Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నుంచి కాలినడకన వెళ్లే దారిలో ఉన్న మొదటి మెట్టుకు ఆధ్యాత్మికంగా మరియు చారిత్రక పరంగా ఎంతో విశిష్టత ఉంది. భక్తులు కొండ ఎక్కడం ప్రారంభించే ముందు ఈ మొదటి మెట్టును దర్శించుకోవడం ఒక పవిత్రమైన సంప్రదాయం బావిస్తారు.
శ్రీవారి పాదాల గుర్తులు (పాదాల మండపం): అలిపిరి నుంచి తిరుమలకు కాలినడక మెట్ల మార్గంలో వెళ్లే దారిలో మొదటి మెట్టు దగ్గరే శ్రీవారి పాదాల మండపం ఉంటుంది. పురాణాల ప్రకారం, శ్రీవేంకటేశ్వర స్వామి వారు వైకుంఠం నుండి భూలోకానికి వచ్చినప్పుడు, తిరుమల కొండపైకి వెళ్లినప్పుడు తన మొదటి అడుగును ఇక్కడే వేశారని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు కొండ ఎక్కే ముందు ఆ పాదపద్మాలకు నమస్కరించి యాత్రను ప్రారంభిస్తారు.
స్వామి వారి పాదరక్షలు: మొదటి మెట్టు గురించి మరో పురాణగాథ ప్రచారంలో ఉంది. ఏ ఏడుకొండల స్వామి కొండపైకి వెళ్లేటప్పుడు తన పాదరక్షలను (చెప్పులను) ఈ మొదటి మెట్టు వద్దే విడిచి వెళ్ళారట. దీనికి గుర్తుగా ఇప్పటికీ అలిపిరి పాదాల మండపంలో స్వామి వారి భారీ పాదరక్షలు దర్శనమిస్తాయి. భక్తులు వీటిని తమ తలపై ఉంచుకుని ఆశీర్వాదం పొందుతారు.
శరణాగతికి చిహ్నం: అలిపిరి అనే పదానికి “అడిపులి” (అడుగు భాగం) అనే అర్థం ఉందట. భక్తులు తమ అహంకారాన్ని వదిలి, స్వామివారికి పూర్తిగా శరణాగతి ప్రకటించడానికి సంకేతంగా మొదటి మెట్టుకు పసుపు, కుంకుమలు రాసి, కర్పూరం వెలిగించి మొక్కులు చెల్లించుకుంటారట అందుకే మొదటి మెట్టుకు అంత ప్రత్యేకత అంటున్నారు పండితులు.
చారిత్రక ప్రాధాన్యత: పూర్వం రాజులు, చక్రవర్తులు (ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు వంటి వారు) కూడా భక్తితో ఈ కాలిబాటలోనే ప్రయాణించేవారు. ఈ మార్గం భక్తుల సహనానికి, భక్తికి పరీక్షగా నిలుస్తుందని భావిస్తారు. అందుకే మొదటి మెట్టు ప్రాధాన్యతను ఆనాడే తెలిపారని నమ్ముతారు.
అయితే తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం ఎక్కువ వినియోగంలో రెండు నడకదారులు ఉన్నాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనది అలిపిరి కాలినడక.. రెండోది శ్రీవారి మెట్టు నడక మార్గం.. అలిపిరి మార్గం నుంచి తిరుమలకు చేరుకోవాలంటే సుమారు 3550 మెట్లు ఉంటాయి. అయినా సరే ఈ మార్గం నుంచే భక్తులు ఎక్కువ సంఖ్యలో కొండ మీదకు వెళ్తుంటారు. ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన మార్గమే కాకుండా సాంప్రదాయక మార్గం అని కూడా పండితులు చెప్తుంటారు.
ఇక రెండొ మార్గం శ్రీవారి మెట్టు నడక మార్గం. ఇది చంద్రగిరి వైపు నుంచి ఉంటుంది. తిరుపతి నుంచి సుమారు 15 కిలోమీటర్లు వెళ్లాలి. సాక్ష్యాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామే తన వివాహం తర్వాత ఈ మార్గం నుంచి కొండ మీదకు వెళ్లారని చెప్తుంటారు. అందుకే ఈ మార్గానికి శ్రీవారి మెట్టు అని పిలుస్తుంటారు. ఈ మార్గంలో 2388 మెట్లు ఉంటాయట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.