Harish Rao Letter: తెలంగాణ క్యాబినెట్‌ను ఢిల్లీకి పిలిపించుకుని ‘సమీక్ష’ను చూస్తుంటే.. ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకుంటోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. స్వయం పాలన కోసం, స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం.. ఇవాళ మీ ఢిల్లీ దర్బార్‌లో మోకరిల్లడం ఈ నేల ఆత్మగౌరవాన్ని భంగపరుస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్నది ఒక స్వతంత్ర ప్రభుత్వాన్నా? లేక మీ ఢిల్లీకి గులాంగిరి చేసే సామంత ప్రభుత్వాన్నా? అని ప్రజలు వాపోతున్నారని పేర్కొన్నారు.
జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సహా ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, కర్ణాటక సీఎం సిద్దారామయ్యకు బుధవారం హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. ఇచ్చిన హామీలు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇప్పటికే రెండున్నరేండ్లు గడిచిందన్నారు. హామీలకు కట్టుబడి త్వరగా నెరవేర్చాలని, ఆ దిశగా సీఎంకి హితబోధ చేయాలని కోరారు. మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని మీరు హామీ ఇచ్చారని, తీరా చూస్తే బిల్లు ‘నిల్లయింది’, ప్రజల విశ్వాసం ‘కిల్లయింది’ అంటూ ఎద్దేవా చేశారు. ఈ ప్రజా విద్రోహానికి క్షమాపణలు చెబుతూ మీ సమీక్ష ప్రారంభించండి అని సూచించారు.
ఆరు గ్యారెంటీల అమలుకు సోనియా గాంధీ స్వయంగా హామీ ఇస్తూ బాండ్ పేపర్లపై సంతకాలు పెట్టి ప్రజల ఓట్లు పొందారని హరీశ్ రావు గుర్తు చేశారు. సీఎం నిర్వాకంతో ఆ బాండులకు విలువ లేకుండా పోయిందన్నారు. రాహుల్ గాంధీ.. వరంగల్ రైతు డిక్లరేషన్ లో మీరు ఇచ్చిన హామీలను మీరే విస్మరించారు. వాటిని మీకు మళ్లీ గుర్తు చేస్తున్నానన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, కౌలు రైతులకు కూడా రైతు భరోసా లబ్ది చేకూర్చుతామని, ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 12వేలు ఇస్తామని, అన్ని రకాల పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లిస్తామని, పంట బీమా కల్పిస్తామని నమ్మబలికారన్నారు. ఇప్పుడు ఈ హామీలన్నీ నీటి మూటలు అయ్యాయని హరీశ్ రావు ఆరోపించారు.
రుణమాఫీ సగం మందికి ఎగ్గొట్టారని, రెండు పంటలకు రైతు భరోసా ఎగ్గొట్టారని, పంట బోనస్ ఒక పంటకే పరిమితం చేశారని హరీశ్ రావు విమర్శించారు. నమ్మిన రైతులను నట్టేట ముంచిన మీ ప్రభుత్వ నయవంచనపై సమీక్ష చేస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి క్రమం తప్పకుండా ఖాళీలు భర్తీ చేస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చిన విషయాన్ని హరీశ్ రావు గుర్తుచేశారు. కానీ వాటన్నింటిని విస్మరించారని మండిపడ్డారు.
Also Read: Harish Rao: బాల్క సుమన్‌ను.. వెంటనే రిలీజ్ చేయాలి.. హరీశ్ రావు డిమాండ్
మల్లికార్జున ఖర్గే.. ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచుతామని, అన్ని ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్లలో, కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో అనేక హామీలు గుప్పించారని బహిరంగ లేఖలో హరీశ్ రావు గుర్తుచేశారు. కానీ వాటిని అమలు చేయకుండా దళిత బిడ్డలను దగా చేశారన్నారు. ఓట్లు దండుకున్న మీ నమ్మక ద్రోహంపై ఏమని సమీక్ష చేసుకుంటారు? అని నిలదీశారు. ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ, పాలన గాలికి వదిలేస్తూ ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న ముఖ్యమంత్రి వైఖరితో తెలంగాణ బతుకు తెల్లారిపోతున్నదని మండిపడ్డారు.
Also Read: BJP: ఢిల్లీలో ఢీ.. గల్లీలో దోస్తీ? బీజేపీ ‘డబుల్ గేమ్’పై రాజకీయ రచ్చ!