్షకు లోనవ్వాల్సిందే. అంటే కర్తవ్యాన్ని ఎప్పటికీ మరవకూడదని ఈ కథ మనకు నేర్పుతుంది.
స్థానికుల విశ్వాసం
ఈ రోజు కూడా పూరి పట్టణ ప్రజలు సముద్రం గురించి మాట్లాడినప్పుడు ఒకే మాట చెబుతారు. మా సముద్రాన్ని బేడి హనుమాన్ అడ్డుకుంటున్నాడు. ఆ విశ్వాసం, ఆ భక్తి, ఆ కథ ఈ ఆలయాన్ని నేటికీ అద్భుతంగా నిలబెట్టాయి. సముద్రం ఎంత ఉప్పొంగినా జగన్నాథ ఆలయానికి హాని చేయదు. హనుమంతుడి బేడీలు ఇప్పటికీ ఆయన బాధ్యతను గుర్తు చేస్తూ భక్తుల మనసుల్లో భయం, భక్తి, విశ్వాసం కలిపిన సంకేతంగా నిలుస్తున్నాయి.