బుద్ధ పూర్ణిమ హిందూ, బౌద్ధ సంప్రదాయాల్లో ఎంతో పవిత్రమైన రోజు. ఈ సంవత్సరం మే 1న ఈ పర్వదినం వస్తోంది. గౌతమ బుద్ధుడు జన్మించిన రోజు, జ్ఞానం పొందిన రోజు, మహాపరినిర్వాణం పొందిన రోజు అన్నీ ఈ పౌర్ణమి రోజే జరిగినట్లు విశ్వాసం. అందుకే ఈ రోజును ఎంతో భక్తితో, శాంతితో జరుపుకుంటారు. ఈ పవిత్ర సమయంలో ఇంటికి కొన్ని శుభవస్తువులు తీసుకురావడం వల్ల ఆనందం, ఐశ్వర్యం పెరుగుతాయని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా ఇంట్లో మంచి వాతావరణం ఏర్పడటానికి ఇవి సహాయపడతాయని నమ్మకం ఉంది.
బుద్ధుడి విగ్రహం
మొదటిగా బుద్ధుడి విగ్రహం చాలా ముఖ్యమని భావిస్తారు. ధ్యానం చేస్తున్న బుద్ధుడి విగ్రహం ఇంట్లో ఉంచితే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. రోజువారీ ఒత్తిడి తగ్గుతుంది. ఇంట్లో శాంతి వాతావరణం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఏనుగు ప్రతిమను కూడా ఈ రోజున తీసుకురావడం శుభంగా భావిస్తారు. ఏనుగు శక్తి, స్థిరత్వానికి చిహ్నం. దీనిని ఇంట్లో ఉంచితే నెగటివ్ ఆలోచనలు తగ్గుతాయని నమ్మకం. అలాగే కుటుంబంలో స్థిరత్వం పెరుగుతుందని చెబుతారు.
వెండి నాణెం కొనండి
వెండి నాణెం కూడా ఈ రోజున కొనడం మంచిదని భావిస్తారు. వెండి పవిత్రతకు సూచికగా భావిస్తారు. దీన్ని పూజ గదిలో ఉంచితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని విశ్వాసం. చిన్న నాణెం అయినా సరే, శుభసూచకంగా భావిస్తారు. శ్రీ యంత్రం కూడా చాలా ప్రత్యేకమైనది. ఇది లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతంగా పరిగణిస్తారు. ఇంట్లో శ్రీ యంత్రం ఉంచితే సంపద, సంతోషం పెరుగుతాయని చెబుతారు. దీన్ని శుభప్రదేశంలో ఉంచి ప్రతిరోజూ ప్రార్థన చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం ఉంది.
సముద్రపు గవ్వలు
సముద్రపు గవ్వలు సంపదకు చిహ్నంగా చెప్పుకుంటారు. పాతకాలం నుంచి ఇవి ధనానికి సూచికగా భావించేవారు. ఈ రోజున సముద్రపు గవ్వలు ఇంటికి తీసుకురావడం వల్ల ధనలాభం కలుగుతుందని విశ్వాసం ఉంది. వీటిని పూజ స్థలంలో ఉంచడం మంచిదని చెబుతారు. ఇవి మాత్రమే కాదు, బుద్ధ పూర్ణిమ రోజున కొన్ని మంచి పనులు చేయడం కూడా చాలా ముఖ్యమని పెద్దలు చెబుతారు. ఉదయం స్నానం చేసి దీపం వెలిగించడం శుభం. దీపం వెలిగించడం జ్ఞానానికి సంకేతం. చీకటిని తొలగించి వెలుగు తీసుకురావడాన్ని సూచిస్తుంది.
అలాగే ఈ రోజున దానం చేయడం ఎంతో మంచిది. పేదవారికి ఆహారం ఇవ్వడం, బట్టలు పంచడం వంటి పనులు చేస్తే పుణ్యం లభిస్తుందని విశ్వాసం ఉంది. ఇతరులకు సహాయం చేయడం బుద్ధుడు చెప్పిన ముఖ్యమైన మార్గాల్లో ఒకటి. సాత్విక ఆహారం తీసుకోవడం కూడా ఈ రోజున పాటించాల్సిన మంచి అలవాటు. మాంసాహారం దూరంగా ఉంచి సాదా ఆహారం తీసుకోవడం మంచిదని చెబుతారు. ఇది శరీరానికి, మనసుకు ప్రశాంతత ఇస్తుంది.
ధ్యానం చేయడం కూడా ఈ రోజున చాలా ముఖ్యమైనది. కొంత సమయం నిశ్శబ్దంగా కూర్చొని ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆలోచనలు సరిగా ఉండేందుకు సహాయపడుతుంది. బుద్ధుడు చెప్పిన మార్గంలో నడవడానికి ఇది ఉపయోగపడుతుంది. మొత్తానికి బుద్ధ పూర్ణిమ రోజున శుభవస్తువులు ఇంటికి తీసుకురావడం మంచిదే. కానీ వాటికంటే ముఖ్యమైనది మనలో మార్పు తీసుకురావడం. శాంతి, దయ, సహనం వంటి గుణాలు పెంపొందించుకోవడం ఈ పర్వదినం అసలు ఉద్దేశం. అలాంటి మంచి ఆలోచనలతో ఈ రోజు జరుపుకుంటే జీవితం మరింత ఆనందంగా మారుతుంది.