Sravana Masam 2025: శ్రావణ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసాల్లో ఒకటి. ఈ మాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. శివారాధనకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈ మాసం చాలా అనుకూలమైనది. ఈ మాసంలో కొన్ని ప్రత్యేక పనులు చేయడం వల్ల అదృష్టం కలిసి వచ్చి, సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు.
శివలింగానికి అభిషేకం:
శ్రావణ మాసంలో ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేయడం పుణ్యప్రదం. ఈ మాసంలో పాలు, తేనె, పెరుగు, గంధం, పంచామృతంతో శివుడిని అభిషేకించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అంతే కాకుండా ఇలా చేయడం వల్ల ఇంట్లో ధన, ధాన్యాలకు లోటు ఉండదని, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుందని చెబుతారు.
రుద్రాక్ష ధారణ:
శ్రావణ మాసంలో రుద్రాక్షను ధరించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. రుద్రాక్ష శివుడికి చాలా ప్రీతిపాత్రమైనది. రుద్రాక్ష ధరించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని.. ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. అంతేకాకుండా.. రుద్రాక్ష ధారణ వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని కూడా చెబుతారు.
బిల్వ పత్ర సమర్పణ:
శివుడికి బిల్వ పత్రాలు అంటే చాలా ఇష్టం. శ్రావణ మాసంలో ప్రతి సోమవారం శివారాధనలో బిల్వ పత్రాలను సమర్పించడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం, సంపద కలుగుతాయని, జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయని చెబుతారు.
ఉపవాసం పాటించడం:
శ్రావణ మాసంలో సోమవారాలు ఉపవాసం ఉండడం చాలా పుణ్యప్రదంగా భావిస్తారు. ఉపవాసం ఉండి శివారాధన చేయడం వల్ల సుఖ సంతోషాలు కలుగుతాయని, కోరుకున్న వరాలు సిద్ధిస్తాయని అంటారు. ఉపవాసం వల్ల శారీరకంగా, మానసికంగా కూడా మంచి ప్రశాంతత లభిస్తుంది.
దానధర్మాలు:
శ్రావణ మాసంలో దానధర్మాలు చేయడం చాలా మంచిది. పేదవారికి ఆహారం, వస్త్రాలు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. ఈ మాసంలో చేసే ప్రతి దానం వంద రెట్లు తిరిగి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
Also Read: శని తిరోగమనం.. జులై 13 నుంచి వీరికి అన్నీ మంచి రోజులే !
మహా మృత్యుంజయ మంత్రం జపం:
శ్రావణ మాసంలో ప్రతిరోజూ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల అకాల మృత్యు భయం తొలగిపోయి.. ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్మకం. ఈ మంత్ర జపం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
శ్రావణ మాసంలో ఈ పద్ధతులను పాటించడం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా.. శారీరకంగా, మానసికంగా కూడా అనేక లాభాలు కలుగుతాయి. ఈ మాసంలో శివారాధన చేసి, ఆయన ఆశీస్సులు పొందడం ద్వారా జీవితంలో అదృష్టం మీ వెంటే ఉంటుంది.