ఇటీవలే ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధాన్ని ఆపానని సంబరపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి కొత్త టాస్క్ మొదలైంది. పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ యుద్ధం దాదాపు ఖాయమైపోయింది. అంతర్జాతీయ సరిహద్దు వద్ద రెండు దేశాలు ఇటీవలే పరస్పర దాడులు చేసుకున్నాయి. వాటికి కొనసాగింపుగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అఫ్గాన్‌తో అన్ని సంబంధాలను నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో అఫ్గానిస్తాన్-పాక్ మధ్య జరుగుతున్న దాడులు మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.
ఎందుకీ గొడవ..?
పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య పాత పగలున్నాయి. అది దేశ సరిహద్దుల వద్ద వచ్చినవే. రెండు దేశాల మధ్య డ్యూరాండ్ రేఖ అంతర్జాతీయ సరిహద్దుగా ఉంది. దాన్ని పాకిస్తాన్ గుర్తిస్తుంది కానీ అఫ్గానిస్తాన్ గుర్తించదు. పాకిస్తాన్ మాత్రం డ్యురాండ్ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తుంది. 2021లో తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గొడవ మరింత ముదిరింది. చాలా చోట్ల తాలిబన్లు ఈ డ్యురాండ్ రేఖ వెంబడి పాకిస్తాన్ ఏర్పాటు చేసిన కంచెలను తొలగించారు. చెక్ పోస్ట్ లపై దాడులకు పాల్పడ్డారు. తాజాగా జరిగిన దాడుల్లో పాకిస్తాన్ కి చెందిన 23 మంది సైనికులు చనిపోగా, 29 మందికి గాయాలయ్యాయి. అదే సమయంలో 200 మందికిపైగా తాలిబాన్ మద్దతుదారులను తాము అంతం చేశామని పాక్ సైన్యం ప్రకటించింది. అయితే అఫ్గానిస్తాన్ వెర్ష్ మరోలా ఉంది. ఘర్షణల్లో 58 మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చామని తాలిబన్లు చెబుతున్నారు. తమ సిబ్బందిలో 9 మంది చనిపోయారని, 20 మందికిపైగా గాయాలపాలయ్యారని వారు ప్రకటించారు. ఈ ఘర్షణలు పెద్దవవుతున్న సందర్భంలో పాకిస్తాన్ నుంచి తాజా ప్రకటన వెలువడింది.
భారత్ వైఖరి ఏంటి?
అఫ్గానిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వాన్ని భారత్ అధికారికంగా గుర్తించలేదు. కానీ ఇటీవల అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో అఫ్గానిస్తాన్ ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉంది. అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ తొలిసారిగా భారత్‌లో పర్యటిస్తుండటం విశేషం. అంతర్జాతీయ సంబంధాల్లో స్థిరత్వంగా ఈ పర్యటనను భారత్ పేర్కొంది. అయితే భారత్ చర్యలను పాకిస్తాన్ తీవ్రంగా ఖండిస్తోంది. జమ్మూ కాశ్మీర్ ని భారత్ లో భాగంగా అఫ్గానిస్తాన్ పేర్కొంటోందని, ఇది సమర్థనీయం కాదని పాక్ తెలిపింది. మొత్తమ్మీద అఫ్గాన్ తో భారత్ సత్సంబంధాలు పాక్ కి బాగానే మంటపెట్టాయని తెలుస్తోంది. అదే సమయంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద తలెత్తిన వివాదాన్ని సున్నితంగా పరిష్కరించుకోవడం పాకిస్తాన్ కి సాధ్యపడటం లేదు. దీంతో పాక్, అఫ్గాన్ తో యుద్ధానికి సిద్ధం కావాల్సి వస్తోంది.
Also Read: డాలర్ కాయిన్ పై ట్రంప్ ఫోటో
నమ్మదగిన భాగస్వామి..?
2021కి ముందు భారత్, అఫ్గానిస్తాన్ కి ఆర్థిక సాయం చేసింది. 3 బిలియన్ డాలర్ల ఖర్చుతో అఫ్గానిస్తాన్‌లో బ్రిడ్జ్ లు, రోడ్లు, ఆస్పత్రులు, పార్లమెంట్ బిల్డింగ్ కూడా కట్టించింది. అయితే అక్కడ తాలిబన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత్ నుంచి ఆర్థిక సాయం ఆగిపోయింది. కానీ తాలిబన్లు మాత్రం భారత్ కి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా అఫ్గానిస్తాన్ లోని తాలిబన్ ప్రభుత్వం, భారత్ కు మద్దతు తెలిపింది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు అఫ్గాన్ విదేశాంగ మంత్రి భారత్ లో పర్యటిస్తున్నారు. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. పాక్ కి పక్కలో బల్లెంలా ఉన్న అఫ్గానిస్తాన్ తో భారత్ స్నేహం చేయడంపై చాలామంది సానుకూలంగా స్పందిస్తుండటం విశేషం.