గుడికి వెళ్తే ఆ ఆధ్యాత్మిక వాతావరణంలో కాస్త మానసిక ప్రశాంతత లభిస్తుందనే విషయం నూటికి నూరుపాళ్లు నిజం అని అంటారు భక్తులు. అంటే మానసిక ఆరోగ్యం మెరుగవడానికి ఆలయాల సందర్శన అనేది ఒక సాధనం. శారీరక ఆరోగ్యం కూడా మెరుగవుతుందని మరికొందరి నమ్మిక. అయితే ఈ విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలున్నాయి. వైద్యం మానేసి గుడికి వెళ్లి మొక్కితే ఫలితం ఉంటుందా అని ప్రశ్నించేవారు కూడా ఉంటారు. ఈ ప్రశ్నల సంగతి పక్కనపెడితే.. తమిళనాడులోని ఓ ఆలయానికి ఓప్రత్యేకత ఉంది. ఆ ఆలయానికి వెళ్తే షుగర్ వ్యాధి తగ్గుతుందట. ఆ నమ్మకంతోనే షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఆ ఆలయానికి వెళ్తుంటారు.
తమిళనాడు ఆలయాలకు ప్రసిద్ధి. శివ కేశవుల ఆలయాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. అమ్మవారి ఆలయాలకు కూడా తమిళనాడు ఫేమస్. తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలోని కోయిల్వెన్ని ప్రాంతంలో ఒక విశేషమైన ఆలయం ఉంది. ఆ ఆలయాన్ని వెన్ని కరుంబేశ్వర టెంపుల్ గా పిలుస్తారు. మూలవిరాట్ వెన్ని కరుంబేశ్వరర్. ఆయన్ను త్రయంబకేశ్వరర్, రసపురీశ్వరర్, వెన్ని నాథర్ గా కూడా పిలుస్తారు. ఇక అమ్మవారిని అజగియా నాయకి, సౌందర నాయకిగా కొలుస్తారు. ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రక పేరు తిరువెన్ని. అదే ఇప్పుడు కోయిల్ వెన్నిగా మారింది.
ఆలయ చరిత్ర..
ఈ ప్రాంతం ఒకప్పుడు చెరకు తోటలతో దట్టంగా ఉండేది. ఈ ప్రదేశాన్ని సందర్శించిన ఇద్దరు ఋషులు శివుడు ఇక్కడ ఉన్న పవిత్ర వృక్షంలో కొలువై ఉన్నాడని భావించి పూజించారు. ఆ పవిత్ర వృక్షం చెరకు అని ఒకరు వాదించారు, మరొకరు దాన్ని వెన్ని అని అన్నారు. వారి వాదనలు విన్న శివుడు.. ఆ రెండు పవిత్ర వృక్షాలూ కావొచ్చు అని అన్నాడని, అలా అది వెన్నియూర్ అయిందని అంటారు. ఈ ప్రదేశానికి పవిత్ర వృక్షం పేరు మీదుగా వెన్నియూర్ అని పేరు పెట్టారు, తరువాత అది కోయిల్ వెన్నిగా మారింది.
The Temple That Cures Diabetes 🙏 pic.twitter.com/sjZ5TIRVgr
— Śrīrām 🇮🇳 (Modi's Family) (@Vadicwarrior) May 29, 2025
మూలవిరాట్ ప్రత్యేకత..
ఇక్కడ ఉన్న కరుంబేశ్వరర్ శివలింగం చాలా ప్రత్యేకమైనది. చెరకుగడల కాడల గుత్తి రూపంలో ఈ లింగం ఉంటుంది. దీనిని కరుంబు అని కూడా అంటారు. కరుంబు అంటే చెరకు అని అర్థం. చెరకు గడలతో తయారైన లింగరూపంలో స్వామిని కొలుస్తారు భక్తులు. ఇది నయనార్లచే కీర్తింపబడిన 275 శివాలయాలలో ఒకటి.
పంచదారే నైవేద్యం..
ఇక్కడ స్వామి వారికి భక్తులు తీపి పాయసం, చక్కెర పొంగలి నివేదిస్తారు. ఇక స్వామి ఆలయం చుట్టూ చక్కెరను చేతితో చల్లుతూ పోతారు. చెరకు అన్నా, చక్కెర అన్నా స్వామికి అత్యంత ఇష్టం అని భక్తుల నమ్మకం. అంతే కాదు, ఇక్కడ చక్కెరను నివేదిస్తే షుగర్ వ్యాధి తగ్గుతుందనే నమ్మకం కూడా ఉంది. షుగర్ వ్యాధితో బాధపడే ఎంతోమంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి చక్కెరను సమర్పిస్తారు. తమ శరీరంలో ఉన్న చక్కెర వ్యాధిని తొలగించమని ఆ పరమేశ్వరుడిని వేడుకుంటారు.
దేవుడి మహత్యమో, లేక భక్తుల నమ్మకమో తెలియదు కానీ, చాలామంది ఇక్కడకు వచ్చిన తర్వాత తమకు షుగర్ కంట్రోల్ లో ఉందని చెబుతుంటారు. అలా వారి మాటలు ఆనోటా ఈనోటా బాగా ప్రచారం పొందాయి. తమిళనాడునుంచే కాకుండా, దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. చక్కెర సమర్పిస్తుంటారు.