Tirumala Hundi: తిరుమలలో స్వామి వారికి భక్తులు కానుకలు సమర్పించే హుండీ నిండితే ఏం చేస్తారో తెలుసా..? హుడీ మార్చేస్తారు అనుకోవచ్చు కానీ ఆలా హుండీ మార్చడం కూడా తిరుమలలో ఒక పద్దతి ప్రకారం జరుగుతుంది. అయితే హుండీ మార్చే వరకు కొప్పెర అనే ఒక రకమైన తెల్లని గుడ్డను ఉంచుతారు. ఇప్పుడు ఆ కొప్పెర గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
కలియుగవైకుంఠం తిరుమల స్వామి వారికి భక్తులు కానుకలు సమర్పించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. వడ్డికాసుల వాడి అప్పు తీర్చేందుకు భక్తులు స్మామి వారికి కానుకలు సమర్పిస్తుంటారని పండితులు చెప్తుంటారు. అయితే స్వామి వారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు హుండీలను ఏర్పాటు చేస్తారు. అయితే ప్రతిరోజూ వేలాదిగా తరలి వచ్చే భక్తులు ఇచ్చే కానుకలు వేలాదిగానే ఉంటాయి. అలాంటప్పుడు మామూలు హుండీలు అయితే గంటకో రెండు గంటలకో నిండిపోతుంటాయి. గుడి మధ్యలో ఉన్న నిండిపోయిన హుండీలను మార్చడం అనేది కూడా తిరుమలలో పెద్ద తతంగమే అని చెప్పాలి. అందుకోసమే దేవస్థానం బోర్డు అధికారులు ఆ సమస్య పరిష్కారం కోసం కొప్పెర అనే తెల్లగుడ్డ పద్దతికి శ్రీకారం చుట్టారు.
కొప్పెర అంటే మూతి వెడల్పుగా ఉండే లోహపాత్ర అని అర్థం. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీ గబగబా నిండిపోతూ ఉంటుంది కాబట్టి పెద్ద గంగాళంలా ఉండే పాత్రను హుండీగా తెల్లనిగుడ్డ అడుగు భాగంలో ఉంచుతారు. ఆ హుండీ పాత్రను కొప్పెర అంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ కొప్పెరలను హుండీలుగా వాడతారు. హుండీ నిండిందని తెలుస్తూనే అక్కడే ఉన్న సిబ్బంది మరొక హుండీని ఏర్పాటు చేస్తారు. కొంతమంది వంశపారంపర్యంగా ఈ హుండీల దగ్గర పనిచేయడం, హుండీలు నిండిన వెంటనే వాటిని అలాగే కర్రల సహాయంతో మోసుకొని తిరుపతిలోని హథీరాంజీ మఠానికి తీసుకురావడం జరిగేది.
పూర్వం తిరుమల ఆలయ నిర్వాహకులైన మహంతులు ఈ మఠంలో హుండీలోని డబ్బును లెక్కించేవారు. అలా హుండీల దగ్గర పనిచేసే వాళ్ళని కొప్పెరవాళ్ళని, వాళ్ళు నివశించే పల్లెకు “కొప్పెరవాండ్ల పల్లి” అనే పేరు వచ్చిందంటారు. శ్రీనివాసా మంగాపురం వెళ్ళే దారిలో కొప్పెరవాండ్ల పల్లి ఉంది. హుండీలో భక్తులు వేసిన డబ్బును, నగలను వేరు చేసి లెక్కించే దేవస్థానం ఖజానాకు పంపించే తంతును “పరకామణి” అంటారు.ఇది రెండు విడతలుగా జరుగుతుంది. రాత్రి హుండీని దేవస్థాన ఉద్యోగులు ఉదయం లెక్కిస్తారు. ఉదయం విప్పిన హుండీని మధ్యాహ్నం లెక్కిస్తారు. రాత్రి నిద్రించిన హుండీని “తోకముల్లె” అని అంటారు.
కొప్పెరలో మన డబ్బే కాదు విదేశీ కరెన్సీ, నాణేలు కూడా భక్తులు వేస్తుంటారు. హుండీ ద్వారా వచ్చే పట్టువస్త్రాలను దేవస్థానం వారు తమ పరధిలోని ఆలయాలలో కావలసిన సేవలకు, పండుగలకు ఉపయోగించుకుంటారు. అలా ఉపయోగించలేక పోయిన పట్టువస్త్రాలను, నగలను, బంగారు వస్తువులను, వజ్రాలు పొదిగిన ఆభరణాలను, వెండి వస్తువులను వేలం వేస్తారు లేకపోతే విలువైన, నాణ్యమైన వాటిని శ్రీవారి ఖజానాలో భద్రపరుస్తారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.