Lamp wick: ఇంట్లో దేవుడి ముందు వెలిగించిన దీపపు వత్తి పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుందో తెలుసా..? అసలు దీపపు వత్తి పూర్తిగా కాలిపోవడానికి గల కారణాలేంటో తెలుసా..? ఆధ్యాత్మికంగా గరుడపురాణం ప్రకారం దీపపు వత్తి పూర్తిగా కాలిపోవడంలో ఉన్న అంతర్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గరుడ పురాణం మరియు ఇతర ధర్మ శాస్త్రాల ప్రకారం, దీపారాధన విషయంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు, ఫలితాలు వివరించబడ్డాయి. సాధారణంగా దీపపు వత్తి పూర్తిగా కాలిపోవడంలో ఉన్న అంతర్యం గురించి గరుడపురాణంలో వివరంగా ఉందని పండితులు చెప్తున్నారు. అయితే ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గరుడ పురాణం ప్రకారం అర్థం: గరుడ పురాణంలో ప్రధానంగా మరణానంతర క్రియలు, ధర్మ సూత్రాల గురించి ఉన్నప్పటికీ, గృహస్థులు చేసే నిత్య పూజా ఫలాల గురించి కూడా ప్రస్తావన ఉందట.. దీపపు వత్తి పూర్తిగా కాలిపోవడం అంటే దోష నివారణ పరిహారం జరుగుతుందని అనుకోవాలట. దీపపు వత్తి నూనెతో పాటు పూర్తిగా కాలిపోవడం అంటే ఆ ఇంట్లో ఉన్న పితృ దోషాలు లేదా నకారాత్మక శక్తి (Negative Energy) అంతమవ్వడానికి అది సంకేతంగా బావించాలట. ఇక మీరు చేసిన పూజను లేదా సమర్పించిన దీపాన్ని దేవతలు సంపూర్ణంగా స్వీకరించారని, తద్వారా ఆ పూజకు పూర్ణ ఫలం లభిస్తుందని అర్థం చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
ఆధ్యాత్మిక సంకేతాలు: వత్తి పూర్తిగా కాలిపోవడంలో ఉన్న మరో సంకేతం కర్మల దగ్దం కావడం. అలాగే వత్తి పూర్తిగా కాలిపోవడం అనేది మనలోని అజ్ఞానం, అహంకారం మరియు గత కర్మలు దైవారాధనలో కరిగిపోవడానికి ప్రతీకగా బావించాలట. దీపం కొడిగట్టకుండా (మంట ఆరిపోకుండా), వత్తి చివర వరకు వెలిగి శాంతించడం అనేది ఆ కుటుంబానికి రాబోయే శుభ కాలానికి సూచనగా బావించాలని పండితులు సూచిస్తున్నారు.
శాస్త్రం చెబుతున్న జాగ్రత్తలు: దీపం వత్తి పూర్తిగా కాలిపోవడం విషయంలో గరుడ పురాణం మరియు ఇతర ఆగమ శాస్త్రాలు కొన్ని హెచ్చరికలను కూడా చేస్తున్నాయట. దీపం వెలుగుతున్నప్పుడు నూనె పూర్తిగా అయిపోయి, వత్తి మాడిపోయి నల్లటి పొగ రావడం అంత మంచిది కాదట. దీపం కొండెక్కే (ఆరిపోయే) ముందే మరికొంత నూనె పోయడం శ్రేయస్కరమని సూచిస్తున్నారు. అలాగే వత్తి పూర్తిగా కాలిపోయి ప్రమిద నల్లగా మారితే, వెంటనే ఆ ప్రమిదను శుభ్రం చేయాలట. మురికిగా ఉన్న ప్రమిదలో తిరిగి దీపం వెలిగించకూడదట. ఇక మీరు వెలిగించిన దీపం ప్రశాంతంగా, వత్తి చివర వరకు వెలిగి శాంతిస్తే అది అత్యంత శుభప్రదమని… మీ కోరికలు నెరవేరుతాయని, దైవ అనుగ్రహం మీపై ఉందని భావించవచ్చట. దీని గురించి ఎటువంటి భయం లేదా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని. భక్తితో నమస్కరించుకుని పూజను ముగించడం ఉత్తమమని పండితులు సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.