Lord Shiva: శివుడి పేరు వినగానే మనకు పులిచర్మం, మెడలో నాగుపాము, తలపై గంగాదేవి, విభూది, ప్రధానంగా అర్ధనారీశ్వర రూపం గుర్తుకొస్తాయి. శివాలయాల్లో శివుడిని అర్ధనారీశ్వర రూపంలో కాకుండా లింగ రూపంలో ఎందుకు పూజిస్తారని చాలామంది సందేహపడతారు. అర్ధనారీశ్వర రూపంలో శివుడిని కొలిచే ఆలయాలు చాలా తక్కువ. కానీ శివాలయం అంటే మాత్రం శివుడి లింగ రూపమే మనసులో మెదులుతుంది. అయితే శివుడిని లింగ రూపంలో ఎందుకు కొలుస్తారో తెలుసుకుందాం.
కారణం ఏంటి?
హిందూ ఆలయాల్లో శివుడిని అర్ధనారీశ్వర రూపంలో కాకుండా లింగ రూపంలో ఎక్కువగా పూజించడానికి ఆధ్యాత్మిక, తాత్త్విక, సాంస్కృతిక కారణాలు ఉన్నాయి. శివలింగం శివుడి స్వరూపాన్ని సూచించే పవిత్ర చిహ్నం. ఇది భౌతిక, ఆధ్యాత్మిక ప్రపంచాలను చూపిస్తూ శివుడి నిరాకార, సాకార స్వభావాలను తెలియజేస్తుంది. శివలింగం శివుడి నిరాకారత్వాన్ని సూచిస్తుంది. లింగం సాధారణ గుండ్రని రాయి లాంటిది, ఎటువంటి ఆకారం లేకుండా ఉంటుంది. ఇది శివుడి నిరాకార స్వభావాన్ని చూపడమే కాకుండా, శివుడు అన్ని చోట్లా ఉన్నాడనే భావనను భక్తుల్లో కలిగిస్తుంది. ఈ నిరాకార రూపం భక్తులను రూపంలేని దైవత్వంపై ధ్యానించేలా ప్రేరేపిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.
శివలింగం సృష్టికి ప్రతీక. లింగం శివుడి పురుష శక్తిని సూచిస్తే, దాని కింద ఉన్న యోని ప్రకృతి లేదా స్త్రీ శక్తిని సూచిస్తుంది. శివలింగంలోని ఈ స్త్రీ, పురుష శక్తులు సృష్టి మూలాన్ని, అర్ధనారీశ్వర రూపాన్ని తెలియజేస్తాయి. శివపురాణం, లింగపురాణం వంటి గ్రంథాలు శివలింగాన్ని సృష్టి ఆది శక్తిగా వర్ణిస్తాయి.
శివుడిని దగ్గరవ్వడానికి..
శివలింగం భక్తికి, ధ్యానానికి సులభమైన రూపం. ఇది సంక్లిష్ట విగ్రహాల కంటే సరళంగా ఉంటూ, భక్తులు తమ ఆలోచనలను దేవుడి రూపంపై కాకుండా దేవుడిపై కేంద్రీకరించేలా చేస్తుంది. శివలింగానికి చేసే అభిషేకాలు, పూజలు, అర్చనలు భక్తులను శివుడికి దగ్గర చేస్తాయి. ఇవి భక్తులకు దేవుడితో ఆధ్యాత్మిక సంబంధాన్ని బలపరుస్తాయని ఆధ్యాత్మికవాదులు అంటారు.
స్త్రీ, పురుష శక్తులు
శివలింగానికి సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యత ఉంది. కాశీ, సోమనాథ్, కేదారేశ్వర్ వంటి పురాతన ఆలయాల్లో శివుడిని లింగ రూపంలో కొలుస్తారు. ఈ ఆలయాలు శివలింగ పూజ, దాని పవిత్రత, ఆధ్యాత్మిక శక్తిని భక్తులకు గొప్పగా చెబుతాయి. శివలింగం శివుడి అపార శక్తికి, సృష్టి మూలానికి చిహ్నం. భక్తి భావాన్ని, స్త్రీ, పురుష శక్తులను సూచిస్తూ, హిందూ ఆలయాల్లో శివలింగాన్ని శివుడి ప్రధాన రూపంగా కొలిచి పూజిస్తారు.