BigTV English

Kailash Manasarovar Yatra: ఐదేళ్ల తర్వాత కైలాస యాత్ర పున:ప్రారంభం.. మానస సరోవర్‌ ఎలా వెళ్ళాలి?

Kailash Manasarovar Yatra: ఐదేళ్ల తర్వాత కైలాస యాత్ర పున:ప్రారంభం.. మానస సరోవర్‌ ఎలా వెళ్ళాలి?

Kailash Manasarovar Yatra: హిమాలయ పర్వత సానువుల్లో కొలువైన పరమేశ్వరుని రూపాన్ని దర్శించుకునేందుకు ఘడియలు దగ్గరపడుతున్నాయి. ఐదేళ్ల విరామం తర్వాత.. పవిత్ర కైలాస యాత్ర మళ్లీ మొదలుకాబోతోంది. ఈ తీర్థయాత్రను వచ్చే జూన్ నుంచి ప్రారంభించాలని భారత్, చైనా నిర్ణయించాయి. కరోనా తర్వాత మొదలుకానున్న ఈ యాత్ర.. ఈసారి ఎలా ఉండబోతోంది? కైలాస పర్వతానికి, మానస సరోవర్ సరస్సుకి ఎలా చేరుకోవాలి? ఈసారి ఏయే మార్గాల ద్వారా యాత్ర సాగుతుంది?


కైలాస మానసరోవర్ యాత్రకు సర్వం సిద్ధం!

భారతీయులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే కైలాస మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి భారత్-చైనా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాయి. కరోనాతో పాటు రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇన్నేళ్ల పాటు ఈ పవిత్ర యాత్రని నిర్వహించలేదు. ఇటీవల భారత్, చైనా ప్రభుత్వాల మధ్య జరిగిన చర్చలతో.. ఐదేళ్ల క్రితం ఆగిపోయిన కైలాస మానస సరోవర్ యాత్రకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ యాత్ర రెండు ప్రధాన మార్గాల ద్వారా జూన్ నుంచి ఆగస్ట్ వరకు కొనసాగనుంది.


ఉత్తరాఖండ్ లిపులేఖ్ పాస్ ద్వారా 5 బ్యాచ్‌లకు అనుమతి

ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్ మార్గం ద్వారా.. 5 బ్యాచ్‌లను అనుమతించనున్నారు. ఒక్కో బ్యాచ్‌లో 50 మంది యాత్రికులు ఉంటారు. ఈ మార్గం.. 24 రోజుల పాటు తెరిచి ఉంటుంది. ఈసారి సిక్కింలోని నాథు లా పాస్ మార్గాన్ని కూడా తెరిచారు. ఈ మార్గం గుండా 10 బ్యాచ్‌లను అనుమతించనున్నారు. ఒక్కో బ్యాచ్‌కు 50 మంది యాత్రికులు ఉంటారు. నాథు లా పాస్ మార్గంలో అందరికీ అనుకూలమైన మోటార్ రవాణా సౌకర్యం కలిగి ఉంటుంది. ఈ యాత్ర భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఉత్తరాఖండ్ ప్రభుత్వం పర్యవేక్షణలో సాగుతుంది.

మౌంట్ కైలాస్ వ్యూ పాయింట్‌కు లిపులేఖ్ పాస్ మార్గం

ఉత్తరాఖండ్ మీదుగా వెళ్లే లిపులేఖ్ పాస్ మార్గం.. టిబెట్‌లోని మౌంట్ కైలాస్ వ్యూ పాయింట్ స్థానానికి చేరుకుంటుంది. ఈ రూట్.. శారీరంగా సవాళ్లతో కూడుకున్నదిగా ఉంటుంది. అంతేకాదు.. ఎక్కువగా ట్రెక్కింగ్ కలిగి ఉంటుంది. ఇక.. సిక్కిం నుంచి మొదలయ్యే నాథు లా పాస్ మార్గం.. టిబెట్‌లోని కైలాస్, మానసరోవర్ సరస్సుకు చేరుకుంటుంది. ఈ మార్గం రోడ్డు రవాణా ద్వారా సాగుతుంది. ఇది.. సీనియర్ సిటిజన్లకు తక్కువ శారీరక శ్రమ కోరుకునేవారికి అనువైనదిగా ఉంటుంది.

రెండు దేశాల మధ్య మళ్లీ స్నేహపూర్వక సంబంధాలు

తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో.. భారత్-చైనా బలగాల ఉపసంహరణ తర్వాత రెండు దేశాలు కలిసి తీసుకున్న సానుకూల నిర్ణయం ఇది. ఇప్పటికీ.. ఇండియా-చైనా బోర్డర్‌లో 50 నుంచి 60 వేల మంది సైనిక బలగాలు మోహరించి ఉన్నాయి. కొన్నేళ్లుగా భారత్-చైనా మధ్య నెలకొన్న వివాదాలు.. ఇటీవలికాలంలో తగ్గుముఖం పడుతున్నాయి. దాంతో.. రెండు దేశాల మధ్య మళ్లీ స్నేహపూర్వక సంబంధాలు బలపడుతున్నాయని చెప్పడానికి.. ఈ కైలాస యాత్రే లేటెస్ట్ ఎగ్జాంపుల్.

కైలాస మానస సరోవర్ యాత్రకు పాస్ పోర్ట్ కంపల్సరీ?

కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లాలంటే.. పాస్‌పోర్ట్ కచ్చితంగా ఉండాలి. ఈ జనవరి 1 నాటికి 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయసు మధ్యలోని వారై ఉండాలి. బాడీ మాస్ ఇండెక్స్ 27 కంటే తక్కువ కలిగి ఉండాలి. శారీరంగా ధృడంగా, ఆరోగ్యవంతులై ఉన్న వాళ్లు మాత్రమే ఈ ఆధ్యాత్మిక యాత్రకు అర్హులు. ఈ కైలాస మానసరోవర్ యాత్ర పూర్తి చేయాలంటే.. ఒక్కో భారతీయుడికి లక్షా 40 వేల నుంచి లక్షన్నరకు పైనే ఖర్చవుతుంది. ఇందులో.. రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు ఇతర ఖర్చులన్నీ కలిపి ఉంటాయి.

చైనా ప్రభుత్వానికే రూ.50 వేలకు పైగా చెల్లించాలి

యాత్రకు వెళ్లే వారికి.. చైనా వీసా కోసం కొంత చెల్లించాల్సి ఉంటుంది. అలాగే.. మెడికల్ టెస్టులతో పాటు టిబెట్‌లో బస చేసేందుకు, ప్రయాణాలకు, చైనా ప్రభుత్వానికి భారీగానే చెల్లించాలి. వీటికే 50 వేలకు పైగా ఖర్చవుతుంది. యాత్రికుల లగేజీలు తీసుకెళ్లే పోర్టర్స్ కోసం, గుర్రాల కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా.. మొత్తం కలిపి దాదాపు లక్షన్నర దాకా ఈ కైలాస మానస సరోవర్ యాత్రకు ఖర్చవుతుంది.

కైలాస మానస సరోవర్ యాత్రకు ఎంతో ప్రాముఖ్యత

చార్ ధామ్, అమర్‌నాథ్ యాత్రల మాదిరిగానే.. కైలాస మానస సరోవర్ యాత్రకు మన దేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా హిందువులు, బౌద్ధులు, జైన భక్తులకు అత్యంత ప్రముఖమైన, గౌరవప్రదమైన యాత్ర. హిమాలయాల్లో నెలవైన కైలాస పర్వతం.. ఈ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మొత్తం భూమికి ఆధ్యాత్మిక కేంద్రంగా కైలాస పర్వతం ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యాత్రికులు, యోగులు దీనిని సందర్శిస్తారు. పూజిస్తారు. ఆ పరమశివుని మోక్షానికి అత్యంత పవిత్రమైన యాత్రగా పరిగణిస్తారు. కైలాస పర్వతం కొలువైన ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయి ఉంటుందని నమ్ముతారు. భారతదేశ ప్రజలకు.. కైలాస పర్వతం ఓ సాధారణ శిఖరం కాదు.

భౌగోళిక అధ్బుతాలుగా కైలాస పర్వతం, మానస సరోవరం

ప్రధానంగా హిందువులంతా ఆ కైలాస పర్వతాన్ని శివుని నివాసంగా భావిస్తారు. శివపార్వతులు అక్కడే ఉంటారని నమ్ముతారు. అందుకోసమే.. హిందూ మతంలో కైలాస పర్వతానికి ఇంతటి ప్రాముఖ్యత ఉంది. జైన మతం ప్రకారం.. తొలి జైన తీర్థంకరుడు మోక్షం పొందిన ప్రదేశం కైలాసం. బౌద్ధమతంలో.. కైలాస పర్వతంపైనే బుద్ధుడు నివసిస్తుంటాడని నమ్ముతారు. టిబెట్‌లో బౌద్ధమతానికి పూర్వం ఉన్న బాన్ మతం కూడా.. ఈ ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక శక్తికి స్థానం అని నమ్ముతుంది. అందుకోసమే.. కైలాస పర్వతాన్ని నాలుగు మతాల వారు అత్యంత పవిత్రమైన స్థలంగా భావిస్తారు. కైలాస పర్వతం, మానసరోవరం సరస్సు.. ఈ ప్రపంచంలోని భౌగోళిక అద్భుతాలు మాత్రమే కాదు.. కొన్ని శతాబ్దాలుగా ఎంతోమందిని ఆకర్షించి మంత్రముగ్ధుల్ని చేస్తున్న ఆధ్యాత్మికతకు చిహ్నాలు. అందుకోసమే.. ఎంత ఖర్చయినా ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర స్థలాలను సందర్శించేందుకు వెళ్తుంటారు.

కైలాస యాత్రకు హిందువులు ఎందుకు ఇంతటి ప్రాముఖ్యతనిస్తారు?

కైలాస యాత్రకు హిందువులు ఎందుకు ఇంతటి ప్రాముఖ్యతనిస్తారు? కైలాస పర్వతం దగ్గరకు చేరుకున్నాక.. ఎలాంటి ఆచారాన్ని పాటిస్తారు? ఈ పవిత్ర యాత్రని.. అంతిమ తీర్థయాత్రగా ఎందుకు పరిగణిస్తారు? ఈ యాత్ర నిజంగానే జ్ఞానోదయం కలిగిస్తుందా? యాత్రికుల మనస్సు మారుస్తుందా? అంతా చెబుతున్నట్లు.. కైలాస పర్వతం చుట్టూ అదృశ్య శక్తి ఆవరించి ఉందా?

సముద్ర మట్టానికి 22 వేల అడుగుల ఎత్తులో కైలాస పర్వతం

మౌంట్ కైలాష్.! సాక్షాత్తూ.. ఆ పరమశివుడి ప్రతిరూపంగా భావించే.. పరమ పవిత్రమైన పర్వతం. ఆ శివుడు.. పార్వతీదేవితో కలిసి ఇక్కడ నివసిస్తున్నాడని హిందువులు నమ్ముతారు. సముద్ర మట్టానికి 22 వేల అడుగుల ఎత్తులో.. ఓ రాతి పిరమిడ్‌‌లా కనిపించే కైలాస పర్వతం చుట్టూ.. ఎన్నో రహస్యాలు దాగున్నాయి. మరెన్నో మిస్టరీలున్నాయ్.

అంతుచిక్కని రహస్యాలతో ముడిపడి ఉన్న కైలాస పర్వతం

ప్రశాంతమైన హిమాలయాల్లో.. అంతులేని ఆధ్యాత్మికత కొలువైన ప్రాంతంలో.. అంతుచిక్కని రహస్యాలతో ముడిపడి ఉంది కైలాస పర్వతం. దీనిపై సాక్షాత్తూ ఆ పరమశివుడే కొలువై ఉంటాడని.. హిందువులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. జగన్మాత పార్వతీదేవితో కలిసి.. ఈ కైలాస పర్వతంపైనే శివుడు కొలువై ఉన్నాడంటారు. అందుకే.. కైలాస పర్వతమంటే హిందువులకు ఎంతో నమ్మకం. అంతకుమించిన భక్తి. ఈ పర్వత దర్శనానికి వెళ్లే యాత్రికులు.. అక్కడ కైలాస పరిక్రమ్ ఆచారాన్ని పాటిస్తారు.

సాక్ష్యాత్తూ దేవతలు వచ్చి.. స్నానమాచరిస్తారనే నమ్మకం

ఈ శిఖరం చుట్టూ చేసే ప్రదక్షిణే కైలాస పరిక్రమ్‌గా పిలుస్తారు. ఈ ప్రదక్షిణ పూర్తి చేసేందుకు 2 నుంచి 3 రోజులు పడుతుంది. కైలాస పరిక్రమ్ పూర్తి చేయడం వల్ల జీవితంలో అదృష్టం, భగవంతుని ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. దీనిని ఆనుకొనే మానస సరోవరం సరస్సు ఉంటుంది. ఇది.. స్వచ్ఛతకు, మోక్షానికి మూలంగా పరిగణిస్తారు. అందులో.. సాక్షాత్తూ దేవతలు వచ్చి స్నానమాచరిస్తారని నమ్ముతారు. అందుకే.. ఈ కైలాస మానస సరోవరం యాత్రకు ఇంతటి ప్రాముఖ్యత.

శతాబ్ధాలుగా అందరిలో ఉన్న అనుమానం ఒక్కటే!

ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉండే ఈ శిఖరం.. అచ్చం శివలింగంలా కనిపిస్తుంది. ఈ పర్వతం స్వయంభువు అని నమ్ముతారు. అయితే.. శతాబ్దాలుగా అందరిలో ఉన్న అనుమానం ఒక్కటే! నిజంగానే.. అక్కడ శివుడు నివాసం ఉంటున్నాడా? భువిపై కొలువై ఉన్న నిజమైన కైలాసం ఇదేనా? దీనిని ఛేదించేందుకు.. ఎంతో మంది టూరిస్టులు, మరెందరో శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. కానీ.. ఇప్పటికీ.. కైలాస పర్వతం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. 6656 మీటర్ల ఎత్తుతో ఉండే కైలాస పర్వతంపైకి ఎక్కేందుకు ఇప్పటికీ.. ఎవ్వరూ సాహసం చేయట్లేదు. ఇందుకు.. గతంలో జరిగిన ఘటనలే వారిలో తెలియని భయాన్ని పుట్టిస్తున్నాయి. దీనికంటే ఎత్తైన శిఖరాలను సైతం అవలీలగా ఎక్కిన వారు కూడా.. ఈ కైలాస పర్వతాన్ని అధిరోహించే ఆలోచనని విరమించుకున్నారు.

కైలాస పర్వతం ఉన్న ప్రాంతంలో వేగంగా కదిలే కాలం

కొన్నేళ్ల కిందట కైలాస పర్వత శిఖరాన్ని చేరుకునేందుకు ఎంతోమంది ట్రెక్కర్లు, పర్వతారోహకులు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. అంతేకాదు.. కైలాస పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించిన కొందరు శాస్త్రవేత్తలు కూడా రెండేళ్ల లోపే మరణించారనే ఊహాగానాలున్నాయ్. అంతేకాదు.. ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించిన పర్వతారోహకులు.. త్వరగా ముసలివాళ్లయ్యారనే ప్రచారం ఉంది. వారి జుట్టు బూడిద రంగులోకి మారిపోయిందనే ప్రచారాలున్నాయ్. కైలాస పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నం చేసిన వారి వయసు కూడా వేగంగా పెరిగిందని.. వారంతా చాలా త్వరగా మరణించారనే కథనాలున్నాయి. ఇందుకు.. కైలాస పర్వతం ఉన్న ప్రాంతంలో కాలం వేగంగా కదలడమే ప్రధాన కారణం అంటారు. అదే.. ఈ పర్వతం వెనకున్న మరో బిగ్ మిస్టరీ!

ఎవరెస్ట్ కన్నా 2 వేల మీటర్లు తక్కువ ఎత్తులో కైలాస శిఖరం

నిజానికి.. హిమాలయ పర్వతశ్రేణుల్లో భాగంగా ఉన్న ఈ కైలాస శిఖరం.. ఎవరెస్ట్ కన్నా 2 వేల మీటర్లు తక్కువే ఉంటుంది. అయినప్పటికీ.. ఇప్పటివరకు కైలాస పర్వతాన్ని.. ఏ మానవ మాత్రుడూ అధిరోహించలేకపోయాడు. ఎలాంటి పాపం చేయని వ్యక్తి మాత్రమే.. కైలాస పర్వతాన్ని అధిరోహించగలరని నమ్ముతారు. భారతదేశమంతటా కాలచక్రం ఒకలా ఉంటే.. కైలాస పర్వతం దగ్గరికి వెళ్లేసరికి మాత్రం మరోలా మారుతుందనే ప్రచారాలున్నాయి. ఇక్కడ.. 12 గంటల సమయం 2 వారాలకు సమానం. ఈ ప్రదేశానికి గనక మనం వెళితే.. ఒక టైమ్ నుంచి మరో టైమ్‌కి ప్రయాణిస్తామనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయ్. ఈ పవిత్ర ప్రదేశాన్ని సందర్శించిన వాళ్లు స్వయంగా చెప్పిన మాటలివి.

ఇప్పటికీ అంతుబట్టని రహస్యంగానే మిగిలిన కైలాస పర్వతం

ఇక్కడ.. 12 గంటలు గడిపితే.. అది 2 వారాలకు సమానంగా ఉంటుందంటున్నారు. కైలాస పర్వతం దగ్గర.. కాలం చాలా వేగంగా కదులుతోందని చెబుతున్నారు. మనకు సాధారణంగా 2 వారాల్లో వెంట్రుకలు, గోర్లు ఎంత పెరుగుతాయో.. అక్కడ కేవలం 12 గంటల్లోనే అంతలా పెరిగిపోతాయంటున్నారు. ఇదెలా జరుగుతుందో.. దీని వెనకున్న కారణమేంటో.. అంతకుమించిన సైన్స్ ఏంటో.. ఇప్పటికీ అంతుబట్టని రహస్యంగానే మిగిలిపోయింది. కైలాస పర్వతం నీడలో ఉన్న ఈ టైమ్ బెండింగ్.. మిస్టరీని ఇప్పటిదాకా ఎవ్వరూ ఛేదించలేకపోయారు. అంతేకాదు.. ఈ పర్వతంపై మర్మమైన కాంతి వెలుగుతున్నట్లు కనిపిస్తుందంటారు. ఇక్కడి నుంచి వింత శబ్దాలు వస్తూ ఉంటాయని ఇంకొందరు చెప్పారు. ఇలా.. ఎన్నో రహస్యాలు ఈ పర్వతం చుట్టూ ముడిపడి ఉన్నాయి.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×