Char Dham Yatra: హిందూ భక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చార్ ధామ్ యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. అక్షయ తృతీయ రోజు సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ఆలయా ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఈ ఆలయాల ద్వారాలు తెరుచుకుంటే.. అధికారికంగా చార్‌ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. మంగళవారం ఉదయం 11.57 గంటలకు అభిజిత్ ముహూర్తంలో ముఖబా గ్రామం నుంచి గంగోత్రి ధామ్‌కు గంగామాత్ర డోలి బయలుదేరింది. ఈరోజు ఉదయం అక్షయ తృతీయ రోజున డోలి గంగోత్రి ధామ్ చేరుతుంది. ఉదయం పదిన్నర గంటలకు గంగోత్రి ఆలయ ద్వారాలను తెరుస్తారు. ఉదయం 11 గంటల55 నిమిషాలకు యమునోత్రి ధామ్ ఆలయ తలుపులు తెరువనున్నారు.
ఉత్తరాఖండ్‌లోని నాలుగు ప్రముఖ ఆలయాలైన గంగోత్రి, యమునోత్రి ఆలయాలు నేడు తెరుచుకోనుండగా.. కేదార్‌నాథ్ ఆలయం మే 2న, బద్రీనాథ్ ఆలయం మే 4న తెరుచుకోనున్నాయి. శీతాకాలం సందర్భంగా ఆరు నెలల పాటు ఆలయాలను మూసివేశారు. చార్‌ధామ్ యాత్రకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై ఉత్తరాఖండ్ డీజీపీ దీపం సేఠ్ సమీక్ష నిర్వహించారు.
కశ్మీర్ ఉగ్రదాడుల నేపథ్యంలో చార్‌ధామ్ యాత్రకు పటిష్టమైన భద్రతను కల్పిస్తున్నారు. చార్‌ధామ్ యాత్ర మార్గాన్ని 15 సూపర్ జోన్‌లు, 41 జోన్‌లు, 217 సెక్టార్‌లుగా విభజించారు. ఈసారి యాత్ర మార్గంలో మొత్తం 624 సీసీటీవీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. తొమ్మిది మంది ఏఎస్‌పీ, డీఎస్పీ స్థాయి అధికారులు భద్రతను పర్యవేక్షించనున్నారు.
ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైన చేయాలనుకునే కేదార్ నాథ్ యాత్ర. మనలో చాలా మంది తీర్ధయాత్రలు చేస్తుంటారు. అయితే అన్నిట్లోకల్లా చార్ థామ్ యాత్ర అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ చార్ ధామ్ యాత్రలో భాగంగా నాలుగు పవిత్రమైన పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఈ పర్యటనల్లో యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బద్రినాథ్ లను సందర్శిస్తారు. హిందీలో చార్ అంటే నాలుగు.. ధామ్ అంటే మత పరమైన గమ్యస్థానాలను సూచిస్తాయి. హిమాలయాల్లో అత్యంత ఎత్తైన పర్వతాల నడుమ ఉండే.. ఈ దేవాలయాల తలుపులు ప్రతి ఏటా దాదాపు ఆరునెలల పాటు మూసుకునే ఉంటాయి. ప్రతి సంవత్సరం వేసవికాలంలో, ఏప్రిల్ లేదా మే మాసంలో తెరుస్తారు. శీతాకాలం ప్రారంభంలో ఈ గుడితలుపులు మూసివేస్తారు. ఈ చార్ ధామ్ యాత్ర మఠం నుండి సాగుతుంది.
Also Read: ఐదేళ్ల తర్వాత కైలాస యాత్ర పున:ప్రారంభం.. మానస సరోవర్ ఎలా వెళ్ళాలి?
కేదార్‌నాథ్ ఆలయం పరమ శివుని 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు కేదార్నాధుడిని దర్శించుకునేందుకు వెళుతుంటారు. మహాశ శివుడిని దర్శనం చేసుకుంటే.. భక్తుల దుఃఖాలన్నీ తొలగిపోతాయని మత విశ్వాసం. కేదార్‌నాథ్ ధామ్‌కు వచ్చే భక్తులపై సర్వేశ్వరుడు ప్రత్యేక ఆశీస్సులు కురిపిస్తాడని, భక్తుల కోరికలను తీరుస్తాడని నమ్ముతారు. అలాగే పరమశివుడిని కొలిస్తే.. సకల సమస్యలు పరిష్కారమవుతాయని భక్తుల నమ్మకం. కేరానాథ్ శివాలయాలలోని స్వామి వారిని దర్శించుకుంటే ముల్లోకాలు చుట్టి.. ఆ పరమ శివుడి ఆశీస్సులు అనుగ్రహం పొందినట్లే అని భక్తులు విశ్వసిస్తుంటారు.